హైదరాబాద్, వెలుగు: సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగాలిచ్చింది. సమ్మె సందర్భంగా కొంతమంది గుండెపోటుతో, మరికొందరు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. మొత్తం 38 మంది కార్మి కులు చనిపోగా.. అందులో 33 మందిని ఫైనల్ చేశారు. శుక్రవారం అమరుల కుటుంబ సభ్యులకు అధికారులు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో చనిపోయిన కార్మికుల కుటుంబంలో అర్హులైన ఒకరికి 8 రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గతంలో కండక్టర్, డ్రైవర్, శ్రామిక్, సెక్యూరిటీ పోస్టులను మాత్రమే కారుణ్య నియామకాల కింద ఇచ్చేవారు. గతానికి భిన్నంగా నిబంధనలను సడలించి కొందరికి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఇచ్చారు. వీరంతా ఏడాదిపాటు ప్రొబెషనరీలో ఉంటారు. డిపార్ట్‌మెంట్ టెస్ట్ పాస్ కావాలి. లేకపోతే ఏడాది తర్వాత ఉద్యోగం నుంచే తొలగించవచ్చు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, కారణం చెప్పకుండా తొలగించే అధికారం ఆర్టీసీ అధికారులకు ఉంది. వీరికి ప్రారంభ వేతనం రూ.13,950గా నిర్ణయించారు. కాగా, సమ్మె కాలంలో దురదృష్టవశాత్తు చనిపోయిన 33 మంది ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కమాల్ రెడ్డి, ఉప ప్రధాన కార్యదర్శి అశోక్ కృతజ్ఞతలు తెలిపారు.
కొందరు ఉద్యోగుల వివరాలు..
డిపెండెంట్ చనిపోయిన కార్మికుడు డిపో ఉద్యోగం
1.కిరణ్ కుమార్ గౌడ్ జంగయ్య(శ్రామిక్) ఇబ్రహీంపట్న జూనియర్ అసిస్టెంట్
2.ప్రశాంత్ లక్ష్మయ్య(డ్రైవర్) దిల్‌సుఖ్‌నగర్ ఆర్టీసీ కానిస్టేబుల్
3.షేక్ నదీం ఖలీల్ మియా(డ్రైవర్) హెచ్‌సీయూ ఆర్టీసీ కానిస్టేబుల్
4.లక్ష్మీప్రసన్న రమేష్ (డ్రైవర్) ముషీరాబాద్ 1 ఆర్టీసీ కానిస్టేబుల్
5.శ్రీనివాసులు బాష్య(డ్రైవర్) ఫలక్ నుమా ఆర్టీసీ కానిస్టేబుల్
6.శివశంకర్ గౌడ్ రంగారెడ్డి(ఏడీసీ) హయత్ నగర్ 2 జూనియర్ అసిస్టెంట్
7.స్రవంతి వెంకటరాజం(డ్రైవర్) మెహిదీపట్న జూనియర్ అసిస్టెంట్
8.సాయికిరణ్ కొమురయ్య(డ్రైవర్) చెంగిచర్ల జూనియర్ అసిస్టెంట్
9.సంకీర్తన్ సురేందర్ (కండక్టర్) రాణిగంజ్ 2 ఆర్టీసీ కానిస్టేబుల్
10.ప్రవీణ్ ఎస్పీ కుమార్ (డ్రైవర్ ) కూకట్ పల్లి కండక్టర్
11.శ్రీకాంత్ నరేష్ (డ్రైవర్ ) మహబూబాబాద్ జూనియర్ అసిస్టెంట్
12.ఆమని పాపయ్య(కండక్టర్) తొర్రూర్ జూనియర్ అసిస్టెంట్
13.ఎండీ ఫయాజ్ యాకుబ్ పాషా(డ్రైవర్ ) నర్సంపేట జూనియర్ అసిస్టెంట్
14.ప్రవళ్లిక రవీందర్ (కండక్టర్ ) హన్మకొండ జూనియర్ అసిస్టెంట్
