టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ లో అంతర్గత పోరు మరోసారి బయటపడింది. యూనియన్ అధిపత్యం, అధికారిక గుర్తింపు, నిధుల నిర్వహణ వంటి అంశాలల్లో వివాదం తారాస్థాయికి చేరింది. రఘు మాస్టర్, సుమలత దేవి మధ్య వర్గ పోరు హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు చేరింది. పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులతో సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి సుమలతను తప్పించారు. ఆమె స్థానంలో రఘు మాస్టర్ ను ప్రెసిడెంట్ గా కార్యవర్గం ఎన్నుకుంది. అయితే రఘు మాస్టర్ అధ్వర్యంలోని కమిటీకి చట్టబద్ధమైన అధికారం లేదని సుమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూనియన్ కు చెందిన బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన సొసైటీ అకౌంట్ ను హ్యాకింగ్ చేశారంటూ పేర్కొంది. అసోషియేషన్ నిధులను చట్టవిరుద్ధంగా నిధులను డ్రా చేసేందుకు కుట్ర చేస్తున్నారని రఘు మాస్టర్ ప్యానల్ పై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టాలని సుమలత పోలీసులను కోరారు.
దీంతో రాయదుర్గం పోలీసలు రఘు మాస్టర్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించిన వివరణ కోరారు. సుమలత ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ మేరకు ఆయన కూడా రాయదుర్గం పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులను తప్పుదోవ పట్టించేలా తమపై తప్పుడు ఫిర్యాదు చేశారని రఘు ఆరోపించారు. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అనుబంధ ఫెడరేషన్ ఆమోదం,.. పూర్తి అధికారిక గుర్తింపు తమ కమిటీకే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఫెడరేషన్ జారీ చేసిన అధికారిక అనుమతి పత్రాల మేరకే బ్యాంకును సంప్రదించామని చెప్పారు.
తాము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యామని .. సుమలత తన స్వార్థప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారాలతో యూనియన్ ప్రతిష్ట బజారుకీడుస్తున్నారని మండిపడ్డారు. బ్యాంకు లావాదేవిలకు సంబంధించి తనకు ఉన్న సిగ్నేచర్ అథారిటీ పోతుందని బాధ, ఓర్వలేనితనంతో తమపై హ్యాకింగ్ ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై పోలీసులు ఎలాంటి FIR నమోదు చేయలేదని కేవలం ఆమె ఇచ్చిన ఫిర్యాదు పై వివరణ అడిగారని రఘు మాస్టర్ తెలిపారు. సైబర్ పోలీసులు కూడా ఇది ఇంటర్నల్ వివాదం అని స్పష్టం చేశారని చెప్పారు. నిజనిజాలు తేలేవరకు అవసరమైతే బ్యాంకు అకౌంట్ ను ఫీజ్ చేయాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.
యూనియన్ లో వర్గపోరుకు కేంద్రంగా మారిన బ్యాంకు పత్రాలు, సమర్పించిన అధికారిక లేఖలు, డ్యాన్సర్స్ అసోసియేషన్ రాజ్యాంగ నిబంధనలు , ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణాలకు అనుగుణంగా పోలీసులు ఈ కేసును పరిశీలిస్తున్నారు. మరోవైపు సంఘంలో కుమ్ములాటలపై డ్యాన్సర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న సమస్యలపై దృష్టిపెట్టకుండా.. అధిపత్యపోరు ఏంటని ప్రశ్నిస్తున్నారు. సినీ పెద్దలైనా జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.
