జోడు వాగుల బ్రిడ్జిపై నిర్లక్ష్యం..పదేండ్లయినా పట్టించుకోని కేంద్రం

జోడు వాగుల బ్రిడ్జిపై నిర్లక్ష్యం..పదేండ్లయినా పట్టించుకోని కేంద్రం
  •     అనుమతుల సాధనలో గత బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్
  •     మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కృషితో ఫారెస్ట్ క్లియరెన్స్
  •     బ్రిడ్జి, పెండింగ్ రోడ్డు పనులకు రూ.120 కోట్లు మంజూరు
  •     అయినా పనుల్లో జాప్యం... నిరసనగా కాంగ్రెస్ ధర్నా

మంచిర్యాల/జైపూర్​, వెలుగు: నేషనల్​ హైవే 63లో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని జోడు వాగుల వద్ద హైలెవల్ ​బ్రిడ్జి నిర్మాణంతో పాటు పెండింగ్​రోడ్డు పనులు పూర్తిచేయడంలో కేంద్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల సంస్థ నిర్లక్ష్యం వహిస్తున్నాయి. జైపూర్ మండలం రసూల్​పల్లి నుంచి కోటపల్లి మండలం అర్జునగుట్ట ప్రాణహిత బ్రిడ్జి వరకు హైవే నిర్మాణం ప్రారంభించి పదేండ్లు కావస్తున్నా జోడు వాగుల బ్రిడ్జికి మాత్రం మోక్షం కలగలేదు. ఇందుకు అవసరమైన ఫండ్స్, పర్మిషన్లు తీసుకురావడంలో గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ఫెయిలైంది. ఎట్టకేలకు చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి డాక్టర్ జి.వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఫారెస్ట్​ క్లియరెన్స్​ సాధించారు. జోడు వాగులపై హైలెవల్​బ్రిడ్జి నిర్మాణంతో పాటు పెండింగ్ ​రోడ్డు పనుల కోసం రూ.120 కోట్లు సాంక్షన్ చేయించారు. ఇప్పటికే రెండేండ్లు కావస్తున్నా పనులు ప్రారంభించకపోవడంపై  ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు.

పదేండ్లుగా వెంటాడుతున్న కష్టాలు.... 

ఎన్​హెచ్​63లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2016లో రసూల్​పల్లి నుంచి మహారాష్ట్ర బార్డర్​లోని అర్జునగుట్ట ప్రాణహిత బ్రిడ్జి వరకు హైవే నిర్మాణానికి రూ.164 కోట్లు సాంక్షన్ చేసింది. ఈ పనులు ఆగుతూ.. సాగుతూ.. దాదాపు ఐదేండ్లు కొనసాగాయి. అయితే భీమారం, చెన్నూర్​నడుమ ఉన్న రిజర్వ్​ ఫారెస్టులో పనులకు క్లియరెన్స్​ రాకపోవడంతో జోడు వాగుల బ్రిడ్జి నిర్మాణంతో పాటు రోడ్డు పనులు నిలిచిపోయాయి. అనుమతుల సాధనలో అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఫారెస్ట్ పర్మిషన్లకు సంబంధించిన డబ్బులు చెల్లించకపోవడంతో కేంద్రం సైతం చేతులెత్తేసింది. హైవే పనులు అసంపూర్తిగా మిగలడం వల్ల గత పదేండ్లగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్ ​రాష్ట్రాలను అనుసంధానించే ఈ హైవేపై అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ప్రజలకు శాపంగా మారింది. 

మంత్రి, ఎంపీ కృషితో కదలిక  

చెన్నూర్​ ఎమ్మెల్యేగా వివేక్ ​వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలిచిన తర్వాత జోడు వాగుల బ్రిడ్జి నిర్మాణంతో పాటు పెండింగ్​ హైవే పనులపై దృష్టి పెట్టారు. పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ ​యాదవ్​ను కలిసి అసంపూర్తి పనుల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. పట్టుబట్టి ఫారెస్ట్​ పర్మిషన్లతో పాటు ఫండ్స్ సాధించారు. వారి కృషి ఫలితంగా 2024 సెప్టెంబర్​లో జోడు వాగుల వద్ద హైలెవల్​ బ్రిడ్జి నిర్మాణం, పెండింగ్​ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు సాంక్షన్​ చేసింది. ఆ తర్వాత మరో రూ.20 కోట్లు కేటాయించింది. నిధులు మంజూరై రెండేండ్లు కావస్తున్నా పనులు ప్రారంభించకపోవడంతో కేంద్రం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

త్రీమెన్​ కమిటీ నియామకం ఎప్పుడు? 

ఎట్టకేలకు ఈ ఏడాది మే నెలలో జోడు వాగుల వద్ద హైలెవల్​ బ్రిడ్జి నిర్మాణానికి రూ.76.51 కోట్ల అంచనాలతో టెండర్​కాల్​చేశారు. ఈ ప్రక్రియ ఫైనల్​స్టేజ్​లో ఉన్నట్టు సమాచారం. ఇక చివరగా కేంద్ర, రాష్ట్ర రహదారుల ఇంజనీరింగ్ అధికారులతో కూడిన త్రీమెన్​కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులకు గ్రీన్​సిగ్నల్​ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ కమిటీ నియామకంలో జాప్యం వల్ల పనులు పడకేశాయన్న ఆరోపణలు వస్తున్నాయి. టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు మొదలుపెట్టినప్పటి నుంచి రెండేండ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. మొదటి దశలో అటవీ భూమికి హద్దులు గుర్తించి ఆర్​అండ్​బీకి అప్పగిస్తారు. రెండో దశలో టెండర్ ఖరారైన వెంటనే కాంట్రాక్ట్ సంస్థ రంగంలోకి దిగి వన్యప్రాణుల రక్షణకు ఇబ్బంది కలగకుండా చెట్ల తొలగింపు, సైట్ క్లియరెన్స్ పనులను రెండు నుంచి మూడు నెలల్లో ప్రారంభిస్తుంది. మూడో దశలో హై-లెవల్ బ్రిడ్జి, దానికి రెండువైపులా ఫోర్- లేన్ అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి 15 నుంచి 18 నెలల కాలపరిమితి విధిస్తారు. ఈ అటవీ ప్రాంతం టైగర్ కారిడార్ పరిధిలోకి రావడంతో నాలుగో దశలో వన్యప్రాణుల రాకపోకల కోసం అండర్ పాస్​ల నిర్మాణం చేపడుతారు. 

కాంగ్రెస్ ధర్నా

జోడు వాగుల వద్ద హైలెవల్​ బ్రిడ్జి నిర్మాణంతో పాటు పెండింగ్​ పనులు​ వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్​నాయకులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ ​చేశారు. డీసీసీ ప్రెసిడెంట్ ​పి.రఘునాథ్​ రెడ్డి, భీమారం మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ పొడేటి రవి ఆధ్వర్యంలో ఆదివారం జోడు వాగుల వద్ద రోడ్డుపై బైటాయించి ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ.. హైవే 63 నిర్మాణంపై అటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని గత బీఆర్ఎస్​ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని విమర్శించారు. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే మంత్రి వివేక్​ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కేంద్రంపై ఒత్తిడి పెంచి ఫారెస్ట్ పర్మిషన్లతో పాటు రూ.120 కోట్ల ఫండ్స్ తీసుకొచ్చారని తెలిపారు. వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ​చేశారు. ధర్నాలో భీమారం, జైపూర్, చెన్నూర్​ మండలాల లీడర్లు పాల్గొన్నారు.