వాషింగ్టన్: రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను భారత్ ఒక్కరోజులోనే పూర్తిగా నిలిపివేయడం ఏమాత్రం సాధ్యం కాదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టంచేశారు. రష్యాపై కఠిన ఆంక్షలు విధించడంతో పాటు ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు మోపితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు అమెరికాపై ఎలాంటి ప్రభావం పడుతుందో తేల్చేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 60 రోజుల వ్యవధి కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల్లో భారత్ తీసుకుంటున్న నిర్ణయాలను అమెరికా అర్థం చేసుకుంటోందని వెల్లడించారు. అమెరికా కాంగ్రెస్ రూపొందించిన కఠినమైన ‘రష్యా –-ఇరాన్ ఆంక్షల చట్టం’ అమలు నుంచి అధ్యక్షుడు ట్రంప్ జాతీయ ప్రయోజనాలను ఉటంకిస్తూ తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు.
ఈ చట్టం నిబంధనల ప్రకారం, రష్యా నుంచి అత్యధికంగా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే భారత్, చైనాతో సహా ఐదు ప్రధాన దేశాలపై అమెరికా గరిష్టంగా 100 శాతం వరకు ప్రతీకార సుంకాలు విధించే అవకాశం ఉంది. అయితే, ఈ ఆంక్షలను యథాతథంగా అమలు చేస్తే అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరా తీవ్రంగా దెబ్బతిని ధరలు భగ్గుమనే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసింది.
భారత్ కీలక భాగస్వామి
భారత్‌లాంటి దేశాలు ఇతర మార్గాల ద్వారా ఇంధనాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇప్పటికీ అవసరమైన చమురులో సింహభాగాన్ని రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయని మార్కో రూబియో పేర్కొన్నారు. ఒకదేశం తన ఇంధన వనరుల కోసం రాత్రికి రాత్రే ప్రత్యామ్నాయాల వైపు మళ్లడం ఏమాత్రం ఆచరణ సాధ్యం కాదన్నారు.
భారత్ తమకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక మిత్రదేశమని రూబియో స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల నడుమ చమురు మార్కెట్ ఒడిదుడుకులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని, అందుకే అన్ని అంశాలనూ నిశితంగా పరిశీలించి బ్యాలెన్స్డ్ నిర్ణయం తీసుకునేందుకే అధ్యక్షుడు ట్రంప్ గడువు కోరుతున్నారని ఆయన వివరించారు.
