నిద్ర మాత్రలు మింగి హెచ్ఎం ఆత్మహత్యాయత్నం..సమావేశంలోనే స్పృహ తప్పిన వైనం

నిద్ర మాత్రలు మింగి హెచ్ఎం ఆత్మహత్యాయత్నం..సమావేశంలోనే స్పృహ తప్పిన వైనం
  • అధికారుల వేధింపులే కారణం!

గొల్లపల్లి, వెలుగు: అధికారుల వేధింపులు తాళలేక ఓ ప్రధానోపాధ్యాయుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని చిల్వకోడూరు ప్రైమరీ స్కూల్​లో హెచ్​ఎంగా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ మండల కేంద్రంలోని జడ్పీ బాయ్స్​హైస్కూల్​లో మంగళవారం నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం సందర్భంగా పాఠశాల రికార్డుల విషయమై అధికారులు నిలదీశారు. తోటి ఉపాధ్యాయుల సమక్షంలో తనను అవమానించారని ఆవేదనను గురై నిద్ర మాత్రలు మింగారు. కొద్దిసేపటికి సమావేశంలోనే స్పృహ తప్పి పడిపోయాడు. తోటి ఉపాధ్యాయులు ఆయనను జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా తనిఖీల పేరుతో అధికారులు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రశాంత్ గతంలో తోటి ఉపాధ్యాయుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తన ఆత్మహత్యకు ఉన్నతాధికారులే కారణమంటూ సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి.