అలా తీస్తే మన సినిమాలూ ఆడతాయి!

అలా తీస్తే మన సినిమాలూ ఆడతాయి!

కొన్నేళ్ల క్రితం జనార్దన మహర్షి ఈ కథ చెప్పారు. బాగుంది. కానీ చాలా పనుంది. కళ్యాణకృష్ణతో చేద్దామనుకున్నాం. తను ఆసక్తి చూపినప్పటికీ మరో సీక్వెల్ అతని చేతిలో ఉంది. దీంతో ఆలస్యమవుతోందని కోన వెంకట్​ని సంప్రదిస్తే బాబి పేరు సూచించాడు. బాబి రాసిన ట్రీట్మెంట్ చాలా నచ్చింది. ముఖ్యంగా అతను చెప్పిన ఓ సెంటిమెంట్ సీన్ కన్నీళ్లు తెప్పించింది. అలా ఈ సినిమా ప్రారంభమైంది. ఫైనల్ కట్ చూశాక మూడు నాలుగు సార్లు కన్నీళ్లొచ్చాయి. మా సినిమా సూపర్, బంపర్ అని చెప్పుకోవడం కామన్. నాకది రాదు. ఎమోషన్స్, ఎంటర్‌‌‌‌టైన్మెంట్, యాక్షన్, ఫ్యామిలీ వేల్యూస్ కలిసిన సాలిడ్ స్టోరీ. చాలా ఏళ్ల తర్వాత మంచి తెలుగు సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.

దసరాకి రావాలనుకున్నాం కానీ చివరి షెడ్యూల్‌‌లో వెంకటేష్  కాలు బెణికింది. అప్పటికి కోకో కోలా పెప్సీ పాట చిత్రీకరించాల్సి ఉంది. ఈలోపు సంక్రాంతికి రిలీజ్ అనే రూమర్స్ వచ్చాయి. సంక్రాంతికి వస్తే 250 నుండి 300 థియేటర్స్ మాత్రమే దొరుకుతాయి. కనుక ఆ ఆలోచనే చేయలేదు. కొన్ని మంచి చిత్రాల దర్శక నిర్మాతలను, రచయితలను ప్రోత్సహించడానికే చిన్న సినిమాల్ని విడుదల చేస్తున్నాం. నాకు కథ చెప్పి వాళ్ల క్రియేటివిటీకి తగ్గట్టు రూపొందిస్తారు. చిన్న చిన్న సలహాలు, సూచనలతో గుడ్ రిలీజ్ ఇస్తున్నానంతే. జనవరి నుండి ‘అసురన్’ రీమేక్ సెట్స్‌‌కి వెళ్తుంది. ప్రచారంలో ఉన్నట్టు అభిరామ్ ఇందులో నటించడం లేదు.

కథలను ఒక పట్టాన ఓకే చేయనని నాపై బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. ముప్ఫై ఏడేళ్ల కెరీర్‌‌‌‌లో చాలా కథలు విన్నాను. ఫిల్మ్ మేకింగ్ గురించి చాలా తెలుసుకున్నాను. గతంలో సినిమాల కంటే ఇప్పుడొచ్చే కథలు గొప్పగా అనిపించడం లేదు. నాకున్న అనుభవంతో స్క్రిప్ట్​లో ప్రశ్నలు అడుగుతుంటాను. సొంత నటీనటులైతే ఈ కేర్ ఇంకా ఎక్కువ. దర్శకుల నుండి సమాధానాలు సరిగా ఉండక ఓకే అవడం లేదు.  నేను జస్ట్ ఫైనాన్షియర్‌‌‌‌ని కాదు. ప్రొడ్యూసర్‌‌‌‌ని. అందుకే చాలా విషయాల్లో నా జోక్యం ఉంటుంది. చిన్నప్పటి నుండి ఇండస్ట్రీలో ఉండటం వల్ల అన్నీ తప్పులే కనిపిస్తాయి. ప్రస్ట్రేషన్, భయాలు ఉంటాయి. కానీ రష్ చూడగానే కామన్ ప్రేక్షకుడిలా అన్ని ఎమోషన్స్ ఫీలవుతాను. అంతర్జాతీయ స్థాయిలో ఒక్కో సినిమా స్క్రిప్ట్ వర్క్ రెండున్నరేళ్లకు పైగా జరుగుతుంది. ట్రాన్స్‌‌ఫార్మర్ లాంటి చిత్రాల షూటింగును ఎనిమిది వారాల్లో పూర్తి చేశారు. హిందీలో అక్షయ్ కుమార్ సినిమాలు ముప్ఫై రోజుల్లో పూర్తవుతున్నాయి. సరైన ప్లానింగ్, ప్రీ ప్రొడక్షన్​ వర్కే అందుకు కారణం. మనవాళ్లు ఆ వైపు దృష్టి పెట్టడం లేదు.

ఇతర వ్యాపార రంగాల్లో కొత్త మార్పులు వస్తున్నాయి. కానీ సింగిల్ స్క్రీన్స్ మాత్రం పాత ప్రోగ్రామింగ్ ప్రకారమే నడుస్తున్నాయి. నాలుగు ఆటలు ఒకే సినిమా ఆడితే ఒక ఊర్లో రెండే థియేటర్స్ ఉంటే.. పండక్కి వచ్చే నాలుగు సినిమాల్లో రెండు మాత్రమే చూడగలరు. అదే మల్టీప్లెక్స్ తరహాలో షోస్ షేర్ చేసుకుంటే అక్కడి ప్రేక్షకులు నాలుగు సినిమాలు చూడొచ్చు. పెద్ద సినిమాలకు లాంగ్ రన్ కూడా ఉంటుంది. ప్రేక్షకులకు సినిమాను ఎంతవరకూ అందుబాటులో ఉంచుతున్నాం అనేది ఇండస్ట్రీ ఆలోచించాలి. హిందీలో ఒకప్పుడు ముగ్గురు ఖాన్సే స్టార్స్. కానీ ఇప్పుడు అక్షయ్ కుమార్, ఆయుష్మాన్ ఖురానా వైవిధ్యమైన చిత్రాలతో మెప్పిస్తున్నారు. కంటెంట్ బేస్డ్‌‌ సినిమాలతో వంద కోట్లకు పైగా వసూళ్లు రాబడుతున్నారు. గుడ్ కంటెంట్ తో తీస్తే మన దగ్గర కూడా సినిమాలు ఆడతాయి.