భారత సైన్యానికి మూడో కన్ను జీశాట్‌-7బీ.. 2028లో సొంత శాటిలైట్ ప్రయోగం

భారత సైన్యానికి మూడో కన్ను  జీశాట్‌-7బీ.. 2028లో సొంత శాటిలైట్ ప్రయోగం

 ఇండియన్ ఆర్మీకి సొంత శాటిలైట్ అందుబాటులోకి రానుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం ఇన్నాళ్లుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) పైనే ఆధారపడుతూ వస్తున్న ఆర్మీకి.. ఇక నుంచి సొంత కమ్యూనికేషన్ నెట్ వర్క్ సేవలు అందించనుంది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే శత్రువు కలుగులో దాక్కున్నా గుర్తించే అవకాశం ఉంటుంది. భారత సైనికులకు అనునిత్యం కాచుకుంటూ ఎప్పటికప్పుడు సమాచారం అందించే   నెట్ వర్క్ త్వరలో ప్రారంభం కానుంది. 

భారత సైన్యానికి ప్రత్యేకంగా రూపొందిస్తున్న తొలి కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్‌-7బీ (GSAT-7B)ను 2028  లో అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఈ అత్యాధునిక ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని రక్షణ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. 

తొలుత ఈ ప్రాజెక్టును 2027 నవంబర్‌లో ప్రయోగించాలని భావించినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాదాపు ఆరు నెలలు ఆలస్యంగా, అంటే 2028 జూన్ నాటికి ప్రయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 
 
జీశాట్‌-7బీ  విశేషాలు:

  ప్రస్తుతం భారత వైమానిక దళం (IAF) వాడుతున్న జీశాట్-7ఏ ఉపగ్రహ సేవలపైనే ఆర్మీ ఆధారపడుతోంది. ఈ కొత్త శాటిలైట్ అందుబాటులోకి వస్తే ఇండియన్ ఆర్మీకి పూర్తిగా 
స్వతంత్ర కమ్యూనికేషన్ నెట్‌వర్క్ లభిస్తుంది. 
 
 సుమారు 5 టన్నుల బరువు ఉండే ఈ జియోస్టేషనరీ శాటిలైట్, ఇండియా రూపొందించిన అత్యంత భారీ కమ్యూనికేషన్ శాటిలైట్లలో ఒకటిగా నిలవనుంది.  ఈ ఉపగ్రహంతో మారుమూల సరిహద్దు ప్రాంతాలు, ఎత్తైన పర్వత శ్రేణులు, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ సైనికులకు నిరంతరాయంగా, అత్యంత సురక్షితమైన (ఎన్‌క్రిప్టెడ్) సమాచారాన్ని అందించడానికి ఇది సహాయపడుతుంది. 

 రక్షణ మంత్రిత్వ శాఖ ఈ శాటిలైట్ అభివృద్ధి కోసం ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL)తో సుమారు 3 వేల కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుంది. 
ఈ ఉపగ్రహ ప్రయోగంతో ఇండియన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్ తరహాలోనే  ఇండియన్ ఆర్మీకి స్పెషల్ ఐ కమ్యూనికేషన్ నెట్ వర్క్ అందుబాటులోకి రానుంది.