వెలుగు స్పెషల్ : ఐఐటీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో గుడ్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ కోర్సు అభినందనీయం

వెలుగు స్పెషల్ : ఐఐటీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో గుడ్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ కోర్సు అభినందనీయం

ఇటీవల ఐఐటీ హైదరాబాద్ ‘మంచితనం’పై ఒక ప్రత్యేక కోర్సును ప్రారంభించింది. ఇది నిజంగా అభినందనీయమైన విషయం. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కేవలం టెక్నాలజీ, మార్కులు, ఉద్యోగాలు మాత్రమే కాకుండా మానవత్వం, సేవాగుణం, ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం, మంచి వ్యక్తిత్వం ఉండాలనే ఉద్దేశంతో ఈ కోర్సును తీసుకురావడం గొప్ప ఆలోచన. ఇండియన్  ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ ప్రారంభించిన ఆ వినూత్నమైన కోర్సు పేరు  ‘గుడ్‌‌‌‌‌‌‌‌నెస్:  క్యారెక్టర్, రెస్పాన్సిబిలిటీ అండ్ హ్యూమన్ ఫ్లోరిషింగ్’ మంచితనం, మానవత్వం, సేవాగుణంపై ఒక క్రెడిట్ కోర్సును ప్రవేశపెట్టడం నిజంగా హర్షణీయం.

ఈ కోర్సును ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్‌‌‌‌‌‌‌‌నెస్ వ్యవస్థాపకుడు, ఐఐటీ రూర్కీ పూర్వ విద్యార్థి రవి శర్మ రూపొందించారు. ఇప్పటికే 140 మందికి పైగా బీటెక్ విద్యార్థులు ఈ కోర్సులో చేరారు. ఏడు సెషన్లలో  గుడ్‌‌‌‌‌‌‌‌నెస్  ఇండెక్స్, శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక వికాసం, క్యారెక్టర్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్, క్యారెక్టర్ డివిడెండ్, పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, మంచితనానికి 
ఉన్న సంబంధం వంటి అంశాలను బోధిస్తారు.

ఎందుకు ఈ కోర్సు అవసరం? 

ప్రపంచ ఆనంద సూచీ (వరల్డ్​ హ్యాపీనెస్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌)లో భారత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 2024లో 126వ స్థానంలో ఉన్న మనం 2025లో 118వ స్థానానికి మెరుగుపడ్డాం. అయినా పాకిస్తాన్ (109), నేపాల్ (99) వంటి దేశాలు కూడా మనకంటే ముందున్నాయి.  మనం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా... ఆనందంలో, సామాజిక మద్దతులో 123వ స్థానంలో ఉన్నాం. దీన్నిబట్టి అర్థమవుతున్నది ఏమిటంటే, మనకు డబ్బు సమస్య కాదు, మంచితనం, సహాయ గుణం, ఒకరికొకరు తోడుగా నిలబడే గుణం తగ్గిపోయింది.  ఆ లోటును పూడ్చడానికే ఇలాంటి కోర్సు అవసరం.

నేడు మన సమాజంలో విలువల పతనం 

స్పష్టంగా కనిపిస్తోంది. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి అన్నట్లు ‘విద్య అనేది కేవలం జ్ఞానానికి,  ఉద్యోగ నైపుణ్యానికి మాత్రమే పరిమితం కాకూడదు’.  వాస్తవంగా చెప్పాలంటే మంచితనం అనేది పుస్తకాల నుంచి రాదు. అది ఆచరణ నుంచి వస్తుంది. తోటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, ఇతరులను ఆదుకోవడం ద్వారా ఇలా అనేక సందర్భాల్లో మంచితనం అనేది విద్యార్థుల్లో పెంపొందించవచ్చు.  ఇలాంటి కోర్సును యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మరింత అధ్యయనం చేసి భారతదేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో,  కళాశాలల్లో ఈ కోర్సును పరిచయం చేసి ప్రయోగాత్మకంగా అమలు చేయాలి. ఉత్తమ పౌరులు ఉన్నప్పుడే సమాజం ప్రగతిపథంలో పయనిస్తుంది. ఉత్తమ పౌరులను తయారుచేసే ఒక అత్యుత్తమ సాధనంగా ఈ  ‘మంచితనం’  కోర్సు నిలవాలి. 

తరగతి బోధన కంటే ఆచరణకు ప్రాధాన్యత ఇవ్వాలి

 తరగతి గది బోధన కంటే క్షేత్రస్థాయి పర్యటనలు, స్వచ్ఛంద సంస్థలతో అనుసంధానం, పరిచయాలు చాలా ముఖ్యం. ఐఐటీ లాంటి ఉన్నత సంస్థ ఇలాంటి కోర్సును ప్రవేశపెట్టడం ఒక శుభ పరిణామం. కానీ  తరగతి గదికి మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థులను సమాజంలోకి తీసుకెళ్లాలి. ప్రభుత్వ సేవాసంస్థలైన ఎన్ఎస్ఎస్, ఎన్‌‌‌‌‌‌‌‌సీసీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్,  లయన్స్ క్లబ్స్,  రోటరీ క్లబ్, ఇండియన్  రెడ్‌క్రాస్  సొసైటీ, ఆధ్యాత్మిక సంస్థలైన ఇస్కాన్, రామకృష్ణ సేవాసమితి, బ్రహ్మకుమారీస్,  జమాతే ఇస్లామి హింద్, వివిధ ప్రముఖ స్వచ్ఛంద సంస్థలైన టీచ్ ఇండియా, ప్రథమ్, స్మైల్ ఫౌండేషన్,  చమక్  ఫౌండేషన్, సంస్థల కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలి.  

వివిధ రంగాల ప్రముఖులు,  సామాజికవేత్తలైన అన్నాహజారే, సందీప్ పాండే, కైలాస సత్యార్థి వంటి ప్రముఖ వ్యక్తులను కలిసి ఆలోచనలను పంచుకోవాలి. దీంతో  వారు విలువైన జీవితాన్ని సమాజం కోసం ఎలా త్యాగం చేశారో  విద్యార్థులకు తెలుస్తుంది. మానవత్వం అనేది చిగురిస్తుంది.  అప్పుడే ‘మంచితనం’ ఒక కోర్సుగా కాకుండా, ఒక జీవన విధానంగా మారుతుంది. మన సమాజానికి కేవలం డాక్టర్లు, ఇంజనీర్లు,  శాస్త్రవేత్తలే కాదు, మంచి మనసున్న మనుషులు సైతం కావాలి.  మంచితనం లౌకిక భారత్‌‌‌‌‌‌‌‌కు అసలైన పునాది. 

-  డా. మొహమ్మద్ ఆజమ్ అలీ 
అసిస్టెంట్ ప్రొఫెసర్,
 భారత రాష్ట్రపతి సేవా పురస్కార గ్రహీత
ఓపెన్​ పేజీకి  వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
[email protected]
రచన 700 పదాలకు మించరాదు.