నాలుగు గోడల జిమ్, హెడ్‌ఫోన్స్ తగిలించుకుని ఒంటరిగా చేసే వర్క్అవుట్స్.. ఈ పాత పద్ధతికి నేటి యువత మెల్లగా గుడ్‌బై చెప్తోంది. వ్యాయామం అంటే కేవలం చెమట కార్చడం మాత్రమే కాదు, అదొక సరికొత్త వేడుక అని నమ్ముతోంది. అందుకే ఇప్పుడు ఫిట్‌నెస్ అనేది జిమ్‌ల పరిమితులను దాటి క్లబ్బులు, మాల్స్, రెస్టారెంట్లు, పూల్‌సైడ్ వేదికల్లోకి అడుగుపెట్టింది.
ఉదయం స్పిన్నింగ్, పైలేట్స్, యోగా, హెచ్‌ఐఐటీ వంటి కఠినమైన వ్యాయామాలు చేయడం, సాయంత్రానికి డీజే మ్యూజిక్, డ్యాన్స్, ఆరోగ్యకరమైన ఆహారంతో కలిసి ‘వర్క్అవుట్ పార్టీలు’ జరుపుకోవడం సరికొత్త లైఫ్‌స్టైల్ ట్రెండ్‌గా మారుతోంది.
సాధారణంగా జిమ్‌లో ఒంటరిగా వర్క్అవుట్ చేయడం వల్ల కొద్దిరోజులకే బోర్ కొట్టే అవకాశం ఉంది. కానీ ఇలాంటి గ్రూప్ వర్కౌట్స్‌లో లభించే కమ్యూనిటీ అనుభూతి యువతను ఎంతగానో ఆకట్టుకుంటోంది. డీజే మ్యూజిక్, లైవ్ సాంగ్స్ ఇచ్చే ఎనర్జీ మధ్య అందరితో కలిసి నవ్వుతూ, మాట్లాడుకుంటూ వ్యాయామం చేస్తున్నప్పుడు శ్రమ అస్సలు తెలియదు. తోటివారి ఉత్సాహాన్ని చూసి మరింత బాగా చేయాలనే మోటివేషన్ ఇక్కడ సహజంగానే లభిస్తుంది.
ఇప్పుడు ఫిట్‌నెస్ అనేది కేవలం బరువు తగ్గడానికో, కండలు పెంచడానికో మాత్రమే పరిమితం కాలేదు. అదొక సామాజిక అనుభవంగా రూపాంతరం చెందింది. ఒత్తిడితో కూడిన ఉరుకులు పరుగుల జీవితంలో యువత కొత్త వ్యక్తులను కలవడానికి, నెట్‌వర్కింగ్ పెంచుకోవడానికి ఇలాంటి వాటిని వేదికలుగా చేసుకుంటోంది. వీకెండ్స్‌లో పబ్‌లకు వెళ్లి ఆరోగ్యం పాడుచేసుకునే కంటే, ఇలా హెల్దీగా ‘వర్క్అవుట్ పార్టీలు’ చేసుకోవడం ఉత్తమమని భావిస్తున్నారు.
వ్యాయామం ముగిశాక సోషల్ మీడియా కోసం గ్రూప్ ఫొటోలు దిగడం, ఆర్గానిక్ జ్యూస్‌లు తాగుతూ ముచ్చటించడం నేటి జనరేషన్‌కు ఒక సామాజిక హోదాగా మారింది. శారీరక శ్రమను సామాజిక ఆనందంతో ముడిపెట్టడమే ఈ సరికొత్త ట్రెండ్ అసలు రహస్యం.
