జులై నెల వర్షాలతోపాటు సిటీ ప్రజల్లో కొత్త ఉత్సాహానికి వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతోంది. చల్లని వాతావరణంలో కల్చరల్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎడ్యుకేషన్, బిజినెస్ ప్రోగ్రామ్స్‌తో హైదరాబాద్ కళకళలాడనుంది. సైక్లింగ్ రైడ్స్, మార్నింగ్ వాక్ క్లబ్ ఈవెంట్స్, యోగా సెషన్స్, బుక్ ఈవెంట్స్.. పబ్లిక్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈవెంట్లకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, డిజిటల్ టికెటింగ్ వంటివి అందుబాటులో ఉన్నాయి.
ఒకప్పుడు వీకెండ్ అంటే సినిమా, షాపింగ్ మాల్, రెస్టారెంట్ మాత్రమే. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసరాల్లో వీకెండ్ కల్చర్ పూర్తిగా మారిపోయింది. హైటెక్ సిటీలో ఫుడ్ అండ్ బేవరేజ్ ఇండస్ట్రీ ట్రేడ్ ఫెయిర్, పెళ్లి ఫ్యాషన్, జువెలరీ, లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్, ఫార్మా, టెక్నాలజీ రంగాల ఎక్స్పర్ట్స్ మీట్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ టెక్నాలజీ ఎక్స్‌పో, డెంటల్ షో లాంటి వినూత్న ఈవెంట్లు, బోనాల ఉత్సవాలతో జులై నెల మార్మోగనుంది.
కపుల్స్, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, యూత్, ఉద్యోగుల కోసం లైవ్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్, స్టాండ్- అప్ కామెడీ షోలు, ఫుడ్ ఫెస్టివల్స్, క్రియేటివ్ వర్క్‌షాప్‌లు, పిల్లల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ అలరించనున్నాయి.
ఎంటర్‌టైన్‌మెంట్ టెక్నాలజీ..
శంషాబాద్‌లోని క్లాసిక్ కన్వెన్షన్ త్రీలో జులై 23 నుంచి 25వతేదీ వరకు ప్రోవేవ్ ఎక్స్ పో 2026 జరగనుంది. ప్రొఫెషనల్ సౌండ్, లైటింగ్, ఆడియో–విజువల్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ టెక్నాలజీ రంగాలకు చెందిన 300కు పైగా సంస్థలు ఈ ఎక్స్ పోలో పాల్గొననున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనలో ప్రొఫెషనల్ ఆడియో సిస్టమ్స్, లైన్ అరే స్పీకర్లు, స్టేజ్ లైటింగ్, ఎల్ఈడీ డిస్‌ప్లేలు, డిజిటల్ సైనేజ్, బ్రాడ్‌కాస్ట్ పరికరాలు, స్టూడియో రికార్డింగ్ సొల్యూషన్స్, ట్రస్సింగ్, రిగ్గింగ్, ప్రొజెక్షన్ టెక్నాలజీ, ఏవీ ఇంటిగ్రేషన్ వంటి అత్యాధునిక ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించనున్నారు.
పెండ్లి కోసం..
జులై 9,10,11 తేదీల్లో హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీ నోవాటెల్‌లో హై లైఫ్ ఎగ్జిబిషన్ జరగనుంది. ఇందులో లగ్జరీ ఫ్యాషన్, ఆభరణాల ప్రదర్శన ఉంటుంది. ఇప్పటికే వెడ్డింగ్ ఆసియా - హైదరాబాద్.. జులై 4వ తేదీన ప్రారంభం అయింది. ఫుడ్ ఎ ఫెయిర్ ఎగ్జిబిషన్ జులై 2 నుంచి 4వ తేదీ వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగింది.
ఎగ్జిబిషన్‌లో ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్లు, డిజైనర్ బోటిక్‌లు, బ్రైడల్ వేర్, గ్రూమ్ కలెక్షన్స్, డైమండ్, గోల్డ్, సిల్వర్, కుందన్, టెంపుల్ జ్యువెలరీ, ఫ్యాషన్ యాక్సెసరీస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వెడ్డింగ్ ప్లానర్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు, డెకరేషన్, ఫొటోగ్రఫీ, మేకప్, మెహందీ, క్యాటరింగ్, ట్రావెల్, హనీమూన్ ప్యాకేజీలు, వెడ్డింగ్ ఇన్విటేషన్స్ వంటి సేవలందించే సంస్థలు ప్రత్యేక ఆఫర్లతో ఆకర్షించాయి.
బోనాలు షురూ
బోనాల ఉత్సవాలు జులై16వ తేదీ నుంచి గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో పూజలతో ఈ చారిత్రాత్మక తెలంగాణ రాష్ట్ర పండుగ వైభవంగా ప్రారంభం కానుంది. అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం, హరిబౌలిలోని అక్కన్న, మాదన్న మహంకాళి దేవాలయాల్లో కొనసాగుతాయి. ఈ పండుగ ఆగస్టు నెల మధ్య వరకు ఎంతో కోలాహలంగా జరగనుంది.
బోనాల సందర్భంగా మహిళలు భక్తి ప్రపత్తులతో పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన కుండల్లో అన్నం, బెల్లం, పెరుగు నైవేద్యంగా సమర్పిస్తూ తలపై మోసుకుని ఊరేగింపుగా ఆలయాలకు చేరుకుంటారు. డప్పుల మోతలు, కోలాటాలు, జానపద కళారూపాలు, రంగురంగుల తొట్టెలు, ఘటం ఊరేగింపులు పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
బోనాలంటే విశిష్ఠ ఆకర్షణ పోతురాజుల డాన్సులు, రంగం కార్యక్రమంలో అమ్మవారి ఆవాహన పొందిన మహిళ భవిష్యవాణి భక్తులను ఆకట్టుకోనున్నాయి. ఇలా.. జులై నెల వినోదం, విజ్ఞానం, ఆరోగ్యం, సంస్కృతి.. ప్రతి రంగంలోనూ జరిగే ఈవెంట్లు నగరవాసుల రోజువారీ జీవితానికి కొత్త ఉత్సాహాన్ని తెస్తోంది.
ఫార్మా ప్రో అండ్ ప్యాక్ ఎక్స్ పో -2026
జులై 3న ఫార్మా రంగానికి చెందిన ప్రముఖులతో ఏపీఐ కనెక్ట్ 2026 మీటింగ్ జరిగింది, జులై 9 నుంచి 11వ తేదీ వరకు హైటెక్స్‌లో ఫార్మా ప్రో అండ్ ప్యాక్ ఎక్స్ పో 2026 నిర్వహించనున్నారు. ఫార్మా పరిశ్రమకు మెగా ప్రదర్శనలో ఫార్మా ప్రాసెసింగ్ యంత్రాలు, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఆటోమేషన్ సొల్యూషన్స్, ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్స్, క్లీన్‌రూమ్ టెక్నాలజీ, ల్యాబ్ పరికరాలు, వాటర్ ట్రీట్‌మెంట్, సప్లై చైన్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ప్రదర్శించనున్నారు.
ఈ ఏడాది ఎక్స్‌పోలో 350కు పైగా ఎగ్జిబిటర్లు, వేలాది ఉత్పత్తులు, అంతర్జాతీయ బ్రాండ్లు పాల్గొననున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ ప్రదర్శనలో భాగంగా బయ్యర్ – సెల్లర్ మీటింగ్స్, సాంకేతిక సదస్సులు, ప్రత్యక్ష యంత్రాల ప్రదర్శనలు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు కూడా నిర్వహించనున్నారు. ఫార్మా తయారీ రంగంలో తాజా ధోరణులు, ఆటోమేషన్, డిజిటలైజేషన్, సస్టైనబిలిటీ అంశాలపై నిపుణులు చర్చించనున్నారు.
మెగా డెంటల్ షో -2026
ఈ జులై నెలలో డెంటల్ షో-2026కు హైటెక్ నగరం వేదిక కానుంది. దంత వైద్య రంగంలోని తాజా సాంకేతికతలు, చికిత్సా విధానాలు, అత్యాధునిక పరికరాలను ఒకే వేదికపై పరిచయం చేసే హైదరాబాద్ డెంటల్ షో 2026 జులై 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. దంత వైద్య రంగానికి మెగా వేదికగా ఈ కార్యక్రమాన్ని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నిర్వహించనుంది.
ఈ రెండు రోజుల డెంటల్ షోలో దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ డెంటల్ పరికరాల తయారీ సంస్థలు, డెంటల్ మెటీరియల్స్, ఇంప్లాంట్స్, డిజిటల్ డెంటిస్ట్రీ, ఇమేజింగ్ సిస్టమ్స్, ఆర్థోడాంటిక్ సొల్యూషన్స్, ల్యాబ్ టెక్నాలజీ, ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ప్రదర్శనతోపాటు దంత వైద్య నిపుణుల ఉపన్యాసాలు, శాస్త్రీయ సదస్సులు, ప్యానెల్ చర్చలు, హ్యాండ్స్- ఆన్ శిక్షణ కార్యక్రమాలు, విద్యార్థుల పోటీలు కూడా నిర్వహించనున్నారు.
