న్యూఢిల్లీ: భారత మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హిమాన్షు భావు, నీరజ్ ఫరీద్‌పురియాలను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) ఇచ్చిన పక్కా సమాచారంతో ఈ నెల 22న లాస్ వెగాస్‌లో వీరిద్దరిని యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ(ఐసీఈ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన హిమాన్షు భావు అసలు పేరు హిమాన్షు రితోలియా.
‘హిమాన్షు సిగ్రోహా’ పేరిట నకిలీ పాస్‌పోర్ట్ పొందాడు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి ఇతను ప్రత్యర్థి. ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో మర్డర్, కిడ్నాప్, దోపిడీ, అక్రమ ఆయుధాల రవాణా వంటి 18 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2020లో బాలల సంరక్షణ కేంద్రం నుంచి తప్పించుకొని విదేశాలకు పారిపోయాడు. అక్కడి నుంచే ఢిల్లీ - ఎన్‌సీఆర్, హర్యానా, పంజాబ్‌లలో వందల మంది అనుచరులతో ఓ క్రిమినల్ నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నాడు. ఈక్రమంలో ఇతనిపై ఇంటర్‌పోల్ అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.
అనేక హై-ప్రొఫైల్ కేసులతో లింక్
ఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఇటీవల జరిగిన హత్యలు, అనేక హై ప్రొఫైల్ కాల్పుల కేసుల్లో హిమాన్షు గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సెప్టెంబర్‌లో సౌత్ ఢిల్లీలో జిమ్‌ట్రైనర్ విజయ్ కుమార్ మర్డర్, అలాగే ఈ ఏడాది డెయిరీ బిజినెస్మెన్ రతన్ లోహియా హత్య కేసులోనూ ఈ గ్యాంగ్ హస్తంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇక హర్యానాలోని పాల్వాల్ జిల్లాకు చెందిన నీరజ్ ఫరీద్‌పురియాపై 25కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2012లో ఎన్‌కౌంటర్ తర్వాత అరెస్టయిన ఇతనికి 2015లో కోర్టు జీవితఖైదు విధించింది. 2019లో పంజాబ్, హర్యానా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చి కెనడాకు పారిపోయాడు. అక్కడ ‘బాంబిహా గ్యాంగ్’లో చేరిన నీరజ్.. ఆ తర్వాత అమెరికాకు మకాం మార్చి హిమాన్షు గ్యాంగ్‌తో కలిసి పనిచేస్తున్నాడు.
