చేతిలో స్మార్ట్‌ఫోన్.. కళ్ల ముందు డిజిటల్ స్క్రీన్... రాతకు కీబోర్డులు, టచ్ పెన్నులు! కాలం మారింది.. టెక్నాలజీ పరుగులు పెడుతోంది. కానీ సిరా చుక్కతో కాగితంపై అక్షరాలు కదిలించే ఫౌంటెన్ పెన్నులపై మాత్రం మోజు తగ్గడం లేదు. అందమైన డిజైన్లు.. అరుదైన కలెక్షన్లు.. ప్రత్యేకమైన పాళీలు... చేతిరాతలో ఓ ప్రత్యేకమైన అనుభూతి.
ఇప్పటి ఆధునిక యుగంలో ఇత్తడి, టైటానియం, అల్యూమినియం వంటి లోహాలతో తయారైన మెషిన్డ్ మెటల్ పెన్నులు కలెక్షన్ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ప్రెజర్ సెన్సిటివిటీ, టిల్ట్ డిటెక్షన్ వంటి సదుపాయాలతో చేతిరాతను డిజిటల్ రూపంలోకి మార్చే స్మార్ట్ పెన్నులు అందుబాటులోకి వచ్చాయి. ఎన్ని కొత్త పరికరాలు వచ్చినా ఫౌంటెన్ పెన్నులకున్న ప్రత్యేకతే వేరు.
వరల్డ్ ఫౌంటెన్ పెన్ డే
నవంబరు 6న ‘వరల్డ్ ఫౌంటెన్ పెన్ డే’ సందర్భంగా హైదరాబాద్ ఫౌంటెన్ పెన్ క్లబ్ ఆధ్వర్యంలో వినూత్న ఈవెంట్ నిర్వహించనున్నట్లు క్లబ్ ఫౌండర్ శ్రేయాస్ ఎడ్ల తెలిపారు. ఫౌంటెన్ పెన్నుతో రాయడం అంటే క్రమశిక్షణకు, నిర్లక్ష్య నియంత్రణకు, నిశ్చల తత్వానికి నిదర్శనం. పెన్నులో ఇంకు పోయడం ఒక కళ. పాళీని శుభ్రం చేసి దానికి కావాల్సినంత ఇంకు మాత్రమే సరఫరా చేసే నాళిక. ఇంకు పెన్ను కక్కకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం, క్యాపు పెట్టడం ఇవన్నీ ఒద్దికతనానికి సూచికలు.
ప్రతీ నెలా పెన్ అభిమానుల సమావేశాలు
ప్రతీ నెలా ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, డాక్టర్లు, అధికారులు ఇలా వేర్వేరు వర్గాల వారు నగరంలోని ఫౌంటెన్ పెన్ లవర్స్ అందరూ లమాకాన్, ఇతర వేదికల్లో ప్రతీ నెలా సమావేశమై నాటి సిరా పెన్నుతో రాసిన లేఖల గురించి గుర్తు చేసుకుంటుంటామని పెన్ లవర్ నవీన్ చెప్పారు.
పెన్ను రీ లాంచ్
1913వ సంవత్సరం నాటి షీఅఫర్ బ్యాలెన్స్ 3 వింటేజ్ ఫౌంటెన్ పెన్నును రీ లాంచ్ చేయనున్నారు. షీఫర్ బ్యాలెన్స్ II ఫౌంటెన్ పెన్నును కొత్త తరం కోసం సరికొత్తగా రూపొందించామని కంపెనీ ప్రకటించింది. కోల్‌కతాలో అక్టోబరు 24న షీఫర్ బ్యాలెన్స్ II పెన్నును ఆవిష్కరిస్తామని ఆ కంపెనీ తెలిపింది. నాలుగు రకాల పాళీలతో సున్నితంగా రాసేందుకు వీలుగా ఎక్స్ట్రా ఫైన్ నిబ్‌తో కూడిన ఈ పెన్నులు ఆకట్టుకోనున్నాయి.
‘‘ఇటీవల గ్యారేజీని శుభ్రం చేస్తున్నప్పుడు పలు ఫౌంటెన్ పెన్నులు దొరికాయి. కొన్నింటికి బంగారు పాళీలు ఉన్నాయని పెన్ లవర్ సాయి ఆధ్య చెప్పారు. ఆ పెన్నులను విక్రయానికి పెడుతూ పెన్ లవర్స్ ఫేస్బుక్లో పోస్టు చేస్తే ఫీడ్‌బ్యాక్ బాగా
వచ్చింద’’ని చెప్పారు. .
హైదరాబాద్ పెన్ షో.. పెన్ ప్రియుల సందడి
హైదరాబాద్ ఫౌంటెన్ పెన్ క్లబ్ లక్డీకాపూల్‌లో నిర్వహించిన హైదరాబాద్ పెన్ షోలో వింటేజ్ పెన్ కలెక్టర్లు, నిబ్ నిపుణులు, ఇంక్ తయారీదారులు, స్టేషనరీ ప్రేమికులు, పెన్ రిపేరర్లు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ముంబయి, బెంగళూరు, చెన్నయ్, మధురైల నుంచి వందకు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ల పెన్నులు ప్రదర్శనలో ఉంచారు.
పార్కర్, షెఫర్, మాంట్బ్లాంక్ వంటి బ్రాండ్ల వింటేజ్ పెన్నులతోపాటు చేతితో చెక్కిన ఎబోనైట్ పెన్నులు, కస్టమ్ నిబ్ గ్రైండింగ్ పెన్నులు, విదేశీ రంగుల ఇంకులు ఆకట్టుకున్నాయని పెన్ లవర్ ముఖేష్ చెప్పారు.
చేతిరాతకు మళ్లీ పట్టం
హైదరాబాద్ నగరంలో జరిగిన పెన్ షో కేవలం పెన్నుల ప్రదర్శనకే పరిమితం కాలేదు. చేతిరాత, కర్సివ్ రైటింగ్, కాలిగ్రఫీ, ఇంక్ స్వాచింగ్, బాల్‌పాయింట్ స్కెచింగ్ వంటి అంశాలపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాలు నిర్వహించారు. ఫౌంటెన్ పెన్నులను ఎలా ఉపయోగించాలి? నిబ్‌ను ఎలా సంరక్షించాలి? ఇంక్ మరకలు పడకుండా ఎలా రాయాలి? పెన్నులను ఎక్కువకాలం మన్నికగా ఉంచాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అంశాలను వివరించారు.
వింటేజ్ జపనీస్ ఫౌంటెన్ పెన్
ప్లాటినం హానెస్ట్ 66 అనేది1960వ సంవత్సరం ప్రారంభంలో తయారైన ఒక వింటేజ్ జపనీస్ ఫౌంటెన్ పెన్. ఇది కార్ట్రిడ్జ్-ఫిల్లింగ్ టెక్నాలజీలో ప్లాటినం సంస్థ మార్గదర్శక ప్రయాణంలో ఒక భాగం. ప్లాటినం 1954లో అసలైన హానెస్ట్ పెన్నును పరిచయం చేసింది. 1956లో ఆ సంస్థ తన కార్ట్రిడ్జ్-ఫిల్లింగ్ విధానాన్ని ఆచరణలోకి తెచ్చింది.
ఆ తర్వాత 1957లో హానెస్ట్ 60 వచ్చింది. ఆ తర్వాత హానెస్ట్ 66 వచ్చింది. ప్లాటినం అధికారిక కంపెనీ చరిత్ర ప్రకారం దీని తయారీ 1961లో పూర్తయింది. హానెస్ట్ సిరీస్ ఫౌంటెన్ పెన్ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని సూచిస్తుంది. ఆ సమయంలో జపనీస్ తయారీదారులు ఫౌంటెన్ పెన్నులను రోజువారీ రచన కోసం మరింత సౌకర్యవంతంగా, ఆచరణాత్మకంగా తయారుచేశారు.
ఫౌంటెన్ పెన్నులకు ఆదరణ
హైదరాబాద్ పెన్ షో సందర్భంగా చేతిరాత, కర్సివ్, కాలిగ్రఫీ, ఇంక్ స్వాచింగ్, బాల్‌పాయింట్ స్కెచింగ్, ఫౌంటెన్ పెన్ సంరక్షణపై పరిచయ సెషన్లపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పురాతనకాలం నాటి ఫౌంటెన్ పెన్నులను మళ్లీ వాడకంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో హైదరాబాద్ ఫౌంటెన్ పెన్ క్లబ్ ఏర్పాటుచేశామని ఈ క్లబ్ ఫౌండర్ సభ్యుడు శ్రేయాస్ ఎడ్ల చెప్పారు.
ఇంకు పెన్ను పాళీ నుంచి సిరా జాలువారుతూ అక్షరాలుగా మారుతుండేది. రాతలో మార్పు, పెన్నుతో రాయడంలో హుందాతనం వస్తుందని అంటారు శ్రేయాస్. హైదరాబాద్ పెన్ షోలో ఫౌంటెన్ పెన్నులు, ఇంకులు, నోట్బుక్లు, కాగితం, స్టేషనరీ, రాత ఉపకరణాలు అన్నీ ఒకేచోట ప్రదర్శించారు.
వింటేజ్ పెన్నులు...
కొన్ని పెన్నులు కేవలం రాయడానికి మాత్రమే కాదు... సేకరణలో ఓ అరుదైన వస్తువుగా నిలిచేవి. వాటి రూపకల్పన, తయారీలో ఉపయోగించిన పదార్థాలు, నిబ్ ప్రత్యేకతలు, చరిత్ర.. ఇలా ఒక్కో పెన్ను వెనుక ఓ కథ ఉంటుంది. వాటిని ఆసక్తిగా పరిశీలిస్తూ పెన్ ప్రియులు తమ అనుభవాలను పంచుకున్నారు. డిజిటల్ పరికరాలతో నిమిషాల్లో సమాచారాన్ని పంపించగలిగే రోజుల్లోనూ.. చేతితో రాసిన ఓ ఉత్తరానికి, డైరీలో రాసుకున్న ఓ జ్ఞాపకానికి, అందమైన సంతకానికి ఉండే విలువ ప్రత్యేకమే.
ఆ అనుభూతిని మళ్లీ గుర్తుచేస్తున్నాయి ఇలాంటి పెన్ షోలు. పెన్ షోలో రూ.50 నుంచి ఏకంగా రూ.7.80 లక్షల వరకు విలువైన పెన్నులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చేతితో తయారుచేసిన ఫౌంటెన్ పెన్నులు, లిమిటెడ్ ఎడిషన్‌తోపాటు బంగారం, వెండి, ప్లాటినమ్, వజ్రాలతో రూపొందించిన పెన్నులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బోర్సోని గోల్డెన్ రెబ్బల్ పెన్ను, రూ.7 లక్షల రూపాయల అర్జునుడి పెన్ను పెన్ షోలో అందరినీ ఆకట్టుకున్నాయి.
