లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘జయహో రామానుజ’. సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మించారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్గా నటించగా, సుమన్, ప్రవళ్లిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 24న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.
గురువారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ ‘ఆధ్యాత్మిక విప్లవకారుడు రామానుజాచార్యుల జీవిత కథతో ఈ సినిమాను రూపొందించాం. గొప్ప సినిమాలను ప్రజలు తండోపతండాలుగా థియేటర్స్‌కు వెళ్లి చూస్తుంటారు. మా సినిమాకు కూడా అలాంటి ఆదరణే దక్కుతుందని నమ్ముతున్నాం.
ఈ సినిమాను డబ్బుల కోసం రూపొందించలేదు. రామానుజాచార్యుల వారి గొప్ప కథను ఈ తరం వారికి చూపించాలని ప్రయత్నించాం’ అని అన్నారు. ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ చేశానని సుమన్ అన్నారు. ఈ తరం ప్రేక్షకులకు రామానుజాచార్యుల వారి గొప్పదనం తెలియజేసే చిత్రమిది అని నటి, ప్రొడ్యూసర్ ప్రవళ్లిక అన్నారు.
