కాంగ్రెస్‌లో ప్రజా సేవ చేయలేం.. వాస్తవికతకు దూరంగా నాయకత్వం

కాంగ్రెస్‌లో ప్రజా సేవ చేయలేం.. వాస్తవికతకు దూరంగా నాయకత్వం

ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో మాదిరిగా లేదని అన్నారు జ్యోతిరాదిత్య సింధియా. నిన్న కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. బుధవారం మధ్యాహ్నం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆ పార్టీలో ఉండి ప్రజా సేవ చేయడం అసాధ్యమని తనకు అర్థమైందని చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలనేవి ఓ వేదికగా ఉపయోగపడాలని తాను భావించే వాడినని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న తీరులో అది సాధ్యం కాదని అన్నారు. వాస్తవిక పరిస్థితులుకు దూరంగా కాంగ్రెస్ నాయకత్వం నడుస్తోందని ఆరోపించారు సింధియా. ప్రజా సేవ చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అది అసాధ్యంగా మారిందని, ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని అన్నారు. పూర్వం ఉన్న తీరులో కాంగ్రెస్ లేదని చెప్పారు.

హామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్

పార్టీని వీడాల్సి రావడానికి కారణం చెబుతూ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు జ్యోదిరాదిత్య సింధియా. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా గడిచిపోతున్న రైతులను, నిరుద్యోగ యువతను పట్టించుకోలేదని ఆరోపించారు. నేటికీ రైతు రుణమాఫీ అమలు చేయలేకపోవడం దారుణమన్నారు. యువతకు ఇస్తామన్న నిరుద్యోగ భృతిని ఇంత వరకు అందించలేకపోయామని, కానీ అవినీతి మాత్రం పెరిగిపోతోందని ఆరోపించారు సింధియా.

మోడీ చేతుల్లో భారత్ భవిష్యత్తు భద్రం

ప్రజా సేవ చేసేందుకు తమ కుటుంబంలోకి ఆహ్వానించిన ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు ధన్యవాదాలు చెప్పారు సింధియా. ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రతిష్టను ప్రధాని నరేంద్ర మోడీ పెంచారని, మన దేశ భవిష్యత్తు ఆయన చేతుల్లో భద్రంగా ఉందని అన్నారు. తన జీవితంలో దిశను మార్చేసిన రెండు ఘటనలను ఎప్పటికీ మర్చిపోలేనని, మొదటిది తన తండ్రి మాధవ్ రావ్ సింధియా మరణం అయితే రెండోది ఇప్పుడు పార్టీ మారడమని తెలిపారు.