- సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటుపై మూడు కార్పొరేషన్ల ఫోకస్
- 12 జోన్లకి ఉన్నవి ఐదే
- వీటిల్లో 3వేల కుక్కలకే చోటు
- క్యూర్లో సంఖ్య 7 లక్షలు
- మరో ఏడు సెంటర్ల ఏర్పాటుతో కొంతవరకు తీరనున్న సమస్య
హైదరాబాద్ సిటీ, వెలుగు : సుప్రీం కోర్టు ఆదేశాలతో క్యూర్ పరిధిలో వీధి కుక్కల సమస్యకు కొంతమేర పరిష్కారం చూపేందుకు అధికారులు యానిమల్ కేర్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో కొత్త సెంటర్ల ఏర్పాటుతో పాటు కుక్కలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించారు. మూడు కార్పొరేషన్ల పరిధిలోని12 జోన్లకు ప్రస్తుతం ఐదు సెంటర్లు మాత్రమే ఉన్నాయి. వీటి లో 3 వేల కుక్కలను మాత్రమే ఉంచే వీలుంది. ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలతో ఒక్కో జోన్కు ఒక్కో కేంద్రం చొప్పున మరో ఏడు కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా, వీధికుక్కల బాధలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. .
ఏం చేయాలి?
మూడు కార్పొరేషన్లలో ఫతుల్లాగూడ, చుడీబజార్, అంబర్ పేట్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో కుక్కల కోసం షెల్టర్లున్నాయి. వీటిలో 3 వేల వరకు కుక్కలను ఉంచవచ్చు. స్టెరిలైజేషన్ చేసిన తర్వాత యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చి వారం రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలి. స్టెరిలైజేషన్ చేసినట్టు కుక్క చెవి భాగంలో వీ షేప్లో కట్ చేయాలి. తర్వాత ఎక్కడి నుంచి తీసుకువచ్చిన కుక్కలను అక్కడే వదిలిపెట్టాలి.
ఏం జరుగుతోంది..
యానిమల్ బర్త్ కంట్రోల్, యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ ఏబీసీ–ఏఆర్వీ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ ప్రొగ్రాంలో భాగంగా తాము పక్కాగా స్టెరిలైజేషన్ చేస్తున్నామని అధికారులు చెప్తున్నా.. మూడు కార్పొరేషన్లలో పరిస్థితి అలా కనిపించడం లేదు. ఇప్పటికే ఉన్న ఐదు సెంటర్లలో కెపాసిటీ లేక తక్కువ సంఖ్యలోనే స్టెరిలైజేషన్ చేస్తున్నారు. దీంతో నగరంలో ఎక్కడ చూసినా కుక్కల గుంపులే కనిపిస్తున్నాయి. సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల అవి ఉంటున్న ప్రాంతాల్లో ఆహారం దొరకడం లేదు. దీంతో చాలాచోట్ల ఒక ఏరియాలోని కుక్కలు బార్డర్దాటి ఇతర కుక్కలున్న ఏరియాలోకి వెళ్తున్నాయి.
కుక్కలు తాము రోజువారీగా ఆహారం తినే హోటళ్లు, చెత్తకుప్పలు లేదా ప్రజలు అన్నం పెట్టే స్థలాలను తమ ఆస్తిగా భావిస్తాయి. వేరే ప్రాంతం కుక్కలు ఆ ఆహారాన్ని తినడానికి వస్తే సహించవు. దీంతో ఆ కుక్కలపై గుంపుగా దాడులు చేస్తున్నాయి. ఇది ఇక్కడితో ఆగిపోవడం లేదు.
రెండు వేర్వేరు ఏరియాల కుక్కల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు వాటిల్లో దూకుడు, భయం తీవ్రస్థాయికి చేరి ఆ టైంలో అటుగా వెళ్లే మనుషులు, పిల్లలపై దాడులు చేస్తున్నాయి. ఇక ఉన్న సెంటర్లలో స్టెరిలైజేషన్తర్వాత వారం రోజులు అబ్జర్వేషన్లో పెట్టాల్సి ఉన్నా అవకాశం లేక వదిలేస్తున్నారని, దీంతో అవి కన్నుమూస్తున్నాయనన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
పబ్లిక్ ప్లేసుల్లోని కుక్కలను తరలిస్తారా ?
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పబ్లిక్ ప్లేసుల్లో కుక్కలను ఉండడానికి వీల్లేదు. ఉదాహరణకు స్కూల్స్, దేవాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల సమీపంలో కుక్కలు కనిపించొద్దని సుప్రీం కోర్టు గతంలోనే ఉత్తర్వులిచ్చింది. వీటిని యానిమల్ కేర్ సెంటర్లకు తరలించి పోషణను చూడాలని చెప్పింది. కానీ, కార్పొరేషన్లు దీన్ని సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు కొత్త సెంటర్లు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో పబ్లిక్ ప్లేసుల్లోని కుక్కలను తరలిస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే, ఏడు లక్షల కుక్కలకు 12 సెంటర్లు సరిపోవని, సర్కిల్కు ఒకటి చొప్పున 60 సెంటర్లు ఏర్పాటు చేయడమే పరిష్కారమని అధికారులంటున్నారు. అది కూడా ఒక్కో సెంటర్ను కనీసం 1000 కెపాసిటీతో ఏర్పాటు చేయాల్సి ఉంటుందంటున్నారు.
