వ్యభిచార ముఠా ఉచ్చులో టీవీ సీరియల్ నటి : పోలీస్ ఆపరేషన్ తో వెలుగులోకి..

వ్యభిచార ముఠా ఉచ్చులో టీవీ సీరియల్ నటి : పోలీస్ ఆపరేషన్ తో వెలుగులోకి..

మహారాష్ట్రలోని థానే నగరంలో వెలుగుచూసిన ఒక షాకింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో రాణించాలనే కలలతో ముంబైకి వచ్చే యువతుల జీవితాలతో చెలగాటమాడుతున్న.. వ్యభిచారం, మానవ అక్రమ రవాణా ముఠా గుట్టును థానే పోలీసులు రట్టు చేశారు. ఈ ఘరానా రాకెట్ బారినపడి మోసపోతున్న ఒక 35 ఏళ్ల హిందీ టీవీ సీరియల్ నటిని పోలీసులు సురక్షితంగా రక్షించారు.

ఒక ఎన్జీఓ అందించిన పక్కా సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు.. అక్టోబర్ 8, 2026 న మీరా-భయందర్ రోడ్డులోని ఒక హోటల్‌కు డెకాయ్ కస్టమర్‌ను పంపారు. అక్కడ వ్యభిచారానికి పాల్పడుతున్న తబస్సుమ్ అలియాస్ సోనియా ఉమర్ ఖురేషి అనే మహిళను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ నిందితురాలు ముంబైలోని జోగేశ్వరిలో నివసిస్తూ.. టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, ఫోటోషూట్‌లలో పనిచేసే నటీమణులను బెదిరించి, బలవంతంగా ఈ చీకటి రొంపులోకి నెడుతున్నట్లు విచారణలో తేలింది.

ఈ రాకెట్‌లో బాధితురాలైన హిందీ టీవీ నటిని పోలీసులు రక్షించి, ముంబైలోని రెస్క్యూ ఫౌండేషన్ సంరక్షణ కేంద్రంలో ఉంచారు. ప్రధాన నిందితురాలైన తబస్సుమ్‌పై మానవ అక్రమ రవాణా అలాగే ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యభిచార వలలో ఆమెకు సహకరిస్తున్న పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. 

థానేలో ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం ఈ ఏడాది ఇది రెండోసారి. గతేడాది ఫిబ్రవరిలోనూ ఒక వెబ్ సిరీస్ నటి హోటల్ కేంద్రంగా వ్యభిచార రాకెట్ నడుపుతూ పోలీసులకు చిక్కింది. గ్లామర్ ప్రపంచంలో త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో, పరిస్థితుల ప్రభావంతో  నేరాల బాటపడుతున్న కొందరి వల్ల అమాయక కళాకారిణుల జీవితాలు బలైపోతున్న తీరు ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టింది.