పిల్లలు సృష్టించే విధ్వంసానికిపేరెంట్స్ దే బాధ్యత'... ఆందోళనల వేళ కఠిన చట్టం తెచ్చిన ఇటలీ

పిల్లలు సృష్టించే విధ్వంసానికిపేరెంట్స్ దే బాధ్యత'... ఆందోళనల వేళ కఠిన చట్టం తెచ్చిన ఇటలీ
  • ఆస్తి నష్టం పెద్దల నుంచే రికవరీ
  • టీనేజర్ల ముందస్తు అరెస్టులకూ ఓకే

రోమ్: ఇటలీలో ఇటీవల జరిగిన హింసాత్మక నిరసనలు, అల్లర్ల నేపథ్యంలో ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం అత్యంత కఠినమైన భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టింది. సామూహిక విధ్వంసాలకు పాల్పడేవారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. నిరసనల పేరుతో అల్లర్లకు పాల్పడే మైనర్ల (పిల్లల) విషయంలో కొత్త చట్టం చేసింది. 

పిల్లలు బహిరంగ ప్రదేశాల్లో విధ్వంసానికి, ఆస్తుల ధ్వంసానికి లేదా దోపిడీలకు పాల్పడితే.. ఆ నష్టానికి సంబంధించిన జరిమానాలు, ఆర్థిక బాధ్యత పూర్తిగా వారి తల్లిదండ్రులదేనని ఈ చట్టం స్పష్టంచేస్తోంది. దీంతోపాటు, హింసాత్మక ప్రదర్శనల్లో పాల్గొనేవారికి గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు జైలు, 20,000 యూరోల (సుమారు రూ.21 లక్షలు) వరకు జరిమానా విధించనున్నారు. ఒకవేళ ఆందోళనకారులు తమ ముఖాలను కప్పుకుని ఉంటే లేదా ఎవరికైనా గాయాలు చేస్తే ఈ శిక్షలు మరింత పెరుగుతాయి.

పోలీసులకు విస్తృత అధికారాలు

కొత్త చట్టంలో భాగంగా పోలీసులకు మరిన్ని అదనపు అధికారాలు కల్పించారు. నేరానికి పాల్పడకపోయినా, భవిష్యత్తులో హింసకు పాల్పడే ప్రమాదం ఉందని భావిస్తే 14 నుండి 17 ఏళ్ల వయస్కులనూ ముందస్తుగా అదుపులోకి తీసుకునే అధికారం పోలీసులకు కట్టబెట్టింది. గతంలో ఈ నిబంధన కేవలం పెద్దలకు మాత్రమే వర్తించేది. శాంతిభద్రతలను కాపాడేందుకు డిసెంబర్ నాటికి మిలాన్ నగరంలో అదనంగా 500 మంది సైనిక బలగాలను మోహరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

విధ్వంసం సహించబోం: మెలోని

మిలాన్, ఇతర ఉత్తర ఇటాలియన్ నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయం, యుద్ధాలపై నిరసనలు క్రమంగా ఉద్రిక్తతలకు దారితీశాయి. శాంతియుతంగా ప్రారంభమైన ప్రదర్శనలు కొన్నిచోట్ల హింసాత్మకంగా మారాయి. ముఖాలకు ముసుగులు ధరించిన ఆందోళనకారులు దుకాణాలను లూటీ చేయడం, పోలీసులపై దాడులకు పాల్పడటం వంటివి చేశారు. 

ఈ పరిణామాలపై ప్రధాని మెలోని తీవ్రంగా స్పందించారు. ‘ప్రదర్శనలు చేయడం ప్రతి ఒక్కరి హక్కు. అయితే, ఆ పేరుతో నగరాలను ధ్వంసం చేయడం సరికాదు. విధ్వంసానికి దిగడం, లూటీలకు పాల్పడడం ఎప్పటికీ నిరసనల్లో భాగం కాదు. అవి ముమ్మాటికీ నేరాలే’ అని సోషల్ మీడియా వేదికగా మెలోని స్పష్టం చేశారు.

హక్కుల సంఘాల విమర్శలు

ప్రభుత్వ చర్యలపై మానవ హక్కుల సంఘాలు, విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక, ఆర్థిక సమస్యలే యువతలో అసంతృప్తికి దారితీస్తాయని, ఈ కఠిన చర్యలతో వాటిని అణచలేరని అంటున్నారు. యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, భవిష్యత్తుపై అనిశ్చితి వంటి మూల కారణాలను విస్మరించి, కేవలం శిక్షల మీద దృష్టి పెట్టడం పట్ల ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 2027లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో, ప్రభుత్వ శాంతిభద్రతల విధానం ప్రజల్లో ఎంతవరకు ఆమోదం పొందుతుందనేది ఆసక్తికరంగా మారింది.