చిక్కడ పల్లి వ్యాపారి కిడ్నాప్ కేసులో 10 మంది అరెస్ట్

చిక్కడ పల్లి వ్యాపారి కిడ్నాప్ కేసులో 10 మంది అరెస్ట్
  •     రూ.1.07 కోట్లు, 9 కార్లు, 2 బైక్​లు, 118 గ్రాముల ఆభరణాలు స్వాధీనం 

అంబర్​పేట్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో సంచలనం సృష్టించిన చిక్కడపల్లికి చెందిన వ్యాపారి కె.శ్రీనివాసరావు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. అంబర్‌‌‌‌‌‌‌‌పేటలోని సికింద్రాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ రక్షితా కె.మూర్తి, టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య వివరాలు వెల్లడించారు. 

తుర్కయంజాల్‌‌‌‌‌‌‌‌కు చెందిన రియల్టర్ దుమావత్ శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌కు, బాధితుడు శ్రీనివాసరావుకు మధ్య మూడేళ్లుగా భూ లావాదేవీల వివాదాలున్నాయి. శ్రీనివాసరావు స్వయంగా భూ వివాదాన్ని పరిష్కరించుకోవడం ఓర్వలేని శ్రీకాంత్, జైలులో పరిచయమైన శ్రీనివాస్ రెడ్డితో కలిసి కిడ్నాప్‌‌‌‌‌‌‌‌కు ప్లాన్ వేశాడు. ఇందుకోసం పాత నేరస్తులు అయిన భోజగుట్టకు చెందిన గుంజపాగు సురేశ్, చంపాపేటకు చెందిన బండారి సంసన్, అత్తపూర్ కు చెందిన గూడెం శ్రవణ్ కుమార్, కూకట్ పల్లి  చెందిన హీరాసింగ్, ధన్సింగ్, బూరాని కుల్దీప్​సింగ్, భీమి సింగ్, అత్తాపూర్ కు చెందిన సర్దార్ గబ్బార్, బిహార్ కు చెందిన వికాస్ లతో ముఠాను ఏర్పాటు చేశాడు. 

ఈ ముఠా ఈ నెల 5న ఉదయం రామంతాపూర్ లోని తన జ్యూవెల్లరీ షాప్​కు బైక్​పై వెళ్తున్న శ్రీనివాసరావును గోల్నాక ఫ్లైఓవర్ వద్ద కిడ్నాప్ చేసింది. బాధిత కుటుంబసభ్యుల నుంచి రూ.15 కోట్లు డిమాండ్ చేయగా, నాటకీయ పరిణామాల మధ్య రూ.1.30 కోట్లు తీసుకుని కిడ్నాపర్లు శ్రీనివాసరావును వదిలిపెట్టారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన చిక్కడపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం తెల్లవారుజామున బొంగులూరు టోల్ ప్లాజా వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.07 కోట్లు, 9 కార్లు, 2 బైక్​లు, 118 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10 మందిని రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించినట్లు డీసీపీ పేర్కొన్నారు.