కాంగ్రెస్ ఓటమికి సర్ కారణమా?  రాహుల్‌‌‌‌‌‌‌‌కు  కేంద్రహోంమంత్రి అమిత్ షా  ప్రశ్న

కాంగ్రెస్ ఓటమికి సర్ కారణమా?  రాహుల్‌‌‌‌‌‌‌‌కు  కేంద్రహోంమంత్రి అమిత్ షా  ప్రశ్న
  • 2029లోనూ ఆ పార్టీకి ఘోర ఓటమి తప్పదు
  • చొరబాటుదారులకు రక్షణ కల్పిస్తున్నరు
  • బ్యాలెట్​తో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీదే గెలుపు
  • గుజరాత్ స్థానిక ఎన్నికల్లో 104లో 90 సీట్లు బీజేపీవే
  • 41 ఏండ్లుగా గుజరాత్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ గెలవనే లేదని వ్యాఖ్య 


న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్ఐఆర్ కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతోందా..? అని ప్రశ్నించారు.  ఎస్ఐఆర్ 2024 తర్వాతే అమల్లోకి వచ్చిందని, కానీ రాహుల్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోతూ వస్తోందని ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే భారీ మెజారిటీ సాధిస్తుందని, కాంగ్రెస్ వరుసగా నాలుగోసారి ఓటమి చవిచూడబోతోందని అన్నారు. ఘోర పరాజయానికి రాహుల్, ఆయన సహచరులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఎస్ఐఆర్ ముసుగులో చొరబాటుదారులను కాపాడే రాహుల్ వ్యూహాన్ని దేశ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారని, ఇకపై ఆయన మాయలో పడబోరని వ్యాఖ్యానించారు. దుష్ప్రచారం ఎంత జరిగినా త్రిపుర, రాజస్థాన్, గుజరాత్, బెంగాల్, అస్సాం ప్రజలు మోదీ, బీజేపీ, ఎన్డీయేకు పట్టం కట్టారని షా చెప్పారు.  త్రిపురలో 33 ఏళ్లుగా, బెంగాల్‌‌లో 54 ఏళ్లుగా కాంగ్రెస్ గెలవలేదని అమిత్ షా గుర్తు చేశారు. బెంగాల్, త్రిపుర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మూడు, నాలుగు, ఐదు దశాబ్దాలుగా ఆ పార్టీ ఓడిపోతూనే ఉందని, ఇది ఎస్ఐఆర్ ఫలితమేనా? అని రాహుల్‌‌ను సూటిగా ప్రశ్నించారు.  

స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీ హవా

రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ 90% మున్సిపల్ కార్పొరేషన్లు, 66% మున్సిపల్ కౌన్సిళ్లు, 65% మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని షా తెలిపారు. అక్కడ 85 శాతానికి పైగా వార్డుల్లో ఆప్ డిపాజిట్లు కోల్పోయిందన్నారు. త్రిపుర గ్రామ కమిటీ ఎన్నికల్లో 4,600 సీట్లకు గాను ఎన్డీయే సుమారు 4 వేల సీట్లు, 77.5% ఓట్లు సాధించగా, కాంగ్రెస్ కేవలం 14 సీట్లకే పరిమితమైందని చెప్పారు. గుజరాత్‌‌లో మంగళవారం ఫలితాలు వెలువడిన రెండు మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్‌‌లో మొత్తం 104 సీట్లకు గాను 90 సీట్లను బీజేపీ గెలుచుకుందని షా వెల్లడించారు. తన నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌‌లో 44 సీట్లకు 38 బీజేపీ ఖాతాలో పడ్డాయని, గతంతో పోలిస్తే ఓట్ల శాతం 10 శాతం పెరిగిందని చెప్పారు. అక్కడ 32 స్థానాల్లో పోటీ చేసిన ఆప్ అన్నింటిలోనూ డిపాజిట్లు కోల్పోయిందన్నారు.