బ్రిస్టల్ పోరుకు ముందు.. భారత్ vs ఇంగ్లండ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!

బ్రిస్టల్ పోరుకు ముందు.. భారత్ vs ఇంగ్లండ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!

IND vs ENG 4th T20: ఇంగ్లాండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా 125 రన్స్ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2–0తో లీడ్‌లోకి దూసుకెళ్లింది. మొదటి మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లీష్ టీమ్, మూడో పోరులో భారత్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ హెడ్ టు హెడ్ రికార్డులు: 
నాలుగో టీ20 మ్యాచ్‌పై ఉత్కంఠ పెరుగుతున్న తరుణంలో, ఇరు జట్ల మధ్య ఉన్న హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతాయి. ఇప్పటి వరకు భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 141 టెస్టు మ్యాచ్‌లు జరగగా అందులో ఇంగ్లాండ్ 53 మ్యాచ్‌లు, భారత్ 37 మ్యాచ్‌లు గెలిచాయి, అలాగే 51 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇక వన్డే (ODI) ఫార్మాట్‌లో ఇరు జట్లు 110 సార్లు తలపడగా భారత్ 61 మ్యాచ్‌ల్లో, ఇంగ్లాండ్ 44 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. వీటిలో 2 మ్యాచ్‌లు టై అవ్వగా, 3 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

రికార్డుల పరంగా ఎవరెంత టాప్: 
ఇక టీ20 ఇంటర్నేషనల్స్ విషయానికి వస్తే, ఇరు జట్ల మధ్య అత్యధిక టీమ్ స్కోరు 253/7 పరుగులుగా నమోదైంది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ ఈ భారీ స్కోరు సాధించింది. కాగా, అత్యల్ప స్కోరుగా 76 రన్స్ నమోదైంది. ఇది జులై 7న జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ నమోదు చేసిన అత్యంత పేలవమైన రికార్డు.

బ్రిస్టల్ పోరు ఎవరిదో: 
భారత్ తన చివరి ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం (L, L, L, L, W) సాధించగా, ఇంగ్లాండ్ జట్టు నాలుగు విజయాలతో (W, W, L, W, W) ఫుల్ స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఇంగ్లాండ్ జట్టు అన్ని విభాగాల్లోనూ టీమిండియాపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారత జట్టుకు తమ ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడానికి, సిరీస్ ఓటమిని తప్పించుకోవడానికి నాలుగో టీ20 మ్యాచ్ ఒక సువర్ణావకాశం కాగా, ఇంగ్లాండ్ మాత్రం ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.