మార్చి 25న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు రాజీనామా చేస్త : జీవన్ రెడ్డి

మార్చి  25న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు రాజీనామా చేస్త : జీవన్ రెడ్డి
  • ఇక ఆ పార్టీలో  కొనసాగలేను: జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  • సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి కూడా నాకు అన్యాయం చేసిండు
  • నేను బయటకొచ్చాక పార్టీకి నా విలువ తెలుస్తుంది
  • అభిమానులతో భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి

జగిత్యాల, వెలుగు: ఈ నెల 25న కాంగ్రెస్‌‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఇక ఆ పార్టీలో కొనసాగలేనని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌‌ పార్టీతో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకోవడం బాధగా ఉందని.. అయితే, తన సమస్యకు ఎక్కడా పరిష్కారం లభించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించినా స్పష్టమైన సమాధానం రాలేదన్నారు. రాష్ట్ర నాయకత్వం అధిష్టానంపై బాధ్యత నెట్టివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జగిత్యాలలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 20 నెలలుగా జరిగిన పరిణామాలు ఇబ్బంది కలిగించాయని, పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉందని ఆరోపించారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన విలువ తెలుస్తుందన్నారు. అభిమానులు, శ్రేయోభిలాషులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అయితే, ప్రస్తుతానికి తాను ఏ పార్టీలో చేరడం లేదని, ప్రజల మధ్యే ఉంటూ నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. శాసన మండలిలో ప్రజల కోసం ఒంటరి పోరాటం చేశానని, మంత్రిగా ఉన్నప్పుడు రైతుల సమస్యలపై ధర్నా చేశానని గుర్తుచేశారు. ఫిరాయింపుదారులు పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. గౌరవం లేని చోట రాజకీయాల్లో కొనసాగడం వల్ల ప్రయోజనం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను సూచించిన వారికి టికెట్లు వచ్చినా ప్రచారం చేయలేని పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల ప్రభావం జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌‌పై పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేశానని, తన సహనానికి కూడా పరిమితి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛకు అనుగుణంగా తాను నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. చివరి శ్వాస వరకు జగిత్యాల ప్రజలతోనే ఉంటానని 
స్పష్టం చేశారు. 

రజనీకాంత్‌‌ డైలాగ్‌‌తో పోస్టర్‌‌‌‌

జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఆయన ఇంటి వద్ద రజనీకాంత్ సినిమా డైలాగ్‌‌తో ఉన్న ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. ఈ ఫ్లెక్సీలో రజనీకాంత్, జీవన్ రెడ్డి ఫొటోలు ఉన్నాయి. నేనొక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే.. అన్న డైలాగ్‌‌ను ఇంగ్లిష్‌‌లో ‘ఇఫ్‌‌ ఐ సే ఇట్‌‌ వన్స్.. ఇటీజ్ ఈక్వల్‌‌ టు సేయింగ్‌‌ ఇట్ హండ్రెడ్ టైమ్స్’ అని రాశారు.