జెన్–జెడ్..మినీ రిటైర్‌ మెంట్.. ఉద్యోగానికి చిన్న బ్రేక్.. జీవితానికి పెద్ద ఊపిరి!

జెన్–జెడ్..మినీ రిటైర్‌ మెంట్..  ఉద్యోగానికి చిన్న బ్రేక్.. జీవితానికి పెద్ద ఊపిరి!

ఒకప్పుడు ఉద్యోగం అంటే ఒకే దారిలో సాగే ప్రయాణం. మధ్యలో కొంత గ్యాప్​ తీసుకోవడం, మనసుకు నచ్చినట్టు జీవించడం లాంటి ఆలోచనలు చాలా మందికి పెన్షన్ వయసు తర్వాతే వచ్చేవి. కానీ ఇప్పుడు జెన్‌– జెడ్ యువత ఆ పాత లెక్కలను మార్చేస్తోంది. “రిటైర్ అయ్యాకే ఎందుకు? ఇప్పుడే ఎందుకు చేయకూడదు?” అనే ప్రశ్నలతో వాళ్లు చిన్న బ్రేక్ తీసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. దాన్ని మినీ రిటైర్‌మెంట్ అని పిలుస్తున్నారు.

మినీ రిటైర్​మెంట్​ అంటే.. ఉద్యోగాన్ని వదిలేయడం కాదు. పని ఒత్తిడికి కాస్త దూరంగా వెళ్లి, కొన్ని వారాలు లేదా నెలలు తమకు నచ్చిన జీవితం గడపడం. ఎప్పటినుంచో చేయాలనుకున్న ప్రయాణాలు, కుటుంబంతో గడిపే సమయం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, లేదా మనసులో పెట్టుకున్న చిన్న కలలను నిజం చేసుకోవడం.. ఇవన్నీ ఇందులో భాగమే. ఆ గ్యాప్​ తర్వాత మళ్లీ అదే ఉత్సాహంతో ఉద్యోగానికి తిరిగి రావడమే దీని అసలు ఉద్దేశం.

కరోనా తర్వాత పని పట్ల దృష్టికోణం మారింది. ఇంటినుంచే పని చేసే అవకాశం, మానసిక ఆరోగ్యంపై పెరిగిన అవగాహన, జీవితానికి పని మాత్రమే కాదు విలువ కూడా ఉందన్న భావన.. ఇవన్నీ ఈ ట్రెండ్‌ను బలంగా ముందుకు నడిపించాయి. “డబ్బు కోసం మాత్రమే కాదు, ప్రశాంతంగా బతకడం కూడా ముఖ్యమే” అని ఈ తరం గట్టిగా చెప్తోంది.

అయితే మినీ రిటైర్‌మెంట్ అందరికీ సులభం కాదు. ముందస్తు పొదుపు ఉండాలి. బిల్లులు, బాధ్యతలు, రుణాలు, తిరిగి ఉద్యోగంలోకి రావడం వంటి విషయాలు ముందే ఆలోచించాలి. ప్రణాళిక లేకుండా తీసుకునే విరామం సమస్యలకు దారి తీస్తుంది. కానీ సరిగా ప్లాన్​ చేసుకుని ఈ బ్రేక్​ తీసుకుంటే, అది అలసిపోయిన మనసుకు కొత్త శ్వాస అవుతుంది. జెన్‌– జెడ్‌కు సక్సెస్​ అంటే కేవలం పెద్ద జీతం కాదు. స్వేచ్ఛ, ప్రశాంతత, అనుభవాలు, జీవితాన్ని ఆస్వాదించే అవకాశం కూడా. అందుకే వాళ్లు జీవితం ఒక్క ఉద్యోగం చుట్టే తిరగదు అని చెప్తున్నారు.

మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు featureseditor@v6velugu.com కి మెయిల్​ చేయండి.