సనాతన ధర్మం వద్దు అనుకుంటే తల్లిదండ్రులను వదిలేస్తారా?.. ఉదయనిధి స్టాలిన్ కు అర్జున్ సవాల్!

సనాతన ధర్మం వద్దు అనుకుంటే తల్లిదండ్రులను వదిలేస్తారా?.. ఉదయనిధి స్టాలిన్ కు అర్జున్ సవాల్!

తమిళనాడు రాజకీయాల్లో 'సనాతన ధర్మం' చుట్టూ రేగిన చిచ్చు ఇప్పుడు కోలీవుడ్‌ను కూడా కుదిపేస్తోంది. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా లేటెస్ట్ గా ఈ అంశంపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇటు సినిమా రంగంలో, అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నెట్టింట అర్జున్ వీడియో వైరల్ అవుతోంది.

సనాతన ధర్మం అంటే మతం కాదు..

నాకు తెలిసినంతవరకు సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు, అదొక జీవన విధానం అని చెప్పుకొచ్చారు అర్జున్.  సమాజంలో ఎలా నడుచుకోవాలి, నిజాయితీగా ఎలా బతకాలి, అసూయపడకుండా ఎలా ఉండాలనే విషయాలను అది నేర్పుతుంది. ముఖ్యంగా, మనల్ని పెంచిన తల్లిదండ్రులను.. మనం మన పిల్లల్ని చూసుకున్నట్లే కంటికి రెప్పలా కాపాడుకోవాలని సనాతన ధర్మం చెబుతోంది అని పేర్కొన్నారు. 

అంతటితో ఆగకుండా, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వారికి అర్జున్ ఒక సూటి సవాల్ విసిరారు. సనాతన ధర్మమే వద్దు అనుకునేవారు, మొదట తమ తల్లిదండ్రులను దూరం పెట్టేయాలి.. అది సాధ్యమేనా? ఈ సమాజం అలాంటి విలువల లేకుండా ముందుకు సాగగలదా? దీనిని కేవలం మతంగా చూడటం ఆపేసి, ఇది ఒక జీవన విధానంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే చాలా మంచిదని కోరారు. ఇటీవల తాను హీరోగా నటించిన 'బ్లాస్ట్ జోన్ 'మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా అర్జున ఈ వ్యాఖ్యలు చేశారు.

మళ్లీ మొదలైన ఉదయనిధి స్టాలిన్ రచ్చ..

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన సభలో డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో సనాతనాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చి దేశవ్యాప్త ఆగ్రహానికి గురైన ఆయన.. ఈసారి అసెంబ్లీ వేదికగా మనుషులను విభజించే సనాతనాన్ని పూర్తిగా నిర్మూలించాలి అంటూ పాత వివాదాన్ని మళ్లీ రేపారు.

సీఎం విజయ్ మౌనం.. అర్జున్ ఎంట్రీ..

ట్విస్ట్ ఏంటంటే.. అసెంబ్లీలో ఉదయనిధి ఇంత పెద్ద ప్రకటన చేస్తున్నా, అక్కడే ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మాత్రం దీనిపై ఎలాంటి స్పందన లేకుండా పూర్తి మౌనం వహించారు. సీఎం సైలెంట్‌గా ఉన్న ఈ తరుణంలో, యాక్షన్ కింగ్ అర్జున్ ధైర్యంగా ముందుకొచ్చి సనాతన ధర్మానికి మద్దతుగా నిలవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ రాజకీయ వర్సెస్ సినీ స్టార్స్ ల లడాయి మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి..