టెస్ట్ క్రికెట్‌లో భారత్ టాప్-2లో లేదు.. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్లు ఇవే!

టెస్ట్ క్రికెట్‌లో భారత్ టాప్-2లో లేదు.. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్లు ఇవే!

Most Test Matches: 1877లో ప్రారంభమైన టెస్టు క్రికెట్ ప్రయాణం నేటికీ అత్యంత ప్రతిష్టాత్మకమైందిగా కొనసాగుతోంది. ప్రస్తుతం 12 దేశాలకు ఐసీసీ అధికారిక టెస్టు హోదా ఇచ్చినప్పటికీ, కాలక్రమేణా ఈ సుదీర్ఘ ఫార్మాట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వందలాది మ్యాచ్‌లు ఆడిన జట్లలో భారత జట్టు ఒకటిగా నిలిచింది. గాలే వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టుతో భారత్ తన టెస్టు చరిత్రలో 600వ మ్యాచ్ పూర్తి చేసుకుని అరుదైన మైలురాయిని అందుకుంది. కానీ 600 మ్యాచ్‌లు ఆడినప్పటికీ అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన జట్ల జాబితాలో టీమిండియా తొలి రెండు స్థానాల్లో మాత్రం లేదు. ఈ సందర్భంగా టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్–5 జట్ల వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం.. 

* న్యూజిలాండ్ - 487 మ్యాచ్‌లు: 

1930లో టెస్టు హోదా పొందిన న్యూజిలాండ్ జట్టు ఇప్పటి వరకు 487 టెస్టులు ఆడి ఐదో స్థానంలో నిలిచింది. 126 విజయాలు, 190 ఓటమతో కివీస్, 2021లో జరిగిన తొలి డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్లో భారత్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలవడం వారి సుదీర్ఘ టెస్టు ప్రయాణంలో మరచిపోలేని ఘట్టంగా మిగిలిపోతుంది.

* వెస్ట్ ఇండీస్ - 596 మ్యాచ్‌లు:

ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన కరేబియన్ జట్టు వెస్టిండీస్ 596 మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. 1928లో టెస్టు ప్రయాణం ప్రారంభించిన విండీస్, ఇప్పటి వరకు 187 విజయాలు సాధించి, 224 మ్యాచుల్లో ఓడిపోయింది. 1970ల నుంచి 1990ల వరకు భయంకరమైన ఫాస్ట్ బౌలింగ్ అటాక్, దిగ్గజ బ్యాటింగ్ లైనప్‌తో టెస్టు ప్రపంచంలో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

►ALSO READ | భారత్ vs శ్రీలంక టెస్ట్ మ్యాచ్ని ఆడ్డుకున్న వరుణుడు.. భయంలో టీమిండియా

* భారత్ - 600 మ్యాచ్‌లు: 

1932లో టెస్టు హోదా పొందిన భారత జట్టు ఇప్పటి వరకు 600 టెస్టు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మూడో స్థానంలో నిలిచింది. అందులో 186 విజయాలు, 188 ఓటములు సాధించగా, విన్/లాస్ రేషియో 0.989గా ఉంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో వరుసగా ఐదేళ్ల పాటు టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగిన భారత్, డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్స్ 2021, 2023లకు వరుసగా అర్హత సాధించిన ఏకైక జట్టుగా నిలిచింది.

ఆస్ట్రేలియా - 883 మ్యాచ్‌లు: 

టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన జట్టుగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. 1877లో మెల్‌బోర్న్ వేదికగా ఇంగ్లాండ్‌తో తొలి అధికారిక టెస్టు ఆడిన ఆసీస్, ఇప్పటి వరకు 883 మ్యాచ్‌లు ఆడింది. ఆస్ట్రేలియా గెలుపు/ఓటమి నిష్పత్తి 1.812 కాగా, ఐదు జట్లలోనూ ఇదే అత్యుత్తమ రికార్డు. అంతేకాకుండా 34.31 బ్యాటింగ్ సగటుతో నిలకడైన ప్రదర్శనను కొనసాగిస్తోంది.

ఇంగ్లాండ్ - 1097 మ్యాచ్‌లు: 

క్రికెట్ జన్మస్థలంగా పేరొందిన ఇంగ్లాండ్, ప్రపంచంలోనే 1000+కి పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది. 1877లో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడిన ఇంగ్లాండ్, ఇప్పటి వరకు 1097 మ్యాచ్‌ల్లో పాల్గొంది. అందులో 405 విజయాలు, 336 ఓటములు నమోదు చేయగా.. 356 మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. ఇంగ్లాండ్ గెలుపు/ఓటమి (W/L) నిష్పత్తి 1.205గా ఉంది.