- రూ.174.325 కోట్లు మంజూరు చేస్తూ జీవోలు విడుదల చేసిన ప్రభుత్వం
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రత్యేక చొరవ
హుజూర్ నగర్, వెలుగు: సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రత్యేక చొరవతో రెండు నియోజకవర్గాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.174.325 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 13 మండలాల్లో 54 రహదారి పనులు చేపట్టనున్నారు.
మొత్తం 156.95 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు లభించాయి. ఈ మేరకు మంత్రి ఉత్తమ్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆఫీసులు బుధవారం వివరాలు వెల్లడించాయి. ఈ నిధులతో చేపట్టబోయే రోడ్లతో మారుమూల గ్రామాలు, గిరిజన తండాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రధాన రహదారులతో అనుసంధానం పెరగనుంది.
2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సీఆర్ఆర్ పథకం కింద ఈ పనులు చేపట్టేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దానకిశోర్ సోమవారం జీవో నంబర్లు 558, 559 జారీ చేశారు. కోదాడ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తొమ్మిది రహదారి పనులకు రూ.30 కోట్లు మంజూరు చేశారు. ఈ పనుల ద్వారా 25.40 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించనున్నారు.
హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 45 రహదారి పనులకు రూ.144.325 కోట్లు కేటాయించారు. ఈ నియోజకవర్గంలో 131.55 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. రెండు నియోజకవర్గాల్లో మంజూరైన నిధులతో రోడ్ల నిర్మాణ పనులు పూర్తయితే గ్రామీణ ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు.
గిరిజన తండాలు, మారుమూల గ్రామాల నుంచి మండల కేంద్రాలకు రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడంతో పాటు విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఈ రహదారులు ఉపయోగపడతాయని చెప్పారు. గర్భిణులు, రోగులు అత్యవసర సమయాల్లో వైద్య సేవలు పొందేందుకు కూడా మెరుగైన రహదారులు దోహదపడతాయని వివరించారు.
