ఫ్యాషన్ ప్రపంచానికి హైదరాబాద్  కొత్త చిరునామా

ఫ్యాషన్ ప్రపంచానికి హైదరాబాద్  కొత్త చిరునామా

72వ అంతర్జాతీయ మిస్ వరల్డ్ – 2025 అందాల పోటీల నిర్వహణతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్.. లగ్జరీ ఫ్యాషన్, డిజైనర్ షోలు, లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్‌లకు మెయిన్​ ప్లాట్​ఫాంగా అవతరిస్తోంది. నిన్నమొన్నటి వరకు ఐటీ రంగానికే కేరాఫ్​ నిలిచిన హైటెక్ సిటీ, నేడు ఫ్యాషన్​కు సరికొత్త అడ్రస్​ కానుంది.

భారత లగ్జరీ ఫ్యాషన్ పరిశ్రమలో హైదరాబాద్ కేవలం అతిపెద్ద రిటైల్ మార్కెట్ మాత్రమే కాదు, ప్రతిష్టాత్మక ఫ్యాషన్ ఈవెంట్ల నిర్వహణలోనూ కీలక కేంద్రంగా ఎదుగుతోంది. దీనికి నిదర్శనంగా ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన హ్యుందాయ్ ఇండియా కౌచర్ వీక్ ఈ ఏడాది తొలిసారిగా హైదరాబాద్‌‌లో ప్రారంభమైంది. సంప్రదాయంగా న్యూఢిల్లీలో జరిగే ఈ ఈవెంట్19వ ఎడిషన్‌‌ను చారిత్రక తాజ్ ఫలక్‌‌నుమా ప్యాలెస్‌‌లో ప్రత్యేక ప్రదర్శనతో ఆరంభించి, అనంతరం ఢిల్లీలో కొనసాగించింది. ప్రముఖ డిజైనర్ అనామిక ఖన్నాతోపాటు సినీ ప్రముఖులు, డిజైనర్లు, ఇన్‌‌ఫ్లుయెన్సర్లు పాల్గొనడం ద్వారా హైదరాబాద్ ఫ్యాషన్ రంగానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.

ఎడ్- ఎ- మమ్మా బ్రాండ్ అవుట్‌‌లెట్

పిల్లల కోసం సుస్థిరమైన దుస్తులు అందించే ఎడ్-– ఎ– -మమ్మా తన రెండవ ఎక్స్‌‌క్లూజివ్ బ్రాండ్ అవుట్‌‌లెట్ హైదరాబాద్‌‌లో ప్రారంభించి దక్షిణ భారతదేశంలో తన రిటైల్ ఉనికిని బలోపేతం చేసుకుంది. రద్దీగా ఉండే శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌‌లో నెలకొన్న ఈ కొత్త స్టోర్ ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ప్రఖ్యాత నటి ఆలియా భట్ స్థాపించిన ఎడ్-–ఎ–-మమ్మా ప్రసూతి దుస్తులు, బొమ్మలు, పుస్తకాలు, యాక్సెసరీలు, కాన్షియస్ బేబీ కేర్ లైన్ ఉన్నాయి.

ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు కేరాఫ్

హైదరాబాద్‌‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు నేర్చుకోవడానికి నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), హామ్స్‌‌టెక్ కాలేజ్, వోక్సెన్ యూనివర్సిటీలున్నాయి.నిఫ్ట్ ఫ్యాషన్ డిజైన్‌‌లో డిగ్రీ, మాస్టర్స్ కోర్సులు అందిస్తుంది. హామ్స్‌‌టెక్ కాలేజ్ ఇండస్ట్రీ నిపుణులతో వర్క్‌‌షాప్‌‌లు నిర్వహిస్తున్నారు. వోక్సెన్ యూనివర్సిటీ అత్యాధునిక క్యాంపస్‌‌తో 4 సంవత్సరాల ఫ్యాషన్ డిజైన్ కోర్సును అందిస్తోంది. జేడీ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ డిజైనింగ్​లో వివిధ రకాల సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు ఉన్నాయి.

ఫ్యాషన్ షోల సందడి

హైదరాబాద్ సిటీ ఫ్యాషన్ షోలు, డిజైనర్ ఎగ్జిబిషన్లు, లైఫ్‌‌స్టైల్ ఈవెంట్లతో ఎప్పుడూ ఎంతో సందడిగా ఉంటుంది. హైటెక్స్, నార్సింగి, బంజారాహిల్స్ వంటి ప్రముఖ వేదికల్లో ట్రెండ్‌‌సెట్టింగ్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. హైటెక్స్, హెచ్‌‌ఐసీసీలలో పెద్ద ఎత్తున గాలా నైట్స్, నేషనల్ డిజైనర్ ఎగ్జిబిషన్లు, బ్రైడల్ కౌచర్ షోలు నిర్వహిస్తారు. డిజైనర్లు రూపొందించిన ఎథ్నిక్ వేర్, ట్రెండీ ఆభరణాలు, లైఫ్‌‌స్టైల్ బ్రాండ్లతో కూడిన ప్రదర్శనలు ఫ్యాషన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ మోడల్స్, సినీ సెలబ్రిటీల క్యాట్‌‌వాక్‌‌లు, ప్రత్యేక సాంస్కృతిక డిస్ ప్లేలతో ఫ్యాషన్ క్యాలెండర్ కలర్​ఫుల్​గా మారింది.

పెళ్లి దుస్తుల షాపింగ్

హైదరాబాద్‌‌లో సంప్రదాయ హస్తకళలను సమకాలీన పోకడలతో మేళవించే ఫ్యాషన్ ప్రపంచం ఉంది. ఈ నగరం ఖాడా దుపట్టాలు, పట్టు చీరలు, షేర్వానీలు, నిజామీ వారసత్వం నుంచి ప్రేరణ పొందిన ఎంబ్రాయిడరీ చేసిన డిజైనర్ దుస్తులకు ఫేమస్​. ఇక్కడివాళ్లు జీన్స్, డ్రెస్సులు, ఓవర్‌‌సైజ్ షర్టులు, కో-– ఆర్డ్ సెట్‌‌లు, ఫ్యూజన్ వేర్ వంటి క్యాజువల్, వెస్ట్రన్ స్టైల్స్‌‌ను ఇష్టపడతారు. ఇక్కడ లగ్జరీ బోటిక్‌‌లు, డిజైనర్ లేబుల్స్, ఫ్యాషన్ స్టోర్‌‌లు ఉన్నాయి.

షాపింగ్ హాట్‌‌స్పాట్‌‌లు..

బంజారాహిల్స్​లోని డిజైనర్ బోటిక్‌‌లు, ప్రీమియం ఫ్యాషన్ బ్రాండ్‌‌లు, జూబ్లీహిల్స్​లోని లగ్జరీ లేబుల్స్, కోఠి సుల్తాన్ బజార్​లో బడ్జెట్‌‌కు అనుకూలమైన చీరలు, డ్రెస్ మెటీరియల్స్, యాక్సెసరీలు, అబిడ్స్​లో సరసమైన ధరలకు లభించే దుస్తులు, పాదరక్షలకు ప్రసిద్ధి చెందాయి. పాపులర్​ డిజైనర్స్​ అయిన అనుశ్రీ రెడ్డి, అర్చన రావు, అస్మిత మార్వా వంటివారు ఈ సిటీకి చెందినవాళ్లే.

హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్‌లు

హైదరాబాద్​లో లగ్జరీ ఈవెంట్‌లకు ప్రీమియం హోటళ్లు, వారసత్వ వేదికలు, అంతర్జాతీయ విమానాశ్రయం, కన్వెన్షన్ సెంటర్ల ద్వారా మెరుగైన కనెక్టివిటీ ఉండటం వల్ల ఢిల్లీ, ముంబైలకు ఆవల ఫ్యాషన్ ప్రపంచానికి హైదరాబాద్ కేరాఫ్​గా మారింది. ప్రముఖ డిజైనర్లు, నిర్వాహకులు తమ ప్రతిష్టాత్మక లాంచ్‌లు, రన్‌వే షోల కోసం హైదరాబాద్​ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కౌచర్ వీక్‌తో పాటు డిజైనర్ దుస్తులు, ఆభరణాలు, లైఫ్‌స్టైల్ బ్రాండ్‌లను ప్రదర్శించే హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్‌లు, బ్రైడల్ కౌచర్ షోకేస్‌లు, పిల్లల డిజైనర్ల ఫ్యాషన్ వీక్‌లు వంటి ఈవెంట్‌లు జరుగుతున్నాయి. 

రానున్న ఫ్యాషన్ ఈవెంట్లు

ఆగస్టు 29– 30 తేదీల్లో జూనియర్స్ ఫ్యాషన్ వీక్, ఆగస్టు 29 –31 వరకు నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్‌‌లో హై– లైఫ్ ఎగ్జిబిషన్ జరగనుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పండుగ దుస్తులు, బ్రైడల్ కలెక్షన్‌‌లు, చేతితో తయారు చేసిన ఆభరణాలు, డిజైనర్ లేబుల్స్‌‌తో అనేక ఫ్యాషన్, షాపింగ్ ఎగ్జిబిషన్‌‌లు నిర్వహించనున్నారు.
అదేవిధంగా హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్, లులు మాల్ ఫ్యాషన్ ఈవెంట్లు, వివిధ డిజైనర్ షోలు, లైఫ్‌‌స్టైల్ ప్రదర్శనలతో నగరం ఫ్యాషన్ క్యాలెండర్ మరింత సందడిగా మారనుంది. 

సరికొత్త డిజైన్లు

హైటెక్ సిటీలో ఉన్న హెచ్ఐసీసీ నోవోటెల్​లో హైలైఫ్, డిజైన్ డిస్ట్రిక్ట్ వంటి పెద్ద ఫ్యాషన్ ఎగ్జిబిషన్లు తరచుగా జరుగుతాయి. మాదాపూర్‌లోని హైటెక్స్ వేదికగా జాతీయ స్థాయి ఫ్యాషన్ బజార్లు, జీవనశైలి ప్రదర్శనలు నిరంతరం నిర్వహిస్తున్నారు. కొండాపూర్‌లో ఉన్న శరత్ సిటీ క్యాపిటల్ మాల్​లో ప్రముఖ బ్రాండ్లు, సస్టైనబుల్ ఫ్యాషన్ హబ్‌లు ఏర్పాటవుతున్నాయి. సిటీలో రిలయన్స్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ, రాజలక్ష్మీ టెక్స్ టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మదీనా కాంప్లెక్సులోని వస్త్రాలు, వివిధ డిజైన్ల వస్త్రాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.