పిల్లలు అబద్ధాలు చెప్పకుండా పెరగాలంటే.. భయపెట్టడం కాదు, ముందు పేరెంట్స్ ఇలా స్నేహంగా ఉండండి!

పిల్లలు అబద్ధాలు చెప్పకుండా పెరగాలంటే.. భయపెట్టడం కాదు, ముందు పేరెంట్స్ ఇలా స్నేహంగా ఉండండి!

మా పిల్లలు హీరోలు కావాలి. 'అందరి పిల్లల్లో  మా పిల్లలే బెస్ట్ గా ఉండాలి" అని కోరుకుంటారు పేరెంట్స్. కానీ, దాన్ని సాధించడంలో ఫెయిలవుతారు. పాజిటివ్ పేరెంటింగ్ తో  పెంచాల్సిన పిల్లల్ని డిఫరెంట్ గా పెంచుతారు. పిల్లల అవసరాల విషయంలో స్తోమతకు మించి ఖర్చు చేస్తుంటారు. పిల్లలపై, తమకు ఎంత ప్రేమ ఉందో వాళ్లకు తెలియాలని కొంతమంది పేరెంట్స్ ఇలా చేస్తుంటారు. అలాంటి పేరెంట్స్ వారి  పిల్లలు అబద్దం చెబితే మాత్రం తట్టుకోలేరు. ఇంత ప్రేమగా చూసుకుంటుంటే అబద్ధాలు చెబుతారా ? అని వాపోతారు.

పిల్లలకు పేరెంట్సే రోల్ మోడల్స్, పేరెంట్స్ కు ఉన్న టాలెంట్, ప్రవర్తనను పిల్లలు ఆటోమెటిక్ గా నేర్చుకుంటారు. ఆ క్వాలిటీస్ ని పెంచు కోవడానికి తెలీకుండానే ట్రై చేస్తారు. ప్రముఖ సైకాలజిస్ట్ క్యాంప్ బెల్ పరిశోధనల ప్రకారం పిల్లల ప్రవర్తనకు పెద్దల పెంపకం 75% కారణమని, మిగతా 25% మీడియా, సొసైటీ, స్కూల్ కారణం. పేరెంట్స్ విజయం సాధిస్తే పిల్లలూ విజయం సాధిస్తారు. అలాగే అబద్ధాలు అయినా, ప్రవర్తన అయినా పేరెంట్స్, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ నుంచే పిల్లలు నేర్చుకుంటారు. కోపం, నిరాశ నిస్పృహ, ఆనందం, అబద్ధాలు అన్నింటినీ పేరెంట్స్ నుంచే అలవాటు చేసుకుంటారు. వాటిని ఎలా చెప్పాలో, బాడీ లాంగ్వేజ్ ని కూడా పెద్దలను చూసే ఒంటబట్టించుకుంటారు. అందుకే పిల్లలు పెద్దయ్యాక హుందాగా ఉండాలంటే పేరెంట్స్ పిల్లల ముందు మంచిగా ప్రవర్తించాలి.

నమ్మకపోతే
నేర్చుకోవడం పిల్లల స్వభావం. పిల్లలు ఎప్పుడూ ఎదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. పెద్దల ప్రవర్తన పరిశీలిస్తూ, వాళ్లను అనుకరించే ప్రయత్నం చేస్తారు. పేరెంట్స్, పెద్దవాళ్లు చెప్పే అబద్ధాలను కూడా గమనిస్తారు. 'నాయనమ్మతో ఈ మాట అనకు... అమ్మకు ఈ సంగతి చెప్పొద్దు.. నాన్నకు తెలిస్తే ఊరుకోడు' అంటూ ఇంట్లో వాళ్లే పిల్లలతో అబద్దాలు ఆడిస్తారు. అబద్దం అతికినట్టు చెప్పడం నేర్పిస్తారు. ఇలా పెద్దల శిక్షణలో అబద్ధాలు నేర్చిన పిల్లలు పెద్దయ్యాక అబద్ధాలు నేర్పిన వాళ్లని కూడా నమ్మించేంతగా అబద్ధాల్లో ఎదిగిపోతారు.

చులకనగా చూడొద్దు
'మా పిల్లలతో తలనొప్పి.. అబద్ధాలు ఎక్కువ చెప్తున్నారు. వాళ్లను ఎలా దారికితేవాలి?' అని చాలామంది పేరెంట్స్ కంప్లైంట్. 'ఆన్ లైన్ క్లాసులు వింటున్నాం', 'హోమ్ వర్క్ చేస్తున్నాం', 'ఇంటిపట్టునే ఉంటున్నాం'.. ఇలా పిల్లలు చెప్పేవాటిలో సగం అబద్ధాలే అని పేరెంట్స్ తలపట్టుకుంటున్నారు. ఇలాంటివాళ్లను ఎలా దారికి తేవాలా అని ఆలోచిస్తున్నారు. కానీ, పిల్లలు ఇలా అబద్దం చెప్పడంలో అసలు తప్పు వాళ్లదే అని పేరెంట్స్ తెలుసుకోలేకపోతున్నారు. 'అబద్దం ఒక అవసరమే కాదు, యాటిట్యూడ్ కూడా. పిల్లలు నేర్చుకునేది పెద్దల నుంచే.. కాబట్టి ఆ తప్పులకు పెద్దలే బాధ్యులు' అంటున్నారు సైకాలజిస్ట్ క్రాంతికార్. అబద్ధాలు మాన్పించాలనుకునే పేరెంట్స్ ఏమేమి మార్చుకోవాలో ఆయన చెబుతున్నారు.

'నాయనమ్మతో ఈ మాట అనకు. అమ్మకు ఈ సంగతి చెప్పొద్దు. నాన్నకు తెలిస్తే ఊరుకోడు' అంటూ ఇంట్లో వాళ్లే పిల్లలతో అబద్ధాలు ఆడిస్తారు. అబద్దం అతికినట్టు చెప్పడం నేర్పిస్తారు.

పిల్లలు నేర్చుకొనే స్టేజ్లో తప్పులు చేయడం, అబద్ధాలు ఆడడం సహజం. తప్పులు చేస్తే సున్నితంగా అర్ధం అయ్యేలా చెప్పాలి. వాళ్లని మార్చాలి. అంతేగాని ఆ తప్పుని ఇతర కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు చెప్పి అవమానిస్తే పెద్దయినా ఆ వ్యక్తులతో ప్రేమగా మసలుకోలేరు. పిల్లలు చిన్న విమర్శ కూడా తట్టుకోలేరు. వాళ్లని కామెంట్ చేస్తే పెద్దవాళ్లని తిరిగి ఎదురించడం నేర్చుకుంటారు. పెద్దయ్యాక అదే పనిగా పేరెంట్స్ కి వ్యతిరేకంగా బిహేవ్ చేయడం అలవాటు అవుతుంది.

నిజం వినకపోతే
పిల్లలు నిజాయితీగా ఉన్నప్పుడు, నిజమే చెప్పినపుడు.. పెద్దలు నమ్మకపోతే బాధపడతారు. ఎంత చెప్పినా... నిజం నమ్మకపోతే కోపంతో అబద్దాలు చెప్పడం మొదలు పెడతారు. ఆ తర్వాత అందంగా అబద్ధాలు అల్లడం నేర్చుకుంటారు. పెంపకాన్ని బట్టే పిల్లల ప్రవర్తన ఉంటుంది. అందుకే పిల్లల్ని నమ్మితే పెద్దయ్యాక న్యాయంగా ఉంటారు. పిల్లల్లో రెస్పాన్స్ పేరెంట్స్ ని బట్టే ఉంటుంది. పేరెంట్స్ మారకుండా పిల్లల్ని మార్చాలని అనుకుంటే ఫలితం ఉండదు. కొంతమంది పేరెంట్స్ కోపాన్ని తగ్గించుకోరు. పిల్లలు కూడా ఎదురు తిరిగితే వాళ్లకు కోపం ఎక్కువని ఆరోపిస్తారు. ఒక్కోసారి పెద్దలే అబద్ధాలు చెబుతూ పిల్లలు చెప్పేవాటినే అబద్ధాలని కొట్టిపారేస్తారు. ఇవి వాళ్లను నెగటివ్ ఆలోచనవైపు నెడతాయి.

అబద్ధాలు తగ్గాలంటే
పిల్లల మనసు గాయపడే మాటలు ఎప్పుడూ అనొద్దు. ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి. స్నేహితుల్లా మాట్లాడాలి. అప్పుడు వాళ్ల మనుసులో ఉన్నవాటిని భయపడకుండా ఫ్రీగా చెబుతారు. వాళ్లు చేసిన దానికి వ్యతిరేకంగా మాట్లాడితే. కోపం పెంచుకుంటే మాత్రం నిజాలు దాచి, అబద్ధాలు ఆడతారు. ఎప్పుడూ పేరెంట్స్ చెప్పేదే వినాలనుకోవద్దు. పిల్లలు చెప్పింది కూడా వినాలి. వింటే సరిపోదు. తాము చెప్పింది పేరెంట్స్ నమ్ముతున్నారనే భావన పిల్లల్లో కలిగించాలి. అప్పుడే అన్ని విషయాలు పంచుకుంటారు. పిల్లలతో స్నేహితుల్లా ఉండాలి. అప్పుడే ఒక్కో సమస్యని, కష్టమైనవాటిని కూడా పేరెంట్స్ తో షేర్ చేసుకుంటారు.