కైకాల  ఇంటికెళ్లి బర్త్ డే కేక్ కట్ చేయించిన చిరు

కైకాల  ఇంటికెళ్లి బర్త్ డే కేక్ కట్ చేయించిన చిరు

హైదరాబాద్: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజున ఆయనను స్వయంగా కలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. నేడు కైకాల సత్యనారాయణ 87వ పుట్టినరోజు నేడు. కైకాల బర్త్ డే సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే కైకాలను ప్రత్యేకంగా అభిమానించే మెగాస్టార్ చిరంజీవి మాత్రం స్వయానా  కైకాల నివాసానికి వెళ్లి  శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు  ఆయన చేత కేక్ కట్ చేయించారు. దీంతో కైకాల సంతోషం వ్యక్తం చేశారు.  ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన చిరు.. కైకాల గురించి తన అభిమానాన్ని చాటుకున్నారు. 

"పెద్దలు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు నాడు ఆయన్ని స్వయంగా కలవడం సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాను"...  అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి, కైకాల కాంబినేషన్ లో పదుల సంఖ్యలో చిత్రాలు వచ్చాయి. చిరంజీవి చిత్రాల్లో కైకాల విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా, కమెడియన్ గా కూడా చేశారు. యముడికి మొగుడు, బావగారు బాగున్నారా? కొండవీటి దొంగ వంటి చిత్రాల్లో వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ అదుర్స్ అని చెప్పాలి. కొన్నాళ్లుగా వయో సంబంధింత సమస్యలతో బాధపడుతున్న కైకాల ఇంటికే పరిమితం అవుతున్నారు. గత ఏడాది ఆయన ఆరోగ్యం విషమించడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించారు. నటుడిగా కైకాల సుదీర్ఘ ప్రస్థానం కలిగి ఉన్నారు. వందల చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కామెడీ రోల్స్ చేశారు. ఎన్టీఆర్ కి కైకాల డూప్ గా చేసేవారు. యముడు పాత్రలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన విషయం తెలిసిందే.