చెలరేగిన షెఫాలీ, స్మృతి.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై భారత్ గ్రాండ్ విక్టరీ

చెలరేగిన షెఫాలీ, స్మృతి.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై భారత్ గ్రాండ్ విక్టరీ

రాయ్‎పూర్: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత ఉమెన్స్ టీమ్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‎లో షెఫాలీ వర్మ (55),  కెప్టెన్ స్మృతి మందనా (47) చెలరేగడంతో జింబాబ్వే నిర్దేశించిన 103 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8.5 ఓవర్లలోనే చేధించి 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచుల సిరీస్‎ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది. 

రాయ్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. 

జింబాబ్వే బ్యాటర్లలో చిపో ముగేరి-తిరిపానో (34), కెప్టెన్ జోసెఫిన్ ఎన్కోమో (27) ఇద్దరు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్‎కే పరిమితం కావడంతో జింబాబ్వే భారీ స్కోర్ చేయలేకపోయింది. భారత బౌలర్లలో నికీ ప్రసాద్ రెండు వికెట్లు తీయగా.. శ్రీచరణి, నందని శర్మ, దీప్తీ శర్మ, క్రాంతి గౌడ్ తలో వికెట్ సాధించారు. 

103 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్స్ స్మృతి మందనా (47 నాటౌట్), షెఫాలీ వర్మ (55) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి టీ20లో విఫలమైన ఈ ఇద్దరు రెండో మ్యాచులో జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశారు. 

వేగంగా ఆడే క్రమంలో షెఫాలీ గెలుపు ముంగిట ఔట్ అయ్యింది. దీంతో అనుష్క శర్మ (1)తో కలిసి స్మృతి మందనా మిగితా లాంఛనాన్ని పూర్తిచేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చింది. స్మృతి, షెఫాలీ దూకుడుతో 103 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఒక వికెట్ నష్టానికి కేవలం 8.5 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. దీంతో మూడు మ్యాచుల సిరీస్‎లో మరో మ్యాచ్ మిలిగి ఉండగానే స్మృతి సేన సిరీస్ కైవసం చేసుకుంది. 

ఈ సిరీస్ గెలుపుతో టీమిండియా కెప్టెన్‎గా తన ప్రస్థానాన్ని స్మృతి మందనా విజయవంతంగా ప్రారంభించింది. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‎గా హర్మన్ ప్రీత్ కౌర్ స్థానంలో స్మృతి ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కెప్టెన్‎గా తొలి సిరీస్‎లోనే టీమిండియాను విజయపథంలో నడిపించింది స్మృతి.