బతుకంతా ప్రజలకర్పించిన కవి.. కాళోజీ ఆత్మకథ

 బతుకంతా ప్రజలకర్పించిన కవి.. కాళోజీ ఆత్మకథ

‘మొదటి ప్రపంచ యుద్ధంతో పాటే నేనూ భూమ్మీద పడ్డా’నని తన ఆత్మకథలో రాసుకున్నాడు కాళోజీ. యాదృచ్ఛికంగా ఆయన జీవితమంతా నిరంతరం యుద్ధ రంగంలోనే కొనసాగింది. అనివార్యంగా యుద్ధం చేయవలసిన పరిస్థితులు ముందుకు వచ్చినప్పుడు వెనుకడుగు వేయకుండా పోరాడిన ధైర్యవంతుడు కాళోజి. 

నిజాం నవాబును ధిక్కరించడం దగ్గర నుంచి, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రశ్నించటం దాకా ఆయన నిరంతరం యుద్ధరంగంలోనే నిలబడ్డాడు. ‘‘నేను డేంజర్ ఎక్కడుంటే, అపాయమెక్కడుంటే దాంట్లోకి పోయి పాల్గొన. కానీ డేంజర్ నాకు ఎదురుగా వస్తే మాత్రం అక్కడి నుంచి పారిపోను’’ అని స్వయంగా ఒప్పుకున్నాడు ఒక సందర్భంలో కాళోజీ.  

‘తనతో తాను తగాదా పడడమే కవిత్వ’మన్నాడు ఈట్స్. కానీ కాళోజీ తగాదా తనతో తనకు కాదు. ఈ వ్యవస్థతో.అందులోని హింసతో. పీడనతో వాటిని ప్రమోట్ చేస్తున్న రాజ్యంతో. ప్రజలందరి గొడవను తన గొడవగా మార్చుకున్న కాళోజీ విషయంలో తనతో తనకే తగాదా అన్నమాటే చెల్లుబాటు కాదు. 
 
తల ఊడినను నేను 
తలను తాకట్టు పెట్ట
అని అనగల మనిషి బతుకు 

తిరుగుబాటు... గా నిర్వచించుకున్న కాళోజి తన జీవితం చివరికంటా తిరుగుబాటుదారుగానే కొనసాగాడు. యుద్ధరంగంలోనే నిలిచాడు.ఈ నేపథ్యంలోనే శ్రీశ్రీ కాళోజీని లూయి ఆరగాన్(ప్రఖ్యాత ఫ్రాన్స్ కవి)తో పోల్చాడు. అలా పోల్చడం వ్యక్తిగతంగా కాళోజీకి నచ్చలేదు. 

ఎందుకంటే తన కళ్ళముందు జరుగుతున్న ఫ్రాన్స్ యుద్ధంలో పాల్గొనకుండా తన రచనతోనే ప్రజలను చైతన్యవంతం చేశాడు ఆరగాన్. కానీ కాళోజి అలా కాదు. ఆయన నిరంతరం తన కాలం నాటి అనేక రకాల యుద్ధాలతో పాటే నడిచాడు. వాటిని నడిపించాడు. కాళోజీ పోషించిన ఈ పాత్ర భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

అయితే ఈ ప్రజల గొడవల్లోకి ఆయన ఎలా ప్రవేశించాడు? ఎందుకు ప్రవేశించాడు? ఎందుకంటే ‘పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె- మాయ మర్మము జూచి మండిపోవును ఒళ్ళు’ అని సమాధానం చెప్తాడు. ‘జరిగిందంతా చూస్తూ ఎరగనట్లు పడి ఉండగ- సాక్షీభూతున్ని కాను సాక్షాత్తు మానవున్ని’ అని కూడా చెప్పుకున్నాడు. 

అన్యాయాన్ని ఏమాత్రమూ సహించలేని ఆయన వ్యక్తిత్వమే ఈ గొడవకు కారణమైంది. సాటి మనుషులందరినీ తనలాగే భావించడమే, వాండ్ల కష్టానికి కదిలిపోవడమే ఈ కొడవంతటికీ కారణం. వెన్నపూసలాంటి మనసుగల కాళోజీ నిజంగా మనిషికి సంబంధించిన కవి. స్థూలార్ధంలో ప్రజల కవి. వాళ్ళ కోసమే తపించిన కవి. కేవలం వాళ్ల కోసమే రాసిన కవి. కాబట్టి ‘‘కాళోజీ కవితకు ప్రజా హృదయ పీఠిక లభించిం’’దంటాడు దాశరథి. 

‘బతుక్కు బతుకు తప్ప మరో సిద్ధాంతం లేద’ని నమ్మిన కాళోజీ ప్రజల బతుకులను అతలాకుతలం చేస్తున్న ప్రభుత్వాల మీద పోరాడటానికి విభిన్న భావజాలాలు గల సంస్థలతో కలిసి పని చేశాడు. ఈ విధంగా ఆయనకు వరవరరావూ ఆప్తుడే, పీవీ. నరసింహారావూ మిత్రుడే.కాళోజీకి ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం నచ్చదు.

 ఈ యిజాలు, సిద్ధాంతాలు- ‘మనిషి సహజంగా ఆలోచించి సొంత నిర్ణయానికి రాకుండా చేయడానికే’నన్నంత దూరం వెళ్లాడాయన. కాళోజీ వ్యక్తిగతంగా స్వేచ్చాజీవి. ఆయనలోని స్వేచ్చావాదం, దానికంటిన మానవతావాదం వెరసి కాళోజీని ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండకుండా చేసి ఉంటాయి. 

అయితే అటు వరవరరావు గారి వల్లనయినా, ఇటు నరసింహారావు గారి వల్లనయినా అంతిమంగా ప్రజలకు మేలు జరగాలన్నదే కాళోజీ మనస్ఫూర్తిగా నమ్మిన సిద్ధాంతం. అందుకోసం విభిన్న భావజాలాలు గల వాళ్ళందరితోనూ కలిసిపోయేవాడాయన. 

ఈ క్రమంలోనే ‘వ్యక్తిగత సిద్ధాంతాలు, అభిప్రాయాలు స్నేహానికి అడ్డు రాకూడదు’ అన్నది కాళోజీ అవగాహన.ఆయన చేసే ఈ స్నేహం కూడా వ్యక్తిగతమైనదేం కాదు. స్నేహాన్ని కూడా సామాజిక శ్రేయస్సు వైపునుంచే చూసేవాడాయన. ఆయన జీవిత చరిత్ర చదివితే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. 

వ్యక్తిగత జీవితమైనా, సామూహిక జీవితమైనా ప్రజా శ్రేయస్సు కోణంలోనే మలుచుకోవడం సాహితీవేత్తలలో బహుశా కాళోజి గారికి సాధ్యమైనట్టు మరొకరికి సాధ్యం కాలేదేమో! ఈ కోణంలోనే ఆయన తన స్నేహ ప్రపంచాన్ని విస్తరించుకున్నాడు. అందుకే ఆయన ‘తనకు స్ట్రేంజర్స్,స్నేహితులు తప్పితే పరిచయస్తులు ఎవరూ లేర’ని చెప్పేవాడు. పరిచయమైన వాళ్ళందరూ అతనికి స్నేహితులే. అయితే తన రాత ద్వారా, చేత ద్వారా తన స్నేహ ప్రపంచం మీద ఒక బలమైన ముద్రను వేశాడు కాళోజీ.

ఆయన విషయంలో ఇంకో విచిత్రం ఏమిటంటే -‘నాది కవిత్వమని నేను జెప్పిన్నా’ అంటాడు. ‘అదంతా నా గొడవ’ అని కూడా అంటాడు. ఇక్కడ కాళోజీ వయ్యక్తికంగా మాట్లాడుతున్నాడా? అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. ఒక సందర్భంలో శ్రీశ్రీ ‘ప్రజలది కానిదేది కవిత్వం కాద’న్నాడు. అయితే నా గొడవ అని చెప్పుకున్న కాళోజీ గొడవంతా ప్రజలదే కదా! అందుకే అది కవిత్వం కాకుండా పోదు. కాళోజీది బడి పలుకుల భాష అయినా అది కవిత్వం కాకుండా పోయేదేమో! కానీ ఆయనది ‘పలుకుబళ్ల భాష’.

 కవిత్వం మీదనే కాదు, ఆ కవిత్వంలోని భాష మీద కూడా ఒక స్పష్టమైన అవగాహన ఉన్నవాడు కాళోజి. అందుకే  సుప్రసిద్ధ కెన్యా రచయిత గుగీ వాథియాంగో భాషకు చెప్పిన రెండు స్వభావాల్లో ఒకటైన ‘రూలింగ్ స్వభావం’ మీద కూడా తన పోరాటాన్ని ఎత్తిపట్టాడు కాళోజీ. 

ఈ నేపథ్యంలోనే ‘‘రెండున్నర జిల్లాల రెండున్నర కులాల భాష’’లోని ఆధిపత్యాన్ని నిరసించాడు. అందుకే భాషకు రెండో లక్షణమైన కమ్యూనికేటివ్ స్వభావాన్ని తన కవిత్వానికి జీవ లక్షణంగా చేసుకున్నాడు. అందుకే ‘కాళోజీది కమ్యూనికేటివ్ కవిత్వం’ అన్నాడు ప్రసిద్ధ విమర్శకుడు తూర్పు మల్లారెడ్డి. ‘కబీర్, దాదు దయాళ్, వేమనల పరంపరలో కాళోజీ చివరివాడేమో’నన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తాడొక సందర్భంలో పీవీ నరసింహారావు. 

నిజమే! కాళోజీ లాంటి ఉద్యమ జీవి,ఉద్యమమే జీవితమైన మనిషి, పల్లె పట్టణంబులనక పల్లేర్లయి తిరిగే మనిషి ఈనాడు మనకు లభించడం అరుదే. ఎందుకంటే కాళోజీకంటూ వ్యక్తిగతమైన జీవితం లేదు. ఉన్నదంతా ప్రజా జీవితమే. నిస్వార్థంగా బతుకంతా ప్రజలకర్పించిన అచ్చమైన మనిషి కాళోజి. జయప్రకాష్ నారాయణన్ చనిపోయినప్పుడు అతనికి నివాళి అర్పిస్తూ కాళోజీ ‘పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది’ అనే విలువైన మాటలన్నాడు. నిజంగా ఆ మాటలు అక్షరాల కాళోజీకి కూడా వర్తిస్తాయి. 

- తోకల రాజేశం-

గమనిక:  మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీ పత్రంతో పాటు[email protected] కి మెయిల్​ చేయండి.