వెలుగు స్పెషల్: రక్షణ రంగంలో సరికొత్త మైలురాళ్లు

వెలుగు స్పెషల్: రక్షణ రంగంలో  సరికొత్త మైలురాళ్లు

దేశ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తూ తన అణుశక్తిని వేగంగా ఆధునికీకరిస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, యుద్ధాల నేపథ్యంలో ఇటీవలి కాలంలో అనేక దేశాలు తమ సైనిక సామర్థ్యాలను బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా అణుశక్తి కలిగిన దేశాలు తమ ఆయుధ సంపత్తిని మరింత మెరుగుపరుచుకుంటున్నాయి. శత్రువుల నుంచి వచ్చే ఏ రకమైన ముప్పునైనా తట్టుకుని తిప్పికొట్టేలా నింగి, నేల, సముద్ర మార్గాల ద్వారా ప్రయోగించే వ్యూహాత్మక వ్యవస్థలను భారత్ విజయవంతంగా సిద్ధం చేసుకుంది. శాస్త్రవేత్తలు హాన్స్ ఎమ్ క్రిస్టెన్సెన్, మాట్ కోర్డా, ఎలియానా జాన్స్, మెక్కెంజీ నైట్ బోయిల్ రూపొందించిన  నివేదిక ప్రకారం భారత్ తన అణు సామర్థ్యంలో పారదర్శకతను కాపాడుకుంటూనే,  స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధ సంపత్తిని బలోపేతం చేసుకుంటోంది. 

వైమానిక దళంలో మిరాజ్ 2000, జాగ్వార్ విమానాలు ప్రస్తుతం వ్యూహాత్మక అణుదాడులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. రానున్న రోజుల్లో జాగ్వార్ స్థానంలో ఫ్రాన్స్ నుంచి పొందిన ‘రఫేల్’ యుద్ధ విమానాలు ఈ బాధ్యతను స్వీకరించనున్నాయని నివేదికలు పేర్కొన్నాయి. 

న్యూక్లియర్ ట్రయాడ్

 భారతదేశ అణు సామర్థ్యం, రక్షణ శక్తిపై అంతర్జాతీయంగా మరోసారి కీలకమైన నివేదిక వెలువడింది. భారత్ వద్ద ప్రస్తుతం సుమారు 190 అణ్వాయుధాలు అందుబాటులో ఉన్నాయని,  సుదూర లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగల అధునాతన క్షిపణి వ్యవస్థలను నిరంతరం ఆధునికీకరిస్తోందని ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 'బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్' వెల్లడించింది. ముందుగా అణుదాడి చేయం అనే సూత్రానికి కట్టుబడి ఉంటూనే శత్రువులు దాడికి పాల్పడితే కోలుకోలేని దెబ్బతీసే రీతిలో భూమి, ఆకాశం,  సముద్ర మార్గాల్లో 'న్యూక్లియర్ ట్రయాడ్'ను భారత్ సిద్ధంగా ఉంచుకుంది. 

ప్రముఖ అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం భారతదేశం వద్ద ప్రస్తుతం సుమారు 190 అణ్వాయుధాలు (న్యూక్లియర్ వార్‌‌‌‌‌‌‌‌హెడ్‌‌‌‌‌‌‌‌లు) ఉన్నట్లు అంచనా.  ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్,  స్టాక్‌‌‌‌‌‌‌‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్  వంటి సంస్థలు ఈ తాజా గణాంకాలను వెల్లడించాయి. దక్షిణాసియాలో పాకిస్తాన్ వద్ద సుమారు 170 అణ్వాయుధాలు ఉండగా, భారత్ దానిని దాటి 190కి  చేరుకుంది. ఈ అణ్వాయుధాల్లో కొత్త రకం క్షిపణుల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన 30 వార్‌‌‌‌‌‌‌‌హెడ్‌‌‌‌‌‌‌‌లు కూడా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. భూమి, గగనతలం ,  సముద్రం (అణుశక్తితో నడిచే సబ్‌‌‌‌‌‌‌‌మెరైన్లు) అనే మూడు మార్గాల ద్వారా అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యాన్ని (న్యూక్లియర్ ట్రయాడ్) భారత్ బలోపేతం చేసుకుంటోంది.  

 'నో  ఫస్ట్ యూజ్'

భారత్ ఇప్పటికీ తన 'నో- ఫస్ట్- యూజ్' (మొదట అణ్వాయుధాలను ఉపయోగించబోమనే) విధానానికి కట్టుబడి ఉంది.  భారత్ తన వద్ద ఉన్న అణు ఆయుధ సంపత్తిని, క్షిపణి పరిధిని అధికారికంగా ఎప్పుడూ బహిర్గతం చేయదు. అయినప్పటికీ భారత్ వద్ద దాదాపు 190 అణ్వాయుధాలు ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇతర దేశాల సహాయం లేకుండా స్వదేశీ సాంకేతికతతో డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఓ  అభివృద్ధి చేసిన క్షిపణులు భారత్‌‌‌‌‌‌‌‌కు  బలమైన రక్షణ కవచంగా మారాయని కొనియాడారు. ఆకాశమార్గంలో అణుదాడులు చేయగల సామర్థ్యంలో మిరాజ్ 2000, జాగ్వార్ విమానాలు ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

భవిష్యత్తులో జాగ్వార్ విమానాల స్థానంలో  ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు ఈ బాధ్యతలను స్వీకరించనున్నాయి.  నౌకాదళంలోకి మూడో అణు జలాంతర్గామి 'ఐఎన్‌‌‌‌‌‌‌‌ఎస్  అరిధమన్'  భారత సాయుధ దళాల వెన్నెముకగా నిలిచిన అగ్ని క్షిపణులు సుదూర లక్ష్యాలను ఛేదించగలవు.  అగ్ని-I నుంచి అగ్ని-IV క్షిపణులు 700 కిలోమీటర్ల నుంచి 3,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి కలిగి ఉన్నాయి.  6 వేల కిలోమీటర్ల పరిధి కలిగి ఉన్న అగ్ని-5 మొత్తం పాకిస్థాన్, చైనా భూభాగంతో పాటు మధ్య ఆసియా, రష్యా, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా, ఐరోపా ఖండంలోని ప్రధాన భాగాలను లక్ష్యంగా చేసుకోగలదు.

 ఐఎన్‌‌‌‌‌‌‌‌ఎస్ అరిధమన్

 అగ్ని-5 ద్వారా ఒకేసారి వేర్వేరు లక్ష్యాలపై దాడిచేసే సాంకేతికతను భారత్ ఇప్పటికే విజయవంతంగా పరీక్షించింది.  అణుదాడికి గురైనా సరే, తిరిగి శత్రువుపై భయంకరమైన ప్రతిదాడి చేయడంలో సముద్ర ఆధారిత 'న్యూక్లియర్ ట్రయాడ్' కీలకమైనది.  భారత్ తన మూడో స్వదేశీ అణు జలాంతర్గామి 'ఐఎన్‌‌‌‌‌‌‌‌ఎస్  అరిధమన్'ను నౌకాదళంలో చేర్చింది. ఇప్పటికే సేవలందిస్తున్న ఐఎన్‌‌‌‌‌‌‌‌ఎస్  అరిహంత్, ఐఎన్‌‌‌‌‌‌‌‌ఎస్ అరిఘాత్‌‌‌‌‌‌‌‌లతోపాటు ఐఎన్‌‌‌‌‌‌‌‌ఎస్ అరిధమన్ చేరికతో భారత్ సముద్ర అణు రక్షణ వ్యవస్థ అత్యంత శక్తిమంతంగా మారింది.  సముద్ర గర్భం నుంచి ప్రయోగించే  కే4  క్షిపణులు కూడా త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. 

ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలున్న దేశాలుగా అమెరికా, రష్యా ముందు వరుసలో ఉన్నాయి. ఈ మేరకు స్టాక్‌‌‌‌‌‌‌‌హోమ్‌‌‌‌‌‌‌‌ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ నివేదికలో వెల్లడించింది.  రష్యా వద్ద 5,420, అమెరికా వద్ద 5,042 అణు వార్‌‌‌‌‌‌‌‌హెడ్లు ఉన్నాయని పేర్కొంది.  ప్రపంచవ్యాప్తంగా అణుశక్తి దేశాలు కలిగిన దేశాలు తొమ్మిది కాగా, వాటి వద్ద మొత్తంగా 12వేలకు పైగా అణ్వాయుధాలు ఉన్నట్లు వెల్లడించింది. 

ఈ జాబితాలో యూకే (225), ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ (370), ఉత్తరకొరియా (60),  ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌ (90), దేశాలున్నాయి. ఈ ఏడాది జనవరి నాటికి భారత్‌‌‌‌‌‌‌‌ వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నాయని, అది పాక్ కంటే ఎక్కువేనని సిప్రి నివేదించింది. ఏడాది వ్యవధిలో భారత్‌‌‌‌‌‌‌‌ 10 వార్‌‌‌‌‌‌‌‌హెడ్లను పెంచుకుందని  నివేదికలో పేర్కొంది. అలాగే, చైనా వద్ద 620 అణ్వాయుధాలు ఉన్నాయని పేర్కొంది.  గతేడాదితో  పోలిస్తే బీజింగ్‌‌‌‌‌‌‌‌ 20 అణు వార్‌‌‌‌‌‌‌‌హెడ్‌‌‌‌‌‌‌‌లను తన ఆయుధాగారంలోకి చేర్చుకుందని తెలిపింది.

 ఇస్కా రాజేష్ బాబు,పొలిటికల్ ఎనలిస్ట్,  
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.