- మంత్రి కోమటిరెడ్డితో ఎన్ హెచ్ఏఐ చైర్మన్ తో భేటీ
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది జనవరిలో హైదరాబాద్– విజయవాడ రోడ్డు విస్తరణ పనులు చేపడుతామని ఎన్ హెచ్ఏఐ సంస్థ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తెలిపారు. సోమవారం ఢిల్లీలో రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎన్హెచ్ఏఐ చైర్మన్ తోపాటు సభ్యుడు విప్నేశ్శర్మతో భేటీ అయ్యి, రోడ్ల నిర్మాణంపై చర్చించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అత్యంత కీలకమైన హైదరాబాద్–విజయవాడ-, మచిలీపట్నం జాతీయ రహదారిపై రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ, తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ రహదారి విస్తరణకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, పనులను త్వరగా ప్రారంభించాలని కోరారు. ప్రతిపాదిత ప్రాజెక్టులో ఉన్న నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్లుగా విస్తరించడంతోపాటు, ఇరువైపులా సర్వీస్ రోడ్లు, నియంత్రిత ప్రవేశ సౌకర్యాలను అభివృద్ధి చేయాలన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి, 2027 జనవరి నాటికి పనులను ప్రారంభిస్తామని చైర్మన్హామీ ఇచ్చారని తెలిపారు.
