January 12 Vidudala: టైటిలే విడుదల తేదీ.. విడుదల తేదీయే టైటిల్! వెంకీ-కళ్యాణ్ రామ్ మూవీపై అనిల్ రావిపూడి క్రేజీ అనౌన్స్‌మెంట్!

January 12 Vidudala: టైటిలే విడుదల తేదీ.. విడుదల తేదీయే టైటిల్! వెంకీ-కళ్యాణ్ రామ్ మూవీపై అనిల్ రావిపూడి క్రేజీ అనౌన్స్‌మెంట్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫన్, ఫ్యామిటీ ఎంటర్ టైనర్ లకు తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన తెరపైకి తెచ్చే ప్రతీ ఆలోచనలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన మూవీకి 'సంక్రాంతికి వస్తున్నాం' అని టైటిల్ పెట్టినప్పుడు కొందరు పెదవి విరిచారు. ఇదేం మూవీ టైటిల్ అని నవ్వుకున్నారు . కానీ థియేటర్లలో అది టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 

క్రేజీ టైటిల్ తో సంక్రాంతికి రెడీ.. 

ఇప్పుడు అదే జోష్‌తో, విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో మరొక క్రేజీ మల్టీస్టారర్‌ను ప్రకటించి టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించారు అనిల్ రావిపూడి. అంతే కాదు మరోసారి ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు .  ఈ భారీ చిత్రానికి 'జనవరి 12 విడుదల' అనే వినూత్నమైన టైటిల్‌ను ఖరారు చేశారు. "బావ బామ్మర్ది సౌజన్యంతో" అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్ ను జోడించారు. సాధారణంగా టైటిల్ వేరు, విడుదల తేదీ వేరుగా ఉంటాయి. కానీ, అనిల్ రావిపూడి తెలివిగా సినిమా పేరునే విడుదల తేదీగా మార్చి పబ్లిసిటీలోనే తన మార్క్ ఫన్ చూపించారు.

కాన్సెప్ట్ వీడియో వైరల్.. 

ఈ టైటిల్ ప్రకటన కోసం విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇందులో కథానాయికలు కీర్తి సురేష్, కృతి శెట్టిలతో పాటు వెంకటేష్, కళ్యాణ్ రామ్ కూడా 'జనవరి 12న విడుదలయ్యే సినిమా పేరు ఏంటి?' అంటూ అయోమయానికి గురవుతారు. అప్పుడు అనిల్ రావిపూడి వచ్చి, సినిమా పేరే 'జనవరి 12 విడుదల' అని, అది విడుదలయ్యేది కూడా సంక్రాంతి కానుకగా 2027 జనవరి 12నే అని వివరించడం నవ్వుల పూయించింది. దర్శకదిగ్గజం ఈవీవీ సత్యనారాయణ మార్క్ కామెడీ శైలి స్పూర్తితో ఈ వీడియోను మలిచారు అనిల్..

 'బావ-బామ్మర్దుల' హంగామా..

'ఎఫ్ 2', 'ఎఫ్ 3' లాంటి చిత్రాలతో వెంకటేష్‌తో అద్భుతమైన కామెడీ పండించిన అనిల్ రావిపూడి, ఇప్పుడు కళ్యాణ్ రామ్‌ను కూడా తోడు చేసుకుని పూర్తిస్థాయి ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అందించబోతున్నారు. బావాబావమరుదుల మధ్య సాగే సరదా గొడవలు, కామెడీ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గరపాటి నిర్మిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ ,  ఎస్ఎంటి అర్చన సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. సంక్రాంతి రేసులో ఈ 'బావ-బామ్మర్దుల' హంగామా ఏ స్థాయిలో ఉండబోతుందో చూడాలి..