నేవీలోకి ‘ఐఎన్ఎస్ సమర్థక్‌‌‌‌‌‌‌‌’ షిప్.. డ్రోన్లకు మదర్‌‌‌‌‌‌‌‌షిప్.. విపత్తుల్లో ఆపద్బాంధవం

నేవీలోకి ‘ఐఎన్ఎస్ సమర్థక్‌‌‌‌‌‌‌‌’ షిప్.. డ్రోన్లకు మదర్‌‌‌‌‌‌‌‌షిప్.. విపత్తుల్లో ఆపద్బాంధవం

న్యూఢిల్లీ: ఇండియన్ నేవీలోకి కొత్త పవర్​ ఎంట్రీ ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ బహుళ ప్రయోజన నౌక అయిన 'ఐఎన్ఎస్ సమర్థక్' కర్నాటకలోని కార్వార్ నౌకాదళ కేంద్రంలోకి చేరింది. ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్  శుక్రవారం ఈ నౌకను లాంఛనంగా ప్రారంభించారు. 

భారత నౌకాదళం కోసం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) సంస్థ నిర్మించిన ఈ నౌకలో 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన రక్షణ పరికరాలు, ఆయుధాలు, సెన్సార్లను పరీక్షించడానికి ‘సమర్థక్‌‌‌‌‌‌‌‌’ ఎంతగానో ఉపయోగపడుతుంది.

 కర్నాటకలోని ఐఎన్ఎస్ కదంబ నావల్ బేలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, కర్నాటక గవర్నర్, పలువురు సీనియర్ రక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేకతలివే..

భారత నౌకాదళం కోసం ఒక ప్రైవేట్ షిప్‌‌‌‌‌‌‌‌యార్డ్ ద్వారా నిర్మించి, ప్రారంభించిన మొట్టమొదటి అతిపెద్ద యుద్ధనౌక ఇదే. సముద్రంలో గస్తీ నిర్వహించడం, స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న కొత్త ఆయుధాలు, సెన్సర్లను పరీక్షించడం, డ్రోన్లు లేదా మానవరహిత స్వయంప్రతిపత్త వ్యవస్థలకు మదర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించడం వంటి వివిధ విధులను నిర్వర్తిస్తుంది. విపత్తుల సమయంలో సహాయక చర్యలు అందించడం, అపాయంలో ఉన్న నౌకలను ఆదుకోవడం, అవసరమైతే చిన్నపాటి ఆస్పత్రి నౌకలా పనిచేస్తుంది.