ఇస్లామాబాద్: పాకిస్తాన్లో అశాంతిని సృష్టించడానికి భారత్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నదని పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీ (ఎన్సీఏ) సలహాదారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ మజార్ జమీల్ నిరాధార ఆరోపణలు చేశారు.
పాకిస్తాన్లో అస్థిరతకు భారతే కారణమంటూ హాస్యస్పద వ్యాఖ్యలు చేశారు. తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ), బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) వంటి ఉగ్రవాద సంస్థలకు ఇండియా మద్దతు ఇస్తోందని మండిపడ్డారు. పాకిస్తాన్ను అంతర్గతంగా బలహీనపరిచేందుకు భారత్ 'దోవల్ వ్యూహాన్ని' బహిరంగంగానే అమలు చేస్తోందని.. విధానపరమైన సాధనంగా టెర్రరిజాన్ని వాడుకుంటున్నదని ఫైర్ అయ్యారు.
ఈ నెల 13న ఆయన లండన్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (ఐఐఎస్ఎస్) వేదికగా జరిగిన సమిట్ లో ‘న్యూక్లియర్ డిటరెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టెబిలిటీ ఇన్ సౌత్ ఏషియా’ అనే అంశంపై మాట్లాడారు. గతంలో భారత్ ముక్తి వాహినికి, ఎల్టీఈఈ(లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం)కి సహాయం చేసిందని జమీల్ గుర్తుచేశారు.
గతేడాది జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ 'డ్యూయల్ కేపబుల్(అణు, సంప్రదాయ ఆయుధాలను మోసుకెళ్లగల)' బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని ఆయన అబద్ధాల్ని కూడా చెప్పుకొచ్చారు.
