స్కూళ్లు, గుళ్ల దగ్గర వైన్ షాపులు బంద్.. సీఎం విజయ్ నిర్ణయానికి సెల్యూట్ చేసిన కమల్ హాసన్, విశాల్!

స్కూళ్లు, గుళ్ల దగ్గర వైన్ షాపులు బంద్.. సీఎం విజయ్ నిర్ణయానికి సెల్యూట్ చేసిన కమల్ హాసన్, విశాల్!

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. వెండితెరపై దళపతిగా కోట్లాది మంది గుండెల్లో చోటు సంపాదించుకున్న జోసెఫ్ విజయ్.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి పాలనలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. సీఎం కుర్చీలో కూర్చున్న కొద్దిరోజులకే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

వైన్ షాపులకు సీల్!

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రార్థనా మందిరాలు, విద్యాసంస్థలు, ముఖ్యంగా పాఠశాలల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని సీఎం విజయ్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో తమిళనాడు వ్యాప్తంగా ఏకంగా 717 మద్యం దుకాణాలు శాశ్వతంగా మూతపడనున్నాయి. సమాజంలో మహిళలు, విద్యార్థినుల భద్రతకు పెద్దపీట వేస్తూ విజయ్ వేసిన ఈ అడుగు ఇప్పుడు రాజకీయల్లోనే కాదు.. సినీ ఇండస్ట్రీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. సీఎం నిర్ణయంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

విశాల్ భావోద్వేగం.!

సీఎం విజయ్ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంపై కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ ప్రశంసల వర్షం కురిపించారు. హ్యాట్సాఫ్ టు యూ డియర్ సీఎం జోసెఫ్ విజయ్ అంటూ వీడియోను పోస్ట్ చేశారు. దేవాయాలు, పాఠశాలల సమీపంలోని వైన్ షాపులను మూసివేస్తున్నట్లు మీరు చేసిన ప్రకటన అద్భుతం.. ఇదొక గొప్ప మార్పు  అని కొనియాడారు. 

ఈ షాపుల వల్ల ఎంతోమంది బాలికలు వేధింపులకు గురవుతున్నారు . ఆర్కే నగర్‌లో నాకు తెలిసిన ఒక విద్యార్థిని.. ప్రతిరోజూ స్కూల్ నుండి ఇంటికి వెళ్లేటప్పుడు ఆ మద్యం దుకాణాల దాటి వెళ్లడానికి ఎంతటి ఒత్తిడి, భయం ఎదుర్కొంటుందో నాతో చెప్పి బాధపడిందని విశాల్ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ అమ్మాయితో పాటు ఎంతోమంది సామాన్య ప్రజలు మీ నిర్ణయాన్ని చూసి గర్విస్తున్నారు. మా అందరి ముఖాల్లోనూ మీరు ఎప్పటికీ నిలిచిపోయే చిరునవ్వును నింపారు. గాడ్ బ్లెస్ యూ విజయ్.. ఐ సెల్యూట్ యూ అండ్ యువర్ గవర్నమెంట్ అంటూ విశాల్ ట్వీట్ చేశారు.

 

కమల్ హాసన్ హర్షం!

మరోవైపు  నటుడు, ఎంపీ కమల్ హాసన్ సైతం ఎక్స్ వేదికగా విజయ్‌ను అభినందించారు. తమిళ ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్న కల ఇది. సోదరుడు విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ దిశగా ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవడం అభినందనీయమంటూ కొనియాడారు. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన విజయ్, ఇప్పుడు సీఎం సీట్లో కూర్చుని ప్రజా సమస్యలపై ‘రియల్ హీరో’లా విరుచుకుపడుతుండటం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో తమిళనాడులో మరిన్ని సంచలనాలు ఖాయంగా కనిపిస్తున్నాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.