ఇంటర్‌‌ స్టూడెంట్లకు ‘ఇన్నోవేట్‌‌ తెలంగాణ’ హ్యాకథాన్‌‌.. కోడ్‌‌మిత్రతో కలిసి 15 రోజుల రాష్ట్రస్థాయి పోటీలు

ఇంటర్‌‌ స్టూడెంట్లకు ‘ఇన్నోవేట్‌‌ తెలంగాణ’ హ్యాకథాన్‌‌.. కోడ్‌‌మిత్రతో కలిసి 15 రోజుల రాష్ట్రస్థాయి పోటీలు
  • ఇంటర్‌‌ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
  • ఈ నెల 12 నుంచి 17 వరకు రిజిస్ట్రేషన్లు.. టాప్‌‌-3 ప్రాజెక్టులకు అవార్డులు, నగదు ప్రోత్సాహకాలు 

హైదరాబాద్, వెలుగు: ఇంటర్‌‌ విద్యార్థుల్లో ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ (ఏఐ), డిజిటల్‌‌ నైపుణ్యాలు, సమస్యల పరిష్కార సామర్థ్యాన్ని పెంచేందుకు ఇంటర్‌‌ విద్యాశాఖ ‘ఇన్నోవేట్‌‌ తెలంగాణ’ పేరుతో 15 రోజుల రాష్ట్రస్థాయి హ్యాకథాన్‌‌ నిర్వహిస్తోంది. కోడ్‌‌మిత్ర ఫ్యూచర్‌‌ స్కిల్స్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌తో కలిసి చేపడుతున్న ఈ పోటీల్లో జనరల్‌‌, ఒకేషనల్‌‌ విభాగాల ఇంటర్‌‌ విద్యార్థులంతా పాల్గొనవచ్చని ఇంటర్‌‌ విద్యాశాఖ డైరెక్టర్‌‌ అభిలాష అభినవ్‌‌ తెలిపారు. 

ప్రభుత్వ జూనియర్‌‌ కాలేజీల్లో విద్యార్థులకు మార్గదర్శనం చేసేందుకు ఒక్కో కాలేజీ నుంచి ఒక జూనియర్‌‌ లెక్చరర్‌‌ను నోడల్‌‌ ఆఫీసర్‌‌గా నియమించాలని ప్రిన్సిపాళ్లను ఆమె ఆదేశించారు. విద్యార్థులు ముందుగా కోడ్‌‌మిత్ర పోర్టల్‌‌లో రిజిస్టర్‌‌ చేసుకుని ప్రత్యేక కోర్సు పూర్తి చేయాలి. ఆ తర్వాత సమాజంలోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఏఐ ఆధారిత కాన్సెప్ట్‌‌లు లేదా ప్రోటోటైప్‌‌లను రూపొందించి సమర్పించాలి. 

ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ.. విద్య-అభ్యసనం, ఆరోగ్యం-సంక్షేమం, పర్యావరణం-సుస్థిరత, స్మార్ట్‌‌ కమ్యూనిటీలు, వ్యవసాయం-గ్రామీణ ఆవిష్కరణలు, సామాజిక హితం, దివ్యాంగుల సాధికారత, ఫ్యూచర్‌‌ ఇన్నోవేషన్స్‌‌ వంటి 8 రంగాల్లో విద్యార్థులు ప్రాజెక్టులు రూపొందించాలన్నారు.

12 నుంచి రిజిస్ట్రేషన్లు

ఈ నెల 12 నుంచి 17న సాయంత్రం 5 గంటల వరకు telangana.codemitra.orgలో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఈనెల 17 నుంచి 22లోపు కోర్సు పూర్తి చేసి ప్రాజెక్ట్‌‌ రిపోర్ట్‌‌ లేదా డెమో లింక్‌‌ సమర్పించాలి.  23, 24న ప్రాథమిక పరిశీలన, 26న నిపుణుల కమిటీతో మూల్యాంకనం ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు 27, 28 తేదీల్లో కార్పొరేట్‌‌ కంపెనీల సందర్శన, టెక్‌‌ లీడర్లతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రాజెక్టులు సమర్పించిన వారందరికీ సర్టిఫికెట్లు ఇవ్వడంతో పాటు రాష్ట్రస్థాయిలో టాప్‌‌-3 ప్రాజెక్టులకు అవార్డులు, నగదు ప్రోత్సాహకాలు అందజేస్తారు.