- ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యంపై సీనియర్ దౌత్యవేత్త అబ్దుల్ మజిద్ హకీమ్ ఇలాహి
- తండ్రి అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారని వెల్లడి
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ఆ దేశ సీనియర్ దౌత్యవేత్త అబ్దుల్ మజిద్ హకీమ్ఇలాహి స్పష్టతనిచ్చారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, భద్రతా కారణాల దృష్ట్యా బయటికి రావడం లేదని తెలిపారు.
మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను ఖండించారు. 'ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు, తన బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు. గత వారమే దేశాధ్యక్షుడితో 7 గంటల పాటు సమావేశమయ్యారు. పార్లమెంట్ స్పీకర్ సహా పలువురు ప్రముఖులు కూడా ఆయనను కలిశారు' అని వెల్లడించారు. తన తండ్రి అంత్యక్రియలకు మొజ్తబా హాజరుకాలేదన్న వార్తలను తోసిపుచ్చారు. కొత్తగా బాధ్యతలు చేపట్టడం, భద్రతా కారణాల వల్ల ఆయన మీడియా ముందుకు రాలేదని, కానీ అంత్యక్రియల్లో పాల్గొన్నారని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, కొన్ని రాత్రుల్లో ఆయన రహస్యంగా వీధుల్లోకి వచ్చి ప్రజల నిరసనల్లోనూ పాలుపంచుకున్నారని వెల్లడించారు. ఇరాన్ను అసలు ఎవరు నడిపిస్తున్నారో ఎవరికీ స్పష్టత లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి.. తమ దేశం నిర్ణయాలు తీసుకునే విధానం ఏమిటో, తమ ప్రతినిధులు ఎవరో అమెరికా అధికారులకు బాగా తెలుసని పేర్కొన్నారు.
తమపై చేపట్టిన యుద్ధంలో నిర్దేశించుకున్న ఏ ఒక్క లక్ష్యాన్ని కూడా అమెరికా సాధించలేక పోయిందని ఎగతాళి చేశారు. ఉదయం 8 గంటలకు ఒక ప్రకటన.. 8:30కి మరొకటి, 9:00 గంటలకు ఇంకొకటి, సాయంత్రం ఒకటి, రాత్రి 2:00 గంటలకు మరొకటి ఇలా ఆయన మార్చి మార్చి ప్రకటనలు చేయడం తప్ప సాధించింది ఏమీ లేదన్నారు. ఫిబ్రవరి 28న తమ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడిచేసి అమాయక ప్రజలను చంపడం తప్ప మరేమీ చేయలేక పోయాయని మండిపడ్డారు.
