బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన క్రమంలో వాహనదారులకు కీలక సూచనలు జారీ చేశారు పోలీసులు. ఆదివారం ( అక్టోబర్ 18 ) మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ కారణంగా నెక్లెస్ రోడ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెలుగు తల్లి జంక్షన్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్బండ్ వైపు వాహనాలకు అనుమతి లేదని తెలిపారు.
ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా.. కట్టమైసమ్మ, డీబీఆర్ మిల్స్, ఇందిరా పార్క్, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్రోడ్స్ వైపు మళ్లిస్తున్నారు. ఖైరతాబాద్ వీవీ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్ వెళ్లే వాహనాలను నెక్లెస్ రోటరీ వద్ద ప్రసాద్స్ ఐమాక్స్, మింట్ కాంపౌండ్ వైపు మళ్లిస్తున్నారు.
నల్లగుట్ట జంక్షన్ నుంచి బుద్ధ భవన్ వెళ్లే వాహనాలను రాణిగంజ్, నెక్లెస్ రోడ్ వైపు మళ్లిస్తున్నారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపుల పట్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. ట్రాఫిక్ జంక్షన్లు, ఫ్లైఓవర్ల దగ్గర వాహనాల రాకపోకలపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని వాహనదారులకు సూచిస్తున్నారు పోలీసులు.
