జ్ఞానేశ్‌‌‌‌పై జంగ్.. సుప్రీంకు మార్చ్  రాహుల్, ప్రియాంక నేతృత్వంలో భారీ ర్యాలీ

జ్ఞానేశ్‌‌‌‌పై జంగ్.. సుప్రీంకు మార్చ్  రాహుల్, ప్రియాంక నేతృత్వంలో భారీ ర్యాలీ

‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’లో వేలాది మంది
కన్నాట్ ప్లేస్ టు మండీ హౌస్​ జన జాతర
స్తంభించిన మండీ హౌస్, బారాఖంబా రోడ్
‘సర్’ను వెంటనే నిలిపివేయాలని సుప్రీంలో పిటిషన్
నోటీసులు ఇవ్వకుండా ఓట్లు తొలగించొద్దు
బూత్‌‌‌‌ల వారీగా తొలగింపుల జాబితా బయటపెట్టాలి
రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఆడిట్ కమిటీ వేయాలి
రాహుల్​, ఖర్గే, అఖిలేశ్, తేజస్వీ తదితరుల పిటిషన్

 

న్యూఢిల్లీ :  ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను తక్షణమే నిలిపివేయాలని, నోటీసు ఇవ్వకుండా, వాదన వినకుండా ఏ ఒక్క ఓటరునూ జాబితా నుంచి తొలగించకుండా చూడాలనే డిమాండ్​తో ఇండియా కూటమి చేపట్టిన మార్చ్​తో ఢిల్లీ దద్దరిల్లింది. ‘ఓట్ చోరీ’ ఆరోపణలపై, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌కు వ్యతిరేకంగా పిటిషన్ సమర్పించేందుకు లోక్‌‌‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ నేతృత్వంలో సోమవారం ‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’ పేరిట సుప్రీంకోర్టు వైపు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) అధ్యక్షురాలు నేహా బోరా ఇద్దరు నేతల వెంట నడిచారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, పౌర హక్కుల ఉద్యమకారులు ఈ కవాతులో పాల్గొనడంతో మండీ హౌస్, బారాఖంబా రోడ్ సహా రాజధానిలోని ప్రధాన మార్గాలు పూర్తిగా స్తంభించిపోయాయి. సర్​కు సంబంధించి ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకున్న తీరును ప్రతిపక్ష నేతలు పిటిషన్‌‌‌‌లో సవాల్ చేశారు. వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించిన పూర్తి ఫైళ్లు, అజెండాలు, మినిట్స్, నోటింగ్స్, అభ్యంతరాలను బయటపెట్టాలని కోరారు. సర్​ ప్రారంభిస్తూ 2025 జూన్ 24న తీసుకున్న నిర్ణయంతో పాటు ఈసీఐనెట్, ఈఆర్‌‌‌‌ఓనెట్ యాక్సెస్ లాగ్స్‌‌‌‌ను కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు.

దద్దరిల్లిన ఢిల్లీ

ఢిల్లీ నగరం సోమవారం ఉదయం నుంచే పోలీసు వలయంలోకి వెళ్లిపోయింది. వరుసగా మూడో రోజూ రాజధానిలో హై అలర్ట్‌‌‌‌ కొనసాగింది.  30 వేల మందికి పైగా పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. పటేల్ చౌక్, జన్‌‌‌‌పథ్, రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియెట్, బారాఖంబా రోడ్ మెట్రో స్టేషన్లలో ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎంట్రీ, ఎగ్జిట్‌‌‌‌లను మూసేస్తున్నట్లు డీఎంఆర్‌‌‌‌సీ ప్రకటించింది. ఉదయం 11.30కి ఇందిరా భవన్‌‌‌‌లో రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. 

ఢిల్లీని జైలుగా ఎందుకు మారుస్తున్నారని రాహుల్​ గాంధీ ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం జ్ఞానేశ్ కుమార్‌‌ను ఎలా కాపాడుతోందో దేశానికి చూపించాలనుకుంటున్నామని చెప్పారు.  మధ్యాహ్నం ప్రతిపక్ష నేతలు ర్యాలీగా బయలుదేరారు. నేతలు, కార్యకర్తలు ముందుగా కాన్‌‌స్టిట్యూషన్ క్లబ్ వద్ద చేరుకుని, నాలుగు ఏసీ బస్సుల్లో బారాఖంబా రోడ్ జంక్షన్‌‌కు బయలుదేరారు. మధ్యాహ్నం 3.24కి నేతలు బారాఖంబా రోడ్‌‌కు చేరుకునే సరికి అక్కడి నుంచి మండీ హౌస్ వరకు కూటమి మద్దతుదారులతో కిక్కిరిసిపోయింది. రాహుల్, ప్రియాంకతో పాటు ఖర్గే, సీపీఐ నేత డీ రాజా, సీపీఎం నేత ఎం.ఎ.బేబీ, తేజస్వీ యాదవ్, సుప్రియా సూలే, సంజయ్ రౌత్, సీపీఐ (ఎంఎల్) నేత దీపాంకర్ భట్టాచార్య, ఐయూఎంఎల్ నేత ఈ.టి.మహమ్మద్ బషీర్ ర్యాలీకి నాయకత్వం వహించారు. శశి థరూర్, సచిన్ పైలట్, ముకుల్ వాస్నిక్, టీఎంసీ నేత సాగరికా ఘోష్, యోగేంద్ర యాదవ్, ఐసా అధ్యక్షురాలు నేహా బోరా కూడా పాల్గొన్నారు. సాయంత్రం 4.22కి కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్ వద్ద బస్సు దిగిన నేతలు సుప్రీంకోర్టు వైపు నడక ప్రారంభించారు.

4.31కి ర్యాలీ సుప్రీంకోర్టుకు కిలోమీటర్‌‌కు పైగా దూరంలో ఉన్న మండీ హౌస్‌‌కు చేరుకుంది. 4.41కి భగవాన్ దాస్ రోడ్ వద్ద బారికేడ్లతో పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో రాహుల్, అఖిలేశ్ సహా కొందరు నేతలు ఒక వాహనం పైకెక్కారు. నిరసనకారులు జాతీయ జెండాలు, ప్లకార్డులు పట్టుకుని ఎస్‌‌ఐఆర్ అవకతవకలపై నినాదాలు చేశారు.  రాజ్యాంగ సంస్థ అధిపతి కనిపించకపోతే ప్రశ్నించాల్సిందేనని, జ్ఞానేశ్ కుమార్ ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. సీజేఐ తమను కలవకపోతే ప్రజల గోడు ఎవరు వింటారని, తమను కలవాలని కాంగ్రెస్ ఎంపీ అమరీందర్ సింగ్ రాజా విజ్ఞప్తి చేశారు. యూపీలో ఎస్‌‌ఐఆర్ పూర్తయినా ఇంకా పెద్ద సంఖ్యలో డబుల్ ఓట్లు ఉన్నాయని, కోట్లు ఖర్చు పెట్టినా ఓటర్ల జాబితాను సరిచేయలేకపోయారని, ఎన్నికల సంఘం బీజేపీ చెప్పినట్లు నడుస్తున్నట్లు కనిపిస్తోందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. 

జాబితా బయటపెట్టండి

తొలగించిన ఓటర్ల పేర్లను బూత్‌‌ల వారీగా, తొలగింపునకు గల కారణాలు, సామాజిక వివరాలతో సహా ప్రచురించాలని పిటిషన్‌‌లో కోరారు. ఈసీఐనెట్, ఈఆర్‌‌ఓనెట్ సహా ఓటర్ల జాబితా డేటాబేస్‌‌లలో జరిగిన తొలగింపులు, మార్పులపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో స్వతంత్ర కమిటీతో ఆడిట్ చేయించాలని విజ్ఞప్తి చేశారు. కేసు తేలే వరకు కొనసాగుతున్న ఎస్‌‌ఐఆర్‌‌ను మధ్యంతరంగా నిలిపివేయాలని కోరారు. 2023 చట్టం ప్రకారం ఎస్‌‌ఐఆర్‌‌కు సంబంధించిన ప్రతి నిర్ణయాన్నీ ఎన్నికల సంఘం విధిగా మినిట్స్‌‌లో నమోదు చేసేలా ఆదేశించాలని పిటిషన్‌‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పిటిషన్‌‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, సీపీఐ నేత డి.రాజా, జేఎంఎం ఎంపీ మహువా మాజీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ, ఐయూఎంఎల్ నేత ఈ.టి.మహమ్మద్ బషీర్ కూడా దాఖలు చేశారు.

ప్రతిపక్ష నేతలంతా ఒక్కతాటిపైకి

ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మార్చ్‌‌లో కాంగ్రెస్‌‌తోపాటు టీఎంసీ, ఆర్జేడీ, సమాజ్‌‌వాదీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌‌ అగ్రనేతలు రాహుల్‌‌, ప్రియాంక, ఎస్పీ అధినేత అఖిలేశ్‌‌ యాదవ్‌‌, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్‌‌, తెలంగాణ సీఎం రేవంత్‌‌ రెడ్డి, కర్నాటక సీఎం డీకే శివకుమార్‌‌, హిమాచల్‌‌ప్రదేశ్‌‌ సీఎం సుఖ్వీందర్‌‌ సింగ్‌‌ సుఖు, కేరళ సీఎం వీడీ సతీశన్‌‌, ఏఐఎస్‌‌ఏ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా మార్చ్‌‌లో కదం కలిపారు.కనౌట్‌‌ ప్లేస్‌‌–బరాఖంబా రోడ్‌‌ జంక్షన్ వద్దకు భారీగా చేరుకున్న నిరసనకారులు అక్కడి నుంచి సుప్రీంకోర్టు వైపు కదిలారు. ర్యాలీలో ఎటుచూసినా జాతీయ జెండాలతోపాటు వివిధ పార్టీల జెండాలు రెపరెపలాడాయి. సర్ లో  అక్రమాలు జరిగాయంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘ఓట్‌‌ చోర్‌‌.. గద్దీ ఛోడ్‌‌’ అంటూ నినాదాలు చేశారు. 

పార్టీల జెండాలు వద్దు ప్రజా ఉద్యమంగా మార్చ్

ఇండియా కూటమి తన నిరసనల వ్యూహాన్ని మార్చుకుంది. కేవలం సీఈసీ జ్ఞానేశ్‌‌కుమార్‌‌ రాజీనామా డిమాండ్‌‌కే పరిమితం కాకుండా, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంగా మార్చ్‌‌ను నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కూటమి పార్టీల జెండాలకు బదులు జాతీయ జెండాలు మాత్రమే తీసుకురావాలని నేతలకు కాంగ్రెస్‌‌సూచించింది. గత వారం నిరసనల్లో కాంగ్రెస్‌‌ జెండాలే ఎక్కువగా కనిపించడంతో కూటమి పార్టీల మధ్య ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినట్టు సమాచారం. దీనివల్ల ఇతర పార్టీల నేతలు కొందరు నిరసనలకు దూరంగా ఉన్నారన్న చర్చ కూడా వచ్చింది. అలాగే విద్యార్థులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, యువతను ముఖ్యంగా జెన్‌‌జీని భాగస్వాములను చేయాలని కాంగ్రెస్‌‌ భావిస్తున్నది. ఢిల్లీలో గత రెండు రోజులుగా న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు నిర్వహించిన నిరసనల తీరును పరిశీలించిన తర్వాత ఈ మార్పులు చేసినట్టు తెలుస్తున్నది.