సైబర్ నేరగాళ్ల ఆటకట్టిస్తున్నరు ..9 రాష్ట్రాల్లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌..23 సైబర్ క్రైమ్ కేసుల్లో 35 మంది అరెస్ట్

సైబర్ నేరగాళ్ల ఆటకట్టిస్తున్నరు ..9 రాష్ట్రాల్లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌..23 సైబర్ క్రైమ్ కేసుల్లో 35 మంది అరెస్ట్
  • ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ ఫ్రాడ్స్‌‌‌‌‌‌‌‌ కేసుల్లో రూ.16.12 కోట్లు లూటీ
  • సోషల్ మీడియాపై పోలీసుల సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్రోలింగ్‌‌‌‌‌‌‌‌ 

‘‘హైదరాబాద్ మధురానగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన కీర్తి హరీశ్ అనే వ్యక్తి తల్లి సెప్టెంబర్ 8, 2025న గుండెపోటుతో మృతి చెందింది. అంత్యక్రియల తర్వాత ఆమె ఫోన్ పరిశీలించగా డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరించి ఆమె వద్ద నుంచి రూ.6.60 లక్షలు వసూలు చేసినట్లు హరీశ్ గుర్తించాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా పుణెకు చెందిన సైబర్ నేరగాడు శుభమ్ మోహన్ లొండే (27) ను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు పట్టుకొచ్చారు.’’  

హైదరాబాద్, వెలుగు: సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లపై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్​తోపాటు సిటీలో నమోదైన కేసుల ఆధారంగా స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో సోదాలు చేశారు. మొత్తం 83 ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లకు సంబంధించి 23 సైబర్ క్రైమ్ కేసుల్లో 35 మందిని అరెస్ట్ చేశారు. ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, ట్రేడింగ్ ఫ్రాడ్‌‌‌‌‌‌‌‌ కేసులకు సంబంధించి 28 కేసుల్లో బాధితులు రూ.16.12 కోట్లు కోల్పోగా.. రూ.49.44 లక్షలు మాత్రమే రికవరీ అయ్యాయి.

ఈ క్రమంలోనే ఇతర కేసుల్లో సైబర్ నేరగాళ్ల ఖాతాల్లో స్తంభింపజేసిన నగదు సహా మొత్తం రూ.88.48 లక్షలు బాధితులకు రిఫండ్ చేశారు. ఈ మేరకు శనివారం సిటీ అడిషనల్ సీపీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ ఒక ప్రకటన విడుదల చేశారు. బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ నంబర్ల లింకులతో సెర్జ్ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్‌‌‌‌‌‌‌‌ సహా పెద్ద మొత్తంలో తీవ్రమైన సైబర్ నేరాలకు సంబంధించి స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు అంతా ఇతర రాష్ట్రాల వారు కావడంతో ఆయా రాష్ట్రాల పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ జోనల్ సైబర్ సెల్స్ డేటా ప్రకారం ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీకి 2,767 పిటిషన్లు రాగా, అందులో 381 ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లు నమోదయ్యాయి.

వీటిలో 10 కేసులకు సంబంధించి 11 మందిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. దీంతో పాటు సోషల్ మీడియా నేరాలకు సంబంధించి 9 మంది, ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఫ్రాడ్‌‌‌‌‌‌‌‌లో 7 మంది, డిజిటల్ అరెస్ట్ కేసుల్లో 6 మంది, ట్రేడింగ్ ఫ్రాడ్‌‌‌‌‌‌‌‌లో ఐదుగురు సహా మొత్తం 35 మందిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు 10 మంది, ఏపీ 9, మహారాష్ట్ర  6, కేరళ, ఉత్తర ప్రదేశ్, బిహార్, హర్యానా, రాజస్తాన్, పంజాబ్‌‌‌‌‌‌‌‌కు చెందిన నిందితులు ఉన్నారు. 

1,457 నకిలీ ప్రొఫైల్స్, 2,603 అడ్వర్టైజ్‌‌‌‌‌‌‌‌మెంట్లు నిలిపివేత..

సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా కేంద్రంగా జరుగుతున్న వేధింపులు, బ్లాక్‌‌‌‌‌‌‌‌ మెయిలింగ్‌‌‌‌‌‌‌‌పై డిజిటల్ మానిటరింగ్ ద్వారా పోలీసులు సైబర్ పెట్రోలింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్, ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్స్​లో మైనర్లను అసభ్యకరంగా చిత్రీకరిస్తూ వీడియోలు షేర్ చేస్తున్నవారితోపాటు సబ్‌‌‌‌‌‌‌‌స్క్రైబర్లు, మానిటైజేషన్ పొందుతున్నవారిని ట్రేస్ చేస్తున్నారు. ఇందులో 140 సోషల్ మీడియా ప్రొఫైల్స్, 30 పెయిడ్ ప్రకటనలను గుర్తించారు. పాత నాణాలు, రూ.5 ట్రాక్టర్ నోట్లు, 786 సిరీస్ నోట్లు సహా మోసపూరిత బెట్టింగ్ ప్రొఫైళ్లను గుర్తించి నిలిపివేశారు.

మ్యాట్రిమోనియల్, ప్రైవేట్ వీడియో కాల్ సర్వీసులు, నకిలీ ఉద్యోగ ప్రకటనల ద్వారా మోసాలకు పాల్పడే సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా ఖాతాలపై సంబంధిత ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లకు రిపోర్ట్ చేసి తొలగించేలా చేశారు. సైబర్ పెట్రోల్ ద్వారా 1,457 నకిలీ ప్రొఫైల్స్, 2,603 పెయిడ్ అడ్వర్టైజ్‌‌‌‌‌‌‌‌మెంట్లను నిలిపివేశారు. వీటిని ప్రమోట్ చేస్తున్న వారిపై 9 ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లు నమోదు చేశారు. 'సి-మిత్ర' విభాగం ద్వారా 1,928 మంది బాధితులకు ఫోన్ కాల్స్ చేశారు. 307 జీరో ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లు నమోదు చేశారు.