హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఆఫీస్ స్పేస్ లీజింగ్ 58.6 లక్షల చదరపు అడుగులకు చేరిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 48 శాతం వృద్ధి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ వినియోగంలో హైదరాబాద్ రెండో స్థానానికి చేరింది. ఇందులో గ్లోబల్కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) సంస్థల వాటా 43 శాతంగా ఉంది. ఇండ్ల అమ్మకాలు కూడా స్థిరంగా సాగుతూ 9,541 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇళ్ల ధరలు తొమ్మిది శాతం పెరిగి సగటున చదరపు అడుగుకు రూ.8,211 గా ఉన్నాయి. రూ.2 –10 కోట్ల విలువైన లగ్జరీ ఇళ్లకు డిమాండ్ ఉంది.
