సూర్య కుమార్ నిజమైన మ్యాచ్ విన్నర్

సూర్య కుమార్ నిజమైన మ్యాచ్ విన్నర్

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ కీలక దశకు చేరుకుంది. ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిచిన నేపథ్యంలో చివరి గేమ్‌లో ఎవరు గెలిస్తే ట్రోఫీ వారి సొంతమవుతుంది. నాలుగో టీ20లో గెలిచి ఊపు మీదున్న భారత్ ఎలాగైనా ఈ గేమ్‌లో గెలిచి  ట్రోఫీని ఎగరేసుకుపోవాలని చూస్తోంది. ఈ విషయాన్ని పక్కనబెడితే.. నాలుగో టీ20లో బ్యాటింగ్‌లో సత్తా చూపిన సూర్య కుమార్ యాదవ్‌‌పై సీనియర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సూర్య మైండ్ సెట్ చాలా బాగుందని, ఇంగ్లండ్ పేస్ బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు అద్భుతమంటూ లెజెండ్ వీవీఎస్ లక్ష్మణ్ కొనియాడాడు. సూర్య నిజమైన మ్యాచ్‌‌ విన్నర్‌గా కనిపిస్తున్నాడని, అతడి అమ్ముల పొదిలో చాలా షాట్స్ ఉన్నాయని తెలిపాడు. 

‘అద్భుతం, జోఫ్రా ఆర్చర్‌‌ను సూర్య ఎదుర్కొన్న తీరు సూపర్బ్. అతడి మానసిక ధోరణి వెలకట్టలేనిది. అన్ని విషయాలను అతడు సింపుల్‌‌గా తీసుకుంటాడు. ఒకవేళ విషయాలను మరీ సీరియస్‌‌గా తీసుకుంటే ఇబ్బందులు తప్పవు. అలాంటి టైమ్‌‌లో మీ బలాబలాలను మర్చిపోయే ప్రమాదం ఉంది. ప్రత్యర్థి ఫీల్డింగ్‌‌ను బట్టి సూర్య క్రియేటివ్ షాట్లు ఆడాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌‌లో ఎక్స్‌‌ట్రా కవర్ మీదుగా సూర్య కొట్టిన సిక్స్ నన్ను చాలా ఆకట్టుకుంది’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.