తొలి రోజే స్వర్ణాల మోత..అథ్లెటిక్స్‌‌‌‌ లో నిషాద్‌‌‌‌, సౌమ్య, రింకుకు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌

తొలి రోజే స్వర్ణాల మోత..అథ్లెటిక్స్‌‌‌‌ లో నిషాద్‌‌‌‌, సౌమ్య, రింకుకు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌
  •     మోనా అగర్వాల్‌‌‌‌ బంగారు గురి
  •     అవని, కోకిల, రాధా, అజిత్‌‌‌‌కు రజతాలు
  •     వరల్డ్ రికార్డు సమం చేసిన శీతల్‌‌‌‌ దేవి

నగోయా: ఆసియా పారా క్రీడల్లో ఇండియాకు అద్భుతమైన ఆరంభం లభించింది. సోమవారం జరిగిన పారా అథ్లెటిక్స్‌‌‌‌లో మనోళ్లు మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యతో కలిపి ఏకంగా ఆరు పతకాలు సాధించారు. మెన్స్‌‌‌‌ లాంగ్‌‌‌‌ జంప్‌‌‌‌ టీ–-47 విభాగంలో నిషాద్‌‌‌‌ కుమార్‌‌‌‌ అద్భుత ప్రదర్శనతో తొలి స్వర్ణాన్ని అందించాడు. తన మూడు, ఐదో ప్రయత్నంలో 7.11 మీటర్ల దూరం దూకి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. ఒమద్‌‌‌‌బెక్‌‌‌‌ (6.99 మీ, ఉజ్బెకిస్తాన్‌‌‌‌), మొహమ్మద్‌‌‌‌ సఫ్రాన్‌‌‌‌ (6.55 మీ, శ్రీలంక) వరుసగా సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ నెగ్గారు. చిన్నతనంలో గడ్డి కోసే యంత్రం తగలడంతో నిషాద్‌‌‌‌  కుడి చేతిని కోల్పోయాడు. విమెన్స్‌‌‌‌ 1500 మీటర్ల టీ12/13 విభాగంలో సౌమ్య అరంగేట్రంలోనే గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌తో మెరిసింది. ఫైనల్లో సౌమ్య 5ని.12.39 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. రాధా వెంకటేశ్‌‌‌‌ (5ని,30.90 సెకన్లు) రెండో స్థానంలో నిలిచి సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సాధించింది. టీ–11 విభాగంలో పోటీపడిన రవన్ని వలసనైని బ్రాంజ్‌‌‌‌ను గెలుచుకుంది. మెన్స్‌‌‌‌ జావెలిన్‌‌‌‌ త్రో ఎఫ్‌‌‌‌–-46 విభాగంలో రింకు ఈటెను 65.11 మీటర్ల దూరం విసిరి స్వర్ణం నెగ్గాడు. అజిత్‌‌‌‌ సింగ్‌‌‌‌ (65.02 మీటర్లు) రజతం సాధించాడు.

ప్రపంచ రికార్డు సమం చేసిన శీతల్ 

ఆసియా పారా క్రీడల ఆర్చరీ విభాగంలో ఇండియా సంచలనం శీతల్ దేవి రికార్డుల మోత మోగించింది.  విమెన్స్‌‌‌‌ కాంపౌండ్ క్వాలిఫికేషన్ రౌండ్‌‌‌‌లో వరల్డ్‌‌‌‌ రికార్డును సమం చేసిన శీతల్, మిక్స్‌‌‌‌డ్ టీమ్ ఈవెంట్‌‌‌‌లో తోమన్ కుమార్‌‌‌‌తో కలిసి మరో కొత్త  ప్రపంచ రికార్డు సృష్టించింది. చేతులు లేకపోయినా కాళ్లతో విల్లును సంధించి, భుజం, దవడ సాయంతో బాణాన్ని వదిలే అద్భుత ప్రతిభావంతురాలైన శీతల్‌‌‌‌.. విమెన్స్‌‌‌‌ కాంపౌండ్ ర్యాంకింగ్‌‌‌‌ రౌండ్‌‌‌‌లో మొత్తం 720కి గాను 704 పాయింట్లు సాధించి వరల్డ్‌‌‌‌ రికార్డును సమం చేసింది. ఇదే క్రమంలో కొత్త ఆసియా రికార్డును నమోదు చేసింది. టర్కీకి చెందిన ఓజ్నూర్ గిర్డి 2024  పారిస్ పారాలింపిక్స్‌‌‌‌లో సాధించిన 704 పాయింట్లు నమోదు చేశాడు. మొత్తం 72 బాణాల్లో ఆమె 57 సార్లు పర్ఫెక్ట్ 10 కొట్టడం విశేషం. 

మెన్స్‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌లో 698 పాయింట్లు సాధించిన తోమన్‌‌‌‌ కుమార్‌‌‌‌తో కలిసి బరిలోకి దిగిన శీతల్‌‌‌‌.. మిక్స్‌‌‌‌డ్ టీమ్ ర్యాంకింగ్‌‌‌‌ రౌండ్‌‌‌‌లో 1402 పాయింట్లు సాధించి పాత ప్రపంచ రికార్డును (1,400) బద్దలు కొట్టింది.  అంతకుముందు ఈ రికార్డు కూడా శీతల్, రాకేష్ కుమార్  జోడీ పేరిటే ఉండేది. ఈ విజయంతో శీతల్–-తోమన్ జోడీ నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌‌‌‌కు దూసుకెళ్లింది. విమెన్స్‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌లో పాయల్‌‌‌‌ నాగ్‌‌‌‌ 675 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా, టీమ్‌‌‌‌ విభాగంలో ఇండియా 1379 పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ను సాధించింది. మెన్స్‌‌‌‌ రికర్వ్‌‌‌‌ వ్యక్తిగత ర్యాంకింగ్‌‌‌‌ రౌండ్‌‌‌‌లో పారాలింపిక్ స్వర్ణ పతక విజేత హర్విందర్ సింగ్ 631 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా, విజయ్ సుండి 630 పాయింట్లతో ఏడో స్థానం దక్కించుకున్నాడు. వీరిద్దరి ప్రదర్శనతో  రికర్వ్ టీమ్ ర్యాంకింగ్స్‌‌‌‌లో ఇండియా 1261 పాయింట్లతో అగ్రస్థానంలో  నిలిచింది. 

ఒలింపిక్‌‌‌‌ కోటాతో సిల్వర్‌‌‌‌
విమెన్స్‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌‌‌ రైఫిల్‌‌‌‌ (ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌-1) విభాగంలో మోనా అగర్వాల్‌‌‌‌, అవని లేఖర స్వర్ణం, రజతంతో మెరిశారు. ఫైనల్లో మోనా 250.0 పాయింట్లతో ఆసియా రికార్డును నెలకొల్పి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచింది. డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ అవని 249.6 పాయింట్లతో రెండో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టుకుంది. కొరియా షూటర్‌‌‌‌ యున్రి లీ (227.9) బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సొంతం చేసుకుంది. అవని పతకంతో పాటు 2028 లాస్‌‌‌‌ ఏంజిల్స్‌‌‌‌ పారాలింపిక్స్‌‌‌‌ బెర్త్‌‌‌‌ను కూడా సాధించింది. గత నెలలో సౌత్‌‌‌‌ కొరియాలో జరిగిన వరల్డ్ పారా షూటింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో రజతం గెలవడం ద్వారా మోనా తొలి కోటాను దక్కించుకుంది. క్వాలిఫికేషన్‌‌‌‌లో మోనా (629.1), అవని (626.4) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. నడుం కింద భాగం సరిగా పని చేయని అథ్లెట్లు ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌-1 కేటగిరీలో పోటీపడతారు.

సిల్వర్‌‌‌‌ కోకిల
జూడోలోనూ మనోళ్లు మెరిశారు. విమెన్స్‌‌‌‌ జే2–52 కేజీల ఫైనల్లో కోకిల.. ఐబైక్‌‌‌‌ ఉలాన్‌‌‌‌బెక్‌‌‌‌ (కిర్గిస్తాన్‌‌‌‌) చేతిలో ఓడి సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌తో సంతృప్తి పడింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో కోకిలను 21 సెకన్ల పాటు పిన్‌‌‌‌ చేసి ఉలాన్‌‌‌‌బెక్‌‌‌‌ స్వర్ణాన్ని ఎగరేసుకుపోయింది. మెన్స్‌‌‌‌ జే1–70 విభాగంలో కపిల్ పర్మార్‌‌‌‌ కాంస్యం నెగ్గాడు. ఈ పోరులో కపిల్‌‌‌‌ 1–0తో అన్హాఫ్‌‌‌‌ రఫ్లి షిద్కీ (ఇండోనేసియా)పై గెలిచాడు. దృష్టి లోపం ఉన్న అథ్లెట్ల జూడో పోటీలు జె1, జె2 క్లాసిఫికేషన్ల కింద నిర్వహిస్తారు. స్విమ్మింగ్‌‌‌‌లోనూ ఇండియాకు సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ లభించింది. మెన్స్‌‌‌‌ 100 మీటర్ల ఫ్రీస్టయిల్ ఎస్‌‌‌‌–13 ఈవెంట్‌‌‌‌లో రవి కార్తీక్‌‌‌‌ బుడిగినా 56.68 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో ప్లేస్‌‌‌‌తో సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ను ఒడిసి పట్టుకున్నాడు.  మరోవైపు టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌, బ్యాడ్మింటన్‌‌‌‌లో ఇండియాకు పతకాలు ఖాయమయ్యాయి.