- తిరుపతి వెళ్లే వారికి 3 గంటల టైం ఆదా
- హైదరాబాద్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్పై ముందడుగు
- కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా చర్చించారు. రహదారి కనెక్టివిటీని మెరుగుపరిచి, ప్రజల ప్రయాణ కష్టాలను తగ్గించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక, పర్యాటక అభివృద్ధికి దోహదపడే పలు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
వీటిపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించి, పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంతో పాటు సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రోడ్డు అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేలా ఎన్ హెచ్ 167 కృష్ణా నదికి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కోసం మంత్రి చేసిన ప్రతిపాదనకు గడ్కరీ అంగీకారం తెలిపారు.
సోమశిల నుంచి సంగమేశ్వర వరకు నిర్మించే ఈ బ్రిడ్జి ద్వారా తిరుపతి వెళ్లే వారికి సుమారు 80 కి.మీ దూరం తగ్గి, దాదాపుగా 3 గంటల ప్రయాణ సమయం తగ్గుతుందని వివరించారు. హైదరాబాద్–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి చేసిన విజ్ఞప్తిపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.సేతు బంధన్ పథకం కింద తెలంగాణలో మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ఆర్ఓబీ) నిర్మాణానికి కేంద్ర మంత్రి ఆమోదం తెలిపారు. కోమటిరెడ్డి వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, రాష్ట్ర అధికారులు ఉన్నారు.
