- ఫ్రాన్స్ అల్లర్లకు, ఢిల్లీ నిరసనలకు ముడిపెట్టడంపై విమర్శ
న్యూఢిల్లీ: భారతదేశంలో జరుగుతున్న ఆందోళనలకు, ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న అల్లర్లకు సంబంధం ఉందంటూ బీజేపీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు, అబద్ధాలను ప్రచారం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడింది. అబద్ధాల వ్యాప్తి అనేది బీజేపీ డీఎన్ఏలోనే ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆరోపించారు. ప్రధాని ఇకోసిస్టమ్ తీవ్ర నైరాశ్యం, భయంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తోంది.
ఈసారి ఈ ప్రయత్నాలు ఏమాత్రం సఫలం కావు’ అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని- హోంమంత్రి (మోదీ-–అమిత్ షా) ద్వయం పూర్తిగా బయటపడిపోయారని, ప్రజలు వారికి కచ్చితంగా జవాబుదారీతనం నేర్పుతారని చెప్పారు. ‘ఓట్ల చోరీ’ అనేది నిరూపితమైన నిజమని, ఎలక్షన్ కమిషన్ సొంత డేటా ప్రకారమే 10 కోట్లకు పైగా భారతీయులు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని చెప్పారు. కొత్త ఓటర్లకు అడ్డంకులు సృష్టించేందుకు చట్టవిరుద్ధంగా ఫారమ్ 6ను మార్చిన ఈసీఐ.. నిర్దిష్టమైన ఓట్ల తొలగింపుల కోసం ఫారమ్ 7 దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.
బీజేపీ ఆరోపణలు..
ఫ్రాన్స్‌లో అల్లర్లకు, ఢిల్లీలో నిరసనలకు సంబంధం ఉందంటూ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రచురించిన రిపోర్టును ప్రస్తావిస్తూ విపక్షాలపై బీజేపీ మండిపడింది. దేశంలో అరాచకం సృష్టించేందుకు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించింది.
