ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం, అవగాహన ఒప్పందం ఇక ముగిసిపోయాయని ట్రంప్ తేల్చి చెప్పేశారు. ఇరాన్ నుంచి వచ్చే ఏ దాడికైనా అమెరికా గట్టిగా సమాధానం ఇస్తుందని హెచ్చరించారు. ఈ ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి.
టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా శక్తివంతమైన దాడులు చేసిందని తెలిపారు. వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు తీసుకున్నామన్నారు. ఇరాన్‌ను అణ్వాయుధాల నుంచి దూరంగా ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.
ఇరాన్ నేతలు అబద్దాలకోరులని, మాటమీద నిలబడరంటూ ట్రంప్ ఫైర్ అయ్యారు. చీటర్స్, సిక్ పీపుల్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్మూజ్ జలసంధిలో మూడు ట్యాంకర్లపై ఇరాన్ దాడితో అమెరికా తిరిగి దాడులు స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు 80 లక్ష్యాలపై యూఎస్ బాంబుల వర్షం కురిపించగా.. తగ్గేదే లే అన్నట్లుగా బహ్రెయిన్, కువైట్ లోని అమెరికా ఆర్మీ స్థావాలపై దాడులు స్టార్ట్ చేసి ఇరాన్. ఇదే క్రమంలో ఇరాన్ ఆయిల్ అమ్ముకునేందుకు గతంలో ఇచ్చిన వెసులుబాటును వెనక్కి తీసుకుంటూ ఆంక్షల ఉక్కుపాదం కిందకు తీసుకొచ్చింది ట్రంప్ సర్కార్.
ALSO READ : ట్రంప్ ఒక్క మాటతో భారత మార్కెట్లలో కలకలం..
అమెరికా తాజా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ జాతీయ భద్రతను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అమెరికానే ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. భవిష్యత్తులో పరిణామాలకు అమెరికానే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఈ పరిణామాల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై వెంటనే కనిపించింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలతో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 5 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు 78 డాలర్ల స్థాయికి చేరుకుంది. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో ప్రపంచ మార్కెట్లలో ఆందోళన పెరిగి, భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నిమిషాల్లోనే కుప్పకూలాయి. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.
ఇదే సమయంలో నాటోపై కూడా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ విషయంలో నాటో దేశాలు అమెరికాకు అవసరమైన సపోర్ట్ ఇవ్వలేదని విమర్శించారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికా-ఇరాన్ సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలకు తెరతీశాయి. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు చమురు ధరలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, మార్కెట్లపై ఎంత ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
