సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌ 'మరీచిక' మూవీ రివ్యూ.. అనుపమ, రెజీనా మెప్పించారా?.. లాజిక్ మిస్సైందా?

 సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌ 'మరీచిక' మూవీ రివ్యూ.. అనుపమ, రెజీనా మెప్పించారా?.. లాజిక్ మిస్సైందా?

టాలీవుడ్ ముద్దుగుమ్మలు అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా, నటుడు విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో  నటించిన సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ 'మరీచిక'. ఈరోజే ( మే 29, 2026 )  థియేటర్లలోకి వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో కనిపించే పాత్రలు, జరిగే సంఘటనలు అన్నీ ప్రేక్షకుడిని భ్రమల్లో ముంచెత్తుతాయి.  మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది..  కథలో మ్యాటర్ ఉందా లేదా? చూసేద్దాం!

అసలు కథేంటంటే?

సంజు (విరాజ్ అశ్విన్) ఓ స్టైలిష్ కెఫే రన్ చేస్తుంటాడు. మనోడిని చూసి లోలోపలే పీకల్లోతు ప్రేమలో మునిగిపోతుంది కాలేజ్ స్టూడెంట్ వెంకటలక్ష్మి (అనుపమ). కానీ, ఆ ప్రేమను బయటపెట్టడానికి తెగ సతమతమవుతుంది. ఈ గ్యాప్‌లో లండన్ నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ బ్యూటీ మరీచిక (రెజీనా)తో వెంకటలక్ష్మికి ఫ్రెండ్‌షిప్ అవుతుంది. లక్ష్మి ద్వారానే సంజు, మరీచికల పరిచయం కాస్తా పెళ్ళి దాకా వెళ్తుంది. అంతా హ్యాపీ అనుకునేలోపే.. ఊహించని ట్విస్ట్! సంజును మరీచిక దారుణంగా హత్య చేస్తుంది. కళ్లెదుటే జరిగిన ఈ మర్డర్ చూసి షాకైన లక్ష్మి పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీస్తుంది. అసలు మరీచిక ఎవరు? ప్రాణంగా ప్రేమించిన సంజును ఎందుకు చంపేసింది? ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి? అనేది తెరపైనే చూడాలి.

స్క్రీన్ ప్లే ఎలా ఉందంటే?

పేరుకు తగ్గట్టే ఎండమావుల లాంటి భ్రమలు, ఊహించని మలుపులతో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఐడియా పరంగా మహేష్ బాబు 'వన్: నేనొక్కడినే' వైబ్స్ గుర్తుకు తెస్తుంది. డైరెక్టర్ సతీష్ కాసెట్టి ఎంచుకున్న థాట్ బాగున్నా, కథనం  లోనే అసలు ట్విస్ట్ పడింది. ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా, కాస్త పేషెన్స్‌ను టెస్ట్ చేసేలా సాగుతుంది. లవ్ స్టోరీలో ఉండాల్సిన కెమిస్ట్రీ గానీ, ఎమోషన్ గానీ సరిగ్గా పండలేదు. అయితే, ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సినిమా అసలైన ట్రాక్ ఎక్కుతుంది. సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ లో అజయ్ ఘోష్, రెజీనా, అనుపమల మధ్య వచ్చే కన్ఫ్యూజన్ డ్రామా కాస్త నవ్విస్తూ, ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. కానీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరీ సిల్లీగా అనిపిస్తాయి. పోలీసులు కనీసం ఆరా తీయకుండా, ఎవరో చెప్పిన కథను నమ్మేయడం చూస్తే లాజిక్ ల్యాంప్‌పోస్ట్ ఎక్కినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ తర్వాత మరో పది నిమిషాల సాగతీత సినిమా గ్రాఫ్‌ను తగ్గించేసింది.

ఎవరెలా చేశారంటే?

అమాయకమైన వెంకటలక్ష్మి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ సూపర్బ్‌గా చేసింది. ఆమె లుక్‌లో, క్యారెక్టర్‌లో రెండు వేర్వేరు షేడ్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. ఇక రెజీనా కసాండ్రా ఎన్‌ఆర్‌ఐగా ఫస్టాఫ్‌లో గ్లామరస్‌గా కనిపిస్తూనే, సెకండాఫ్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో మెప్పించింది. విరాజ్ అశ్విన్ లవర్ బాయ్‌గా చాలా దర్జాగా, డ్యాపర్‌గా కనిపించి తన పాత్రకు న్యాయం చేశాడు. అజయ్ ఘోష్ క్లైమాక్స్ లో తన మార్క్ కన్ఫ్యూజన్ కామెడీతో కాసేపు రిలీఫ్ ఇచ్చాడు. టెక్నికల్‌గా ఇళయరాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్‌ని బాగా లేపింది. అరవింద్ కన్నబిరన్ సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. లక్ష్మీ భూపాల అందించిన కథలో దమ్మున్నా, ఎడిటింగ్ లోపాలు, కథనంలో పాత పద్ధతులు సినిమాకు మైనస్ అయ్యాయి.

ప్లస్ , మైనస్ ఇవే.. 
ఈ సినిమాలో ఊహించని ట్విస్టులు, సెకండాఫ్‌లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్  మెప్పించాయి. ఇక స్లోగా సాగే ఫస్టాఫ్ పై ప్రేక్షకులను కాస్త నిరాశపరిచింది.  అంతే కాకుండా లాజిక్ లేని పోలీస్ ఇన్వెస్టిగేషన్,  సాగతీత సీన్లు కాస్త సినీ ప్రియులను చిరాకు తెప్పించాయి. మొత్తానికి 'మరీచిక'... ఐడియా క్రేజీగానే ఉంది కానీ, స్క్రీన్ ప్లే లోనే కిక్ మిస్సయింది బాసూ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీకెండ్ రావడంతో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి..