హైదరాబాద్ యూత్‌కు ఇప్పుడు కాఫీ ఫెస్టివల్స్ కొత్త ఆకర్షణగా మారాయి. హైటెక్ సిటీలోని టీ–వర్క్స్ వేదికగా నిర్వహించిన భారీ సమ్మర్ కాఫీ ఫెస్టివల్‌లో ఏడు వేల మందికి పైగా కాఫీ ప్రియులు పాల్గొన్నారు. వివిధ రకాల కాఫీలతో పాటు ఫుడ్ స్టాల్స్, ఫ్యాషన్ షోలు, షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనలు సందర్శకులను అలరించాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సిటీలో ఎక్కడ కాఫీ ఫెస్టివల్స్ జరిగినా కాఫీ లవర్స్ వెతుక్కుంటూ వచ్చేస్తున్నారు. ఈ ఫెస్టివల్స్‌లో ట్రూ బ్లాక్ కాఫీ, రోస్ట్, నాద్ కాఫీ అంటూ ఇలా ఎన్నెన్నో రకాల కాఫీ ఫ్లేవర్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. వీటిలో కాఫీ మేకింగ్ కోసం ప్రముఖ బ్రాండ్‌లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల కాఫీ గింజల్ని వాడుతున్నారు. చాలావరకు మంచి పేరున్న కేఫ్‌లు చిక్‌మంగళూరులోని రత్నగిరి ఎస్టేట్ గింజలను ఉపయోగిస్తున్నాయి.
కాఫీ వర్క్‌షాప్
సిటీలో జరిగిన సమ్మర్ కాఫీ ఫెస్ట్‌కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. గచ్చిబౌలిలోని రెడ్ రైనో.. జులై నెలలో ప్రతి ఆదివారం కాఫీ వర్క్‌షాప్ నిర్వహించేలా ప్లాన్ చేసింది. కాఫీ డికాషన్‌తో ఆర్ట్ క్రియేట్ వేసేలా కాఫీ పెయింటింగ్ వర్క్‌షాప్‌లు, ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించనుంది.
కాఫీ కమ్యూనిటీ మీటప్!
బంజారాహిల్స్‌లోని సోషల్ ఎక్స్ కేఫ్ సిటీలో ఆర్టిసానల్, స్పెషాలిటీ కాఫీ కల్చర్‌ను ప్రారంభించిన వన్ ఆఫ్ ది బెస్ట్ స్పాట్. ఇక్కడ ఇన్-హౌస్ రోస్టింగ్ కాఫీ లైవ్‌గా చూడొచ్చు. నిన్ననే (జూన్ 6న) ఈ కేఫ్ మీటప్ను ఏర్పాటు చేసింది.
కూకట్ పల్లిలోని నెక్సస్ మాల్ ఫుడ్ కోర్ట్ జూన్ 7న మధ్యాహ్నం 4 గంటలకు కాఫీ ప్రియులతో కాఫీ అండ్ కన్వర్జేషన్ మీటప్ నిర్వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో ద్వారా తెలిపింది.
కాఫీ టేస్టింగ్..
బంజారాహిల్స్‌లోని రోస్ట్ సిసిఎక్స్ కేఫ్, కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాతో కలిసి అప్పుడప్పుడు ప్రొఫెషనల్ బారిస్టా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది. కాఫీ టేస్టింగ్ సెషన్లు, ఆర్టిసన్ కాఫీ బ్రాండ్ల స్టాల్స్, బ్రూయింగ్ వర్క్‌షాప్‌లు, లైవ్ మ్యూజిక్ ప్రదర్శనలు, ఫుడ్ స్టాల్స్ విజిటర్స్‌ను ఆకట్టుకున్నాయి.
వీకెండ్స్‌లో కాఫీ క్రేజ్
గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో ఉన్న రోస్టరీ కాఫీ హౌస్, థర్డ్ వేవ్ కాఫీ వంటి వాటిలో అప్పుడప్పుడు కాఫీ బ్రూయింగ్, కప్పింగ్, కాఫీ మగ్ పెయింటింగ్ వంటి వీకెండ్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. రాయదుర్గం ప్రాంతంలో నిర్వహించిన హైదరాబాద్ సమ్మర్ కాఫీ ఫెస్టివల్ రెండు రోజులపాటు సందర్శకులను ఆకట్టుకుంది.
ఈ కాఫీ ఫెస్ట్‌లలో యూత్, కంటెంట్ క్రియేటర్లు వంటి కాఫీ లవర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫెస్టివల్‌లో కాఫీ బేస్డ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్యాషన్ ఫ్లాష్‌మాబ్, ఫోటోగ్రఫీ పోటీ, ఎఫ్-1 రేసింగ్ సిమ్యులేటర్, ఐపీఎల్ ఫైనల్ ప్రత్యక్ష ప్రసారం వంటి ప్రోగ్రామ్స్ యూత్‌ని ఆకర్షించాయి. అంతేకాదు విజేతలకు సినీ నటులు బహుమతులు అందజేయడం ఫెస్టివల్‌కే హైలైట్.
