సూపర్ స్టార్ రజనీకాంత్ , సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ క్రేజీ కాంబినేషల్ లో వస్తున్న చిత్రం ' జైలర్ 2'. దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్ ఈ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
అయితే రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డబ్బింగ్ చిత్రానికి అక్టోబర్ 15 నుండి 21 వరకు ప్రత్యేక ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 అదనంగా పెంచుకునేందుకు ఒకే చెప్పింది. దీంతో ఒక డబ్బింగ్ సినిమాకు రేట్లు పెంచడంపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు నైజాం పంపిణీదారులు మాత్రం రిస్క్ తీసుకోకుండా సాధారణ టికెట్ ధరలకే ప్రదర్శించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ రీజనబుల్ ప్రైసింగ్ తెలంగాణలో మల్టీప్లెక్స్ ఫుట్‌ఫాల్స్‌ను భారీగా పెంచుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అంటే తెలంగాణలో సింగిల్ స్క్రీన్ రూ.175, మల్టీప్లెక్స్ రూ.295 ధరలకే టికెట్ లభించనుంది. సామాన్యులకు పాత టికెట్ ధరలే అందుబాటులో ఉంటే .. బాక్సాఫీస్ వద్ద మూవీ వసూళ్లు పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, విద్యాబాలన్, ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తిలతో పాటు హృతిక్ రోషన్, విజయ్ సేతుపతిల పవర్ ఫుల్ కామియోలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రాక్‌స్టార్ అనిరుధ్ మ్యూజిక్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది.
ఇక ఈ మూవీ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే ఊహించని ట్రెండ్ కనిపిస్తోంది. రజనీకాంత్ గత చిత్రం 'కూలీ' విడుదలకి 5 రోజుల ముందు దాదాపు 3.78 మిలియన్ల డాలర్ల రికార్డు కలెక్షన్లు సాధించగా.. ప్రస్తుతం 'జైలర్ 2' ఓవర్సీస్ అడ్వాన్సెస్ 1.62 మిలియన్ల డాలర్ల వద్ద నెమ్మదిగా సాగుతోంది. మైండ్ బ్లాకింగ్ ధరకు థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయిన నేపథ్యంలో.. రాబోయే రెండు రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఏ స్థాయిలో పుంజుకుంటాయో, రెండు తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద టైగర్ ముత్తువేల్ పాండ్యన్ ఎలాంటి రికార్డులు తిరగరాస్తాడో వేచి చూడాలి..
